ఫీజుల కోసం హింసిస్తారా?  | Delhi High Court slams schools for using Bouncers in fee disputes | Sakshi
Sakshi News home page

ఫీజుల కోసం హింసిస్తారా? 

Jun 6 2025 5:16 AM | Updated on Jun 6 2025 5:16 AM

Delhi High Court slams schools for using Bouncers in fee disputes

స్కూల్లోకి కాలు కూడా పెట్టనివ్వరా? 

బౌన్సర్లను పెట్టి మరీ అడ్డుకుంటారా? 

ప్రైవేట్‌ స్కూల్‌పై ఢిల్లీ హైకోర్టు ధ్వజం

న్యూఢిల్లీ: మంచి మార్కులొచ్చే విద్యార్థులను ఉచిత బోధన పేరుతో గద్దల్లా తన్నుకుపోయే ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు ఫీజు సరిగా కట్టకపోతే కనీసం గేటు దాటి లోపలికి కూడా రానివ్వడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఫీజు సవ్యంగా కట్టలేదన్న అక్కసుతో విద్యార్థులను బౌన్సర్లతో అడ్డుకోవడంపై మండిపడింది. 

విద్యాలయాల్లో ఇలాంటి పెడ ధోరణులను ఉపేక్షించే ప్రసక్తే లేదని జస్టిస్‌ సచిన్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఫీజు వివాదాన్ని సాకుగా చూపి విద్యార్థులను స్కూల్లోకి అనుమతించకపోవడం, అందరి ఎదుటా అవహేళన చేయడం క్షమార్హం కాదు. విద్యాలయాల్లో ఇలాంటి సంస్కృతి కొనసాగేందుకు వీల్లేదు. ఫీజు కట్టాలని బౌన్సర్లను పెట్టి మరీ బెదిరించడం విద్యార్థులను తీవ్రస్థాయిలో వేధించడమే. 

ఇది చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది వారి ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయడమే’’ అని పేర్కొంది. ఫీజులు సరిగా చెల్లించలేదని దేశ రాజధానిలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ 31 మంది విద్యార్థులను బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటోందని, బెదిరిస్తోందని నమోదైన కేసును ధర్మాసనం గురువారం విచారించింది. 

ఫీజు కట్టలేదని విద్యార్థుల పేర్లను రికార్డుల నుంచి తొలగించి డిబార్‌ చేసిన యాజమాన్యం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో వారిని తిరిగి చేర్చుకుంటామని విన్నవించింది. ఇకపై విద్యార్థులను తొలగించాలంటే నిబంధనల ప్రకారం తొలుత తల్లిదండ్రులకు ముందస్తు సమాచారమిచ్చి ఫీజు చెల్లింపుపై వారి వాదన విని్పంచేందుకు అవకాశం ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశించింది. 2025–26 విద్యా సంవత్సరానికి పెంచిన ఫీజులో సగం చెల్లించాలని తల్లిదండ్రులకు సూచించింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement