వృద్ధ కళాకారుడి బతుకుపోరాటం.. అండగా ఆనంద్‌ మహీంద్ర | 80 Year Old Violinist Struggle Touches Anand Mahindra Heart, Internet Rallies To Help, Check More Details Inside | Sakshi
Sakshi News home page

వృద్ధ కళాకారుడి బతుకుపోరాటం.. అండగా ఆనంద్‌ మహీంద్ర

Jun 25 2026 7:57 AM | Updated on Jun 25 2026 11:54 AM

Elderly Violinists Struggle Moves Anand Mahindra to Offer Help

చప్పట్లు కొట్టే ప్రేక్షకులు లేరు. పెద్ద వేదిక లేదు. కానీ చేతిలో వయోలిన్‌, హృదయంలో సంగీతం మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీధుల్లో దశాబ్దాలుగా వయోలిన్‌ వాయిస్తూ జీవనం సాగిస్తున్న 80 ఏళ్ల భగవాన్‌ మల్లిక్‌ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా హృదయాలను కదిలిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం ఆయన పరిస్థితికి చలించి సాయం చేయడానికి ముందుకు రావడంతో ఈ కథ మరింత మందికి చేరింది.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన భగవాన్‌ మాలిక్‌.. యుక్తవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అయితే తండ్రి నేర్పించిన సంగీతమే ఆయనకు ఆధారం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీధుల్లో వయోలిన్‌ వాయిస్తూ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నారు. వయసు 80 దాటినా, కంటి చూపు మందగించినా, చేతిలోని వయోలిన్‌ పాతబడిపోయి శిథిలావస్థకు చేరినా ఆయన సంగీత ప్రయాణం మాత్రం ఆగలేదు.

ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు కోల్‌కతాలోని న్యూ టౌన్‌ ప్రాంతంలో వయోలిన్‌ వాయిస్తూ కనిపించే మల్లిక్‌ రోజుకు వంద రూపాయల వరకే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఆయన భార్య కూడా తరచూ పక్కనే కూర్చొని తోడుగా ఉంటోంది. అద్దె ఇంట్లో జీవిస్తున్న ఈ వృద్ధ దంపతుల పరిస్థితిని.. కంటెంట్‌ క్రియేటర్‌ ఆరాధనా చటర్జీ సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో కథనం వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) స్పందిస్తూ, “ఆయన సంగీతంపై ఉన్న అభిరుచి నన్ను కదిలించింది. నేను కూడా సాయం చేయాలనుకుంటున్నాను. ఆయనకు ఎలా సహాయం చేయాలో వివరాలు కావాలి” అని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆయన స్పందనతో మరింత మంది భగవాన్‌ మల్లిక్‌ పరిస్థితి గురించి తెలుసుకుని సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.

ఇప్పటికే ఆరాధనా చటర్జీ మల్లిక్‌కు కొత్త వయోలిన్‌ను బహుమతిగా అందించడమే కాకుండా, ప్రజల సహకారంతో లక్ష రూపాయల నిధులు కూడా సమీకరించినట్లు వెల్లడించారు. ఒక సాధారణ వీడియోతో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా మానవత్వానికి నిదర్శనంగా మారింది. దశాబ్దాలుగా జీవన పోరాటంలో సంగీతాన్ని ఆయుధంగా మార్చుకున్న భగవాన్‌ మల్లిక్‌ కథ... ప్రతిభకు వయసు అడ్డుకాదని, నిజమైన కళాకారుడు పరిస్థితులు ఎంత కఠినమైనా తన కళను వదలడని మరోసారి గుర్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement