భానుడి భగభగలకు బ్రేక్‌.. ఎట్టకేలకు ఢిల్లీకి ఊరట | Delhi-NCR Gets Much-Needed Relief as Heavy Rain Triggers Red Alert | Sakshi
Sakshi News home page

భానుడి భగభగలకు బ్రేక్‌.. ఎట్టకేలకు ఢిల్లీకి ఊరట

Jul 2 2026 8:05 AM | Updated on Jul 2 2026 8:09 AM

Delhi-NCR Gets Much-Needed Relief as Heavy Rain Triggers Red Alert

కొన్ని రోజులుగా భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు ఎట్టకేలకు భారీ వర్షాలు ఊరటనిచ్చాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే పరిస్థితుల తీవ్రత దృష్ట్యా.. అనూహ్యంగా రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది భారత వాతావరణ శాఖ.

జూన్‌ మొత్తం కూడా ఢిల్లీలో తీవ్ర ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, భరించలేని ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. పగటి వేళ బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రతతో పాటు గాలిలో తేమ అధికంగా ఉండటంతో ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడి అనిపిస్తూ ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కోసం ఢిల్లీ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో వరుణుడు కరుణించాడు. గురువారం ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు కూడా నమోదయ్యాయి. ఆకాశమంతా మేఘాలు కమ్ముకోవడంతో పగటిపూటే చీకటి వాతావరణం కనిపించింది.

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం మరికొన్ని గంటల్లో.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కొన్ని చోట్ల 100 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్‌ను రెడ్‌ అలర్ట్‌గా మార్చి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

ఈ వర్షాలతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. అయితే భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు చెట్ల కింద, బలహీన నిర్మాణాల వద్ద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement