ఏమిటీ సంగం నోస్‌?  | Explanation of Maha Kumbh Sangam Nose | Sakshi
Sakshi News home page

ఏమిటీ సంగం నోస్‌? 

Jan 30 2025 6:10 AM | Updated on Jan 30 2025 1:04 PM

Explanation of Maha Kumbh Sangam Nose

మహాకుంభమేళాలో సంగం నోస్‌ అనే ఘాట్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరగడంతో ఈ ఘాట్‌ వద్దే జనం ఎందుకు ఎక్కువగా పోగుబడ్డారు? అసలు ఈ ఘాట్‌ విశేషాలు ఏంటీ? అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలు అయ్యాయి. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమ స్థలిగా పేర్కొంటారు. పైన ఉత్తరం దిక్కు నుంచి గంగా నది, ఎడమ వైపు దక్షిణ దిక్కు నుంచి యమునా నది వచ్చి ఒక వంపు వద్ద కలుస్తాయి. 

ఈ ప్రాంతం ఆకాశం నుంచి చూస్తే దాదాపు మనిషి ముక్కులాగా కనిపిస్తుంది. అందుకే త్రిభుజాకారంలో ఉండే ఈ ప్రాంతానికి జనబాహూళ్యంలో ‘సంగం నోస్‌(ముక్కు)’అనే పేరు కూడా ఉంది. అంతర్వాహిణిగా సరస్వతి నదీ ప్రస్తావనను పక్కనబెడితే ప్రయాగ్‌రాజ్‌ నగర శివారులో రెండు నదులు కలవకముందు విస్తరించి ఉన్న సువిశాల నదీ తీరాల పొడవునా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో భాగంగా పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే నదులు కలవకముందు ప్రవాహాల తీరాల వెంట పుణ్యస్నానాలు ఆచరించడం కంటే మూడు నదులు కలిసే ఈ ‘సంగం నోస్‌’వద్ద పుణ్నస్నానం ఆచరిస్తేనే మోక్షం లభిస్తుందనే వాదనా బలంగా వినిపిస్తోంది. చాలా మంది భక్తులు సైతం దీనినే విశ్వసిస్తారు. 

సాధువుల స్నానాలు ఇక్కడే 
సాధారణ భక్తుల విషయం పక్కనబెడితే నాగ సాధువులు, అఖాడాల సభ్యులు, ప్రముఖులు అంతా దాదాపు ఈ సంగం నోస్‌ వద్దే స్నానాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. శతాబ్దాల క్రితం జనాభా తక్కువ, అందులోనూ ఇంతటి భక్తజనకోటి లేరుకాబట్టి ఆనాడు కుంభమేళాకు విచ్చేసిన భక్తులంతా కేవలం ఈ త్రివేణి సంగమ స్థలి వద్దే పవిత్ర స్నానాలు ఆచరించేవారని స్థానికులు చెబుతున్నారు. దీంతో తాము కూడా ఈ సంగం నోస్‌ వద్దే పుణ్నస్నానాలు ఆచరించాలని ఈ విషయం తెల్సిన చాలా మంది భక్తులు భావిస్తారు.

 సంగం నోస్‌ వద్ద వేర్వేరుగా వచ్చి గంగా, యమునా నదీ ప్రవాహాలు ఒక్కటిగా కలిసిపోయి ముందుకుసాగడం చూడొచ్చు. ఇక్కడ రెండు నదులు వేరువేరు రంగులలో కనిపిస్తాయి. యమునా నదీజలాలు లేత నీలం రంగులో, గంగాజలం కొద్దిగా బురదమయంగా కనిపిస్తుంది. యమునా నది ఇక్కడ గంగానదిలో కలిసి అంతర్థానమవుతుంది. అంతర్వాహిణిగా సరస్వతి నది సైతం సంగమించే ఈ ప్రాంతాన్నే కుంభమేళాలోని ప్రధాన సంగం ఘాట్‌గా చాలా మంది భావిస్తారు. వివిధ సంప్రదాయాలకు చెందిన అఖాడా సాధువులు తమ ఆచారాలు, అమృత స్నానాలను సంగం నోస్‌ వద్దే ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది.  

ఇరుకు ప్రాంతాన్ని విశాలంగా విస్తరించి.. 
సంగం నోస్‌ వాస్తవానికి ముక్కు చివరలాగా కాస్తంత ముందుకు సాగినట్లు ఉండే నదీతీర ప్రాంతం. ఇక్కడ ఎక్కువ మంది స్నానాలు ఆచరించడానికి వీలుపడదు. కానీ జనం ఇక్కడే ఎక్కువగా స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒడ్డు వెంట ఇసుక బస్తాలు వేసి, డ్రెడ్జింగ్‌ చేసి ఎక్కువ మంది కొనదాకా వచ్చి స్నానాలు చేసేలా దీనిని పెద్ద ఘాట్‌గా మార్చారు. ఇలా సంగం నోస్‌ వద్ద తూర్పువైపుగా శాస్త్రి వంతెన సమీపంలో 26 హెక్టార్ల భూభాగం అదనంగా అందుబాటులోకి తెచ్చారు. మరో కిలోమీటరున్నర పొడవునా ఇసుక బస్తాలు వేసి ఘాట్‌ను విస్తరించారు. దీంతో సంగం నోస్‌ ఘాట్‌ వద్ద ఒకేసారి ఎక్కువ మంది స్నానాలు చేసే వెసులుబాటు లభించింది.

 గతంలో 2019 ఏడాది కుంభమేళాలో ఈ ఘాట్‌లో ప్రతి గంటకు 50,000 మంది స్నానాలు చేశారు. విస్తరణ తర్వాత ఈసారి ఇక్కడ గంటకు ఏకంగా 2,00,000 మంది భక్తులు స్నానాలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. జనవరి 13, 14 తేదీల్లో ఇక్కడే గంటకు 3,00,000 మంది పుణ్యస్నానాలు చేశారు. అయితే సాధువులు హాజరయ్యే ’అమృత స్నానం’ రోజున సాధారణ భక్తులను ఈ సంగం నోస్‌ ఘాట్‌లోకి రాకుండా ఆపేస్తారు. ’అమృత స్నానం’ కాకుండా మిగతా రోజుల్లో ఆవలి వైపు ఒడ్డు నుంచి వేరే ఘాట్‌ల నుంచి పడవల్లో ఇక్కడికి చేరుకుని స్నానాలు చేస్తుంటారు. అయితే అమృత స్నానం వంటి రోజుల్లో మాత్రం సంగం నోస్‌ ఘాట్‌ల వద్దకు పడవలను అనుమతించబోరు. వాస్తవానికి 4,000 హెక్టార్లలో విస్తరించిన ఘాట్‌లలో సంగం నోస్‌ కూడా ఒకటి.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement
 
Advertisement
Advertisement