E20 పెట్రోల్‌ సేఫేనా?.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వ్యాఖ్యలు | E20 Petrol Still In Trial Phase, More Time Needed To Assess Safety, Centre Tells Supreme Court, More Details Inside | Sakshi
Sakshi News home page

E20 పెట్రోల్‌ సేఫేనా?.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వ్యాఖ్యలు

Jun 30 2026 1:32 PM | Updated on Jun 30 2026 1:56 PM

E20 Petrol Still in Experimental Phase Centre Tells Supreme Court

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం (E20) పెట్రోల్‌ పై వినియోగదారులు, ఆటోమొబైల్‌ రంగంలో వ్యక్తమవుతున్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. E20 ఇంధన విధానం ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, కాబట్టి సురక్షితమా? కాదా? అని తేలడానికి ఇంకా సమయం పడుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది.

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఓ ఉత్తర్వును సవాల్‌ చేస్తూ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL) దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి ఈ వ్యాఖ్యలు చేశారు. 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం ప్రభుత్వ విధానంలో భాగమైనప్పటికీ, దాని ప్రభావాన్ని నిరంతరం పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపారు.

ఇటీవల E20 పెట్రోల్‌ వల్ల పాత వాహనాల ఇంజిన్లకు నష్టం కలుగుతుందా? మైలేజ్‌ తగ్గుతుందా?.. కాలుష్యం జరుగుతుందా? అనే సందేహాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. అయితే ఈ ఆందోళనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. E20 ఇంధనం వల్ల వాహనాలకు నష్టం జరుగుతుందనే నిర్ధారిత ఆధారాలు ఇప్పటివరకు లేవని ప్రభుత్వం పేర్కొంది.

ఇంకా ఇథనాల్‌ మిశ్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడం, విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం, కార్బన్‌ ఉద్గారాల తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయని కేంద్రం మరోసారి నొక్కి చెప్పింది. ఈ విధానం ద్వారా భారత్‌ ఇప్పటికే రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని తెలిపింది.

దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం (E20) అమలు లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించిన గడువు(2030) కంటే ముందుగానే సాధించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ సరఫరా ప్రారంభమైంది. ఇప్పుడు 2030 నాటికి ఇథనాల్‌ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే E20పై వినియోగదారుల సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి ఈ విధానం ప్రభావంపై స్పష్టమైన అంచనా వస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement