సాక్షి, ఢిల్లీ: ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అయితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు కాసేపటి కిందట చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరింది. గాయపడిన మరో 17 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి (LNJP హాస్పిటల్) ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.
ఉగ్రసంస్థతో లింకులు ఉన్న డాక్టర్ ఉమర్ మహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. ఎర్రకోట పేలుడు ఘటన కేసులో ఉమర్ కుటుంబ సభ్యులు సహా ఆరుగురిని జమ్ముకశ్మీర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్లలో ఉమర్ తల్లి షమీనా భానో, ఉమర్ సోదరులు ఆశిక్ అహ్మద్, జాహ్ర్ అహ్మద్‌తో పాటు ప్లంబర్‌గా పని చేసే అమిర్ రషీద్, ప్రభుత్వ ఉద్యోగి అమీర్ రషీద్ మిర్, బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ తారీఖ్ మాలిక్ ఉన్నారు.
జమ్ము కశ్మీర్ పహల్గాంకు చెందిన ఉమర్.. ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో.. తానూ దొరకిపోతాననే కంగారులో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు ముందు కారు తిరిగిన ప్రదేశాలను సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఉదయం 8గం. ప్రాంతంలో బదర్పూర్ టోల్ బూత్ నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐ20 కారు.. పావు గంట తర్వాత ఓకల పెట్రోల్ పంపు స్టేషన్ వద్ద కనిపించింది. మధ్యాహ్నం 3:19గం. సమయంలో ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో ఎంట్రీ ఇచ్చింది. సాయంత్రం 6:22 నిమిషాలకు పార్కింగ్ ఏరియా నుంచి బయటికి వచ్చింది. ఆ సమయంలోనూ కారులో ఉమర్ ఉన్నాడు. సరిగ్గా.. రాత్రి 6: 50 నిమిషాలకు ఎర్రకోట సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతూ భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ఉమర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి: ఉగ్రవాదంవైపు డాక్టర్లు.. అసలేంటీ వైట్‌కాలర్ టెర్రరిజం?


