వారం వ్యవధిలో.. అదీ నాలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలతో నలుగురు డాక్టర్లు అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో వీళ్ల వద్ద నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, విషపదార్థాలు (రిసిన్, అమ్మోనియం నైట్రేట్) స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పరిణామం చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం గమనార్హం.
డాక్టర్ల అరెస్టుతో బయటపడిన అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ వెలుగు చూసింది. ఢిల్లీ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అధ్యాపకుడు డా. ముజమ్మిల్ షకీల్, జమ్ము కశ్మీర్‌కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, గుజరాత్‌లో డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తర ప్రదేశ్ సహారన్‌పూర్‌లో ఓ మహిళా డాక్టర్‌ను అరెస్ట్ అయిన వాళ్లలో ఉన్నారు. జమ్ము కశ్మీర్, ఫరీదాబాద్ పోలీసు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో ఈ నలుగురు పట్టుబడ్డారు. డాక్టర్లను ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో వాళ్లు ఉగ్ర సంస్థలకు టచ్‌లో ఉంటూ.. దాడులకు ప్రణాళికలు రచించినట్లు నిర్ధారణ అయ్యింది.
వీళ్లు జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇంటర్నేషనల్ హ్యాండ్లర్లు వీళ్లను ప్రభావితం చేశారని స్పష్టమవుతోంది. అంతేకాదు.. వీళ్లలో ఇద్దరు 2018-2021 మధ్య కాలంలో కశ్మీర్‌లో గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స అందించినట్లు తేలింది. దీంతో.. ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ మాడ్యూల్‌ను మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రదాడిగా అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో.. వీళ్లు పట్టుబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైట్ కాలర్ టెర్రరిజం..
ఇలా ప్రొఫెనల్ వృతుల్లో ఉంటూ ఉగ్రవాదం వైపు మళ్లడమే వైట్ కాలర్ టెర్రరిజం. మేధావులు, విద్యావంతులు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లేదంటే.. ఆ చర్యలకు పరోక్షంగా సహకరించడం చేస్తుంటారు. జైష్-ఎ-మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి సంస్థలు ఈ మద్దతుతో లబ్ధి పొందుతున్నాయి. అలా దీని మూలాలు భారత్‌లోనూ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 1990 తర్వాత ఇది గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ, గ్లోబలైజేషన్.. విద్యావంతుల మధ్య ధోరణి మార్పుల కారణంగా ఇది పెరిగిపోతోంది. సైబర్ టెర్రరిజం, ఫైనాన్షియల్ మద్దతు, బయో టెర్రరిజం వంటి ఆధునిక రూపాలను సంతరించుకుంటోంది.


