యశవంతపుర: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అపహరణ, హత్య కేసులో జీవితఖైదు పడిన శంకర్ ఆర్ముగం అనే నేరగాడు నకిలీ సుప్రీంకోర్టు తీర్పు కాపీలు సృష్టించి విడుదలైన కేసులో జుగుప్సాకరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో జైళ్ల శాఖ డీఐజీ సోమశేఖర్‌ను పరప్పన అగ్రహార పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా గుట్టు రట్టయింది. పోలీసు వర్గాల సమాచారం మేరకు.. శంకర్‌ను కలవడానికి అతని భార్య తరచుగా జైలుకు వచ్చేది.
ఆ సమయంలో జైలు సూపరింటెండెంటుగా ఉన్న సోమశేఖర్ తన అధికారాన్ని ఉపయోగించుకుని ఆమెతో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడు. తరచుగా నగ్న వీడియో కాల్స్ చేయించుకునేవాడు. ఇలా శంకర్‌తో కుమ్మక్కయిన అతడు విడుదలకు కుట్ర రూపొందించాడు. జైలులోని క్లర్కు శ్రీకాంత్ ద్వారా నకిలీ సుప్రీంకోర్టు ఆదేశాలను సృష్టించి, వాటిని శంకర్ భార్యకు అందజేశాడు. ఆమె ద్వారా జైలుకు సమర్పించి, ఆమోదింపజేసి జీవితఖైదీని విడుదల చేయించాడు.
శంకర్ రెండో పెళ్లితో..
తరువాతే వ్యవహారం మలుపు తిరిగింది. 2018 ఆఖరులో విడుదలైన శంకర్ భార్యను దూరం పెట్టి, మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన మొదటి భార్య జైళ్ల శాఖ చీఫ్‌కు నకిలీ సుప్రీంకోర్టు తీర్పు గురించి ఉత్తరం రాసింది. దీంతో వ్యవహారం గుట్టురట్టు కావడంతో శంకర్, క్లర్కు శ్రీకాంత్‌లను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. వారి విచారణలో సోమశేఖర్ పాత్ర బయటపడింది. ఇక న్యూడ్ కాల్స్ వీడియోలను పోలీసులు పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
ఇదీ చదవండి: రెండు తలల పాము రూ.కోటి


