త్రిసూర్: కేరళలోని త్రిసూర్ జిల్లాలో దివ్యాంగులైన లాటరీ విక్రేతలను మోసం చేసి, డబ్బులు చెల్లించకుండా లాటరీ టిక్కెట్లతో పరారైన 57 ఏళ్ల వ్యక్తిని అంతికాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడని చొవ్వల్లూరుకు చెందిన కబీర్‌గా గుర్తించారు. గురువాయూర్‌లో పోలీసులు కబీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 21న ఉదయం అంతికాడ్‌కు చెందిన దివ్యాంగులైన నటరాజన్, ప్రియ అనే ఇద్దరు లాటరీ విక్రేతల వద్దకు నిందితుడు కస్టమర్‌గా వచ్చి ఈ మోసానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కబీర్ స్కూటర్‌పై వచ్చి, టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి వారి నుండి లాటరీ టిక్కెట్లను సేకరించాడు. ఆ తర్వాత వాటికి డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుండి స్కూటర్‌పై వేగంగా పరారయ్యాడు. బాధితుడైన నటరాజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అంతికాడ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సేకరించిన సమాచారంతో నిందితుడిని గురువాయూర్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. అంతికాడ్ సబ్-ఇన్‌స్పెక్టర్ విష్ణు నేతృత్వంలోని పోలీస్ బృందం అతనిని అదుపులోనికి తీసుకుంది. నిందితుడు కబీర్ గతంలోనూ ఇదే పద్ధతిలో లాటరీ విక్రేతలను లక్ష్యంగా చేసుకుని టిక్కెట్లు దొంగిలించేవాడని పోలీసులు దర్యాప్తులో తేలింది.


