భవిష్యత్తు సాధనంగా భావించే కృత్రిమ మేధస్సు (AI).. నాణేనికి రెండోవైపులా భయానక పరిస్థితులను కూడా సృష్టిస్తోంది. ప్రధానంగా అశ్లీలతను పెంపొందించే కంటెంట్ సృష్టిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనికి తోడు తప్పుడు ప్రచారాలతో జనాలను తప్పుదోవ పట్టించడంలో ముందు ఉంటోంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఆ జాబితాలోనిదే..
ఏఐ ఆధారిత వీడియోలు, ఫోటోలు, వాయిస్‌లు.. ఇప్పుడు ఇవన్నీ నిజాన్ని వక్రీకరించే సాధనాలుగా మారుతున్నాయి. ఈ దెబ్బకు ఏది నిజమో.. ఏది అబద్ధమో గుర్తు పట్టలేని స్థితికి మనిషి చేరుకుంటున్నాడు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా, సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేలా ఏఐ వినియోగం పెరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర చందద్రాపూర్ జిల్లాలోని బ్రహ్మపురిలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియో సారాంశం ఏంటంటే..
అక్టోబర్ 31వ తేదీన.. అటవీశాఖకు చెందిన అతిథి గృహం బయట ఓ వ్యక్తి కాపలాగా ఉన్నాడు. ఆ సమయంలో ఓ పెద్దపులి వచ్చి అతనిపై దాడి చేసి నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే.. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ వీడియో ఒరిజినల్‌ది కాదని అధికారులు స్పష్టం చేశారు. అది అసలైన వీడియో కాదు, AI ద్వారా రూపొందించబడినదని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దంటూ స్పష్టం చేశారు. ఈ వీడియోను క్రియేట్ చేసిన వాళ్లతో పాటు సర్క్యులేట్ చేసిన వాళ్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ ఘటన ఏఐ వినియోగం ఎంత ప్రమాదకరంగా మారిందో చాటిచెప్పింది. ఇలాంటి సాంకేతికతలు సాధనంగా ఉండాలే తప్ప సాధనంగా మారకూడదని, ప్రజల భద్రత, నైతికత, నిజాయితీకి భంగం కలిగించేలా ఏఐ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిపప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
सीसीटीवी रिकॉर्डिंग at ब्राह्मपुरी फारेस्ट गेस्ट हाउस. (चंद्रपुर डिस्ट्रिक)👇👇👇 pic.twitter.com/d4SGS2Fu6N
— Himmu (@Himmu86407253) November 7, 2025
AI వల్ల కలిగే ప్రమాదాలు:
• నకిలీ వీడియోలు: నిజమైనవిగా ప్రచారం చేయడం ద్వారా భయాన్ని, అవమానాన్ని, రాజకీయ అస్థిరతను కలిగించే అవకాశం
• డీప్‌ఫేక్ టెక్నాలజీ: ప్రముఖుల ముఖాలు, వాయిస్‌లు మార్చి తప్పుడు సమాచారం సృష్టించడం
• సామాజిక గందరగోళం: ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం, అధికారిక ప్రకటనలపై అనుమానం కలగడం
ప్రజలకు సూచనలు:
• ధృవీకరించని వీడియోలు, ఫోటోలు షేర్ చేయవద్దు
• అధికారిక వనరుల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలి


