మెగా డీఎస్సీ స్కామ్‌కు సమాధానమేది | Lokesh, Chandrababu not answer any question DSC candidates in Assembly | Sakshi
Sakshi News home page

అక్రమాల ‘కోటా’.. అవినీతి ‘ఆట’! మెగా డీఎస్సీ స్కామ్‌కు సమాధానమేది

Aug 18 2026 4:58 AM | Updated on Aug 18 2026 5:04 AM

Lokesh, Chandrababu not answer any question DSC candidates in Assembly

బాధిత అభ్యర్థుల ఏ ఒక్క ప్రశ్నకూ అసెంబ్లీలో సమాధానం చెప్పని లోకేష్, చంద్రబాబు  

డీఎస్సీ టీచర్‌ పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకలు.. ప్రతిభకు తీవ్ర నష్టం 

అసలు పరీక్షే లేకుండా టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి?  

స్పోర్ట్స్‌ కోటా జీవోలు ఎందుకు మార్చారు? 

స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధృవీకరించేది కూడా మీరేనా.. 

పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా? కేవలం పార్టిసిపేట్‌ చేస్తే చాలా? 

జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? 

ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ బాధ్యత.. రెండూ ఒకరి చేతికేనా? ఇక్కడే స్కామ్‌కు నాంది.. అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడ్‌ ప్రక్రియలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 

ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగే డీఎస్సీలో టాప్‌ ర్యాంకర్‌.. 

విద్యాశాఖ విడుదల చేసిన మొదటి మెరిట్‌ లిస్ట్‌లో నవీన్‌కు ఫస్ట్‌ ర్యాంకు.. రెండో సారి విడుదల చేసిన మెరిట్‌ లిస్ట్‌లో నవీన్‌ వివరాలు ఎందుకు తొలగించారు? టాప్‌ ర్యాంకర్‌కు పోస్టు ఎందుకు ఇవ్వలేదు? 

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెబుతారా? 

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? 

కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు? 

1 : 1లో వెరిఫికేషన్‌కు పిలిచి.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?.. ఎవరికోసం ‘సర్దుబాటు?’ 

336 కేసులు వేశారంటూనే.. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయిస్తారా? 

బేరసారాల ఆడియోపై కేసు నమోదైనా సూత్రధారులెవరో బయట పెట్టరా? 

స్కామ్‌కు ఇవన్నీ సాక్ష్యాలు కాదా? న్యాయం కోసం సీబీఐతో విచారించాల్సిందే  

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 కుంభకోణంపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ప్రజల్లోకి వెళ్లడం.. నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, యువత, జెన్‌జీ దీనికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడంతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు నిద్ర పట్టడం లేదు. అందుకే దాన్ని కప్పిపుచ్చేందుకు, పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఆపసోపాలు పడుతున్నారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారించాలనే డిమాండ్లు రోజురోజుకీ వెల్లువెత్తుతుండటంతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును కాపాడేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం అసెంబ్లీలో తండ్రి, కుమారుడు డీఎస్సీ అక్రమాలను సమర్థించుకుంటూ తప్పుదోవ పట్టించేలా కళ్లార్పకుండా అబద్ధాలు వల్లె వేశారని, అడ్డగోలు వాదనలు వినిపించారని విద్యావేత్తలు, రాజ­కీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అని నిలదీస్తున్నారు. ‘‘ప్రశ్నా­పత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కే అప్పగించారు. 

స్కామ్‌కు ఇక్కడే మొట్ట­మొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నా­పత్రం తయారీ, అప్‌లోడ్‌ బాధ్యతలను ఔట్‌సోర్స్‌ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. కీలక బాధ్యతను అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్‌ ర్యాంక్‌ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్‌మాల్‌ కాక మరేంటి? పేపర్‌ లీక్‌ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్‌ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్‌లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్‌ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్‌ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్‌ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యో­గం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్‌ లిస్ట్‌లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. 


ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు. పరీక్ష నిర్వహణ వ్యవ­స్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్‌ ర్యాంకులు దక్కించుకోవ­డం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? స్పోర్ట్స్‌ కోటా జీవోలు ఎందుకు మార్చారు? పతకాలు లేకపోయినా కేవలం పార్టిసిపేట్‌ చేస్తే ఉద్యోగాలిస్తారా? జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? సొంత పార్టీ నేతలే క్రీడా ధృవీకరణ పత్రాలు ఇవ్వటాన్ని నిస్సిగ్గుగా ఎలా సమర్థించుకుంటారు? మెగా డీఎస్సీపై 336 కేసులు వేశారంటూనే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయించడం ఏమిటి? టీచర్‌ పోస్టులకు బేరసారాల ఆడియోపై తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదుతో సరిపుచ్చి అసలు సూత్రధారు­లెవరో బయట పడకుండా తొక్కిపెడుతున్న­దెవరు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయనే. ఆయన కుమా­రుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్‌ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారించాలి’’ అని బాధిత అభ్యర్థులు, నిరుద్యో­గులు స్పష్టం చేస్తున్నారు. కీలక ప్రశ్నలకు లోకేశ్‌ సమాధానం చెప్పకుండా సవాళ్లు విసరటాన్ని, సభ సాక్షిగా వ్యక్తిగత దూషణలకు దిగటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమకు సమాధానం చెప్పాల్సిందేనని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ ఇచ్చిన రోజే స్పోర్ట్స్‌ కోటాలో నియామకాలకు అర్హత పరీక్ష ఎత్తివేస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 4, జీవో నంబర్‌ 47 

ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ ఒకరికే
ఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నల అప్‌లోడ్, డిజిటల్‌ నిర్వహణ అత్యంత గోప్యంగా జరగాలి. డీఎస్సీ ప్రశ్నాపత్రా­లను ఎస్‌సీఈఆర్‌టీ రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌ చూస్తారు. కానీ ఇక్కడ డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండు బాధ్యతలను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు బీజం పడింది ఇక్కడే. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడ్‌ బాధ్యతలను అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చేతుల్లో పెట్టడం వెనుక ఉద్దేశమేంటి?

‘వెరిఫికేషన్‌కు రాలేదు’.. మరి కాల్‌ లెటర్‌ ఏది?
మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి ధ్రువపత్రాల పరిశీలనకు రాలేదని, అందుకే పోస్టు ఇవ్వలేదని లోకేష్, చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాకమ్మ కబుర్లు కాదా? ఎందుకంటే.. మెరిట్‌ జాబితాలో ఆ అభ్యర్థి పేరు తీసేశారు.. అభ్యర్థి డేటాను మాయం చేశారు.. కాల్‌ లెటర్‌ ఇవ్వలేదు.. ఇక అలాంటప్పుడు ధృవపత్రాల పరిశీలనకు ఎలా వస్తాడు? అసలు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాలేదని చెబుతున్న వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? అతడు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది.

అవన్నీ గోల్‌మాల్‌ కాక మరేంటి?
కీలక బాధ్యతలను అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అప్పగించడం..అతడికి టాప్‌ ర్యాంకు రావడం.. ఆ తర్వాత పోస్టు ఇవ్వకపోవడం.. అతడి వివరాలను మాయం చేయడం.. ఇవన్నీ గోల్‌మాల్‌ కాక మరేంటి? దీనంతటికీ అర్థం పేపర్‌ లీక్‌ అయిందని అంగీకరించినట్లే కదా? పేపర్‌ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్‌ యాక్సెస్‌ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్‌ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐతో విచారణ జరగాలి.


కలెక్టరేట్‌లు డమ్మీ.. పారదర్శకత ఎక్కడ?
గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. మెగా డీఎస్సీలో కలెక్టరేట్‌లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్‌ జాబితాలు లేవు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు. బహిరంగంగా జాబితాలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సందేశాలు పంపించే కొత్త పద్ధతి తీసుకొచ్చారు. అసలు పారదర్శకత ఎక్కడ ఉంది? సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్‌లకు వెళ్తే పైకి వెళ్లండని, మాకు సంబంధం లేదని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆన్‌లైన్‌ పేరుతో మొత్తం ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

వన్‌ టు వన్‌ పిలిచి.. ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?
ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్‌ లెటర్లు పంపారు. నిబంధనల ప్రకారం మెరిట్, రోస్టర్‌ ఆధారంగా ధృవపత్రాల పరిశీలన చేపట్టారు. అంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? ఓపెన్‌లోకి వస్తారా? రిజర్వేషన్‌లోకి వస్తారా? ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికులు వంటి వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే తెలుసు. అందుకే 1 : 1 కింద పిలిచారు. మరి ధృవపత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలిన వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? వారిని తిరస్కరించిన జాబితాలో కూడా ఎందుకు చూపలేదు? ప్రశ్నిస్తే సర్దుబాటు అంటున్నారు. ఎవరి కోసం ఈ సర్దుబాటు? వీటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. 

పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా?
క్రీడాకారుల ప్రతిభ చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. పతకాలు చూడలేదు. కేవలం ఆటల్లో పాల్గొన్న ధృవపత్రం ఉంటే చాలు టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చేశారు. బాల్‌ బ్యాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 270 మందికి పతకాలు లేకపోయినా కేవలం పాల్గొన్నందుకే టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చారు. అంతర్‌ కళాశాల పోటీల్లో పాల్గొన్న 99 మందికి ఉద్యోగాలు రాగా.. వారిలో 86 మందికి పతకాలు, ట్రోఫీలు లేవు. అంతర్‌ జిల్లా పోటీల్లో 59 మందికి ఉద్యోగాలు రాగా వారిలో 18 మందికి కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చారు.


ధృవపత్రాలు ఇచ్చేదీ.. ధృవీకరించేదీ వారేనా?
సాఫ్ట్‌బాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జూడో సంఘం అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ భరత్‌ ఉన్నారు. వాళ్లే ధృవపత్రాలు ఇచ్చి.. వాళ్లే ధృవీకరించి.. వాళ్లే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎలా వచ్చింది? అంటే నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరగలేదా? జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ఉద్యోగాలు రాకుండా.. కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు రావడం న్యాయమా?

ఒక్కో పోస్టుకు రూ.15–20 లక్షల బేరసారాలా?
స్పోర్ట్స్‌ కోటా పోస్టులకు ఒక్కొక్కదానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగినట్లు ఆడియో రికార్డులు సైతం బయటకు వచ్చాయి. ప్రభుత్వ చిహ్నాన్ని ప్రొఫైల్‌ ఫొటోగా పెట్టుకుని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌తో వదిలేశారు. వీడియో కాల్‌ చేసిన వ్యక్తి ఫోన్‌ నంబర్‌ స్పష్టంగా ఉన్నా ఎఫ్‌ఐఆర్‌లో పేరు వెల్లడించకుండా అనుమానితుడిగా మాత్రమే పేర్కొనడం ఎందుకు? ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే దానికి సమాధానం లేదు. 

నిజాలు తేలాలంటే సీబీఐ విచారణే..
మెగా డీఎస్సీ వ్యవహారంలో ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు.. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రవేశం నుంచి టాప్‌ ర్యాంకు వరకు.. మెరిట్‌ జాబితా మార్పుల నుంచి కాల్‌ లెటర్ల వరకు.. స్పోర్ట్స్‌ కోటా నుంచి బేరసారాల ఆరోపణల వరకు అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విచారణ జరిగితే నిష్పక్షపాతంగా నిజాలు బయటకు వస్తాయా? స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడే విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున దీనిపై స్వతంత్ర విచారణ అవసరమని సర్వత్రా డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై మూడో పక్షం దర్యాప్తు జరగాలని స్పష్టంచేస్తున్నారు. సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని, దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్న  డిమాండ్‌పై చంద్రబాబు సర్కారు ఎందుకు స్పందించడంలేదు?

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి టాప్‌ ర్యాంకర్‌
ఈ ప్రక్రియలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌ కృష్ణా జిల్లా సోషల్‌ స్టడీస్‌లో మొదటి ర్యాంకు సాధించారు. టీజీటీ తెలుగు పరీక్షలో జోన్‌–2లో ఆరో ర్యాంక్‌ సాధించారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్‌ ర్యాంకులు సాధించాడు. అంటే ఇది లీక్‌ కాదా? ఈ లీక్‌ ఇంకా ఎక్కడి వరకు వెళ్లింది? ఎంతమందికి చేరింది? లీకైన ప్రశ్నాపత్రం పొందినవారు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ తేలాల్సి ఉంది. నిజంగానే మెరిట్‌తో ర్యాంకు సాధించి ఉంటే అతడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతడి లాగిన్‌ ఐడీ కనిపించకుండా డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్‌ జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్‌ లెటర్‌ ఎందుకు పంపలేదు? లోకేశ్‌ వీటికి సమాధానం చెప్పలేదు.

స్పోర్ట్స్‌ కోటా.. మరో పెద్ద కుంభకోణం
మెగా డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాను మరో పెద్ద కుంభకోణంగా మార్చారు. గతంలో రెండు శాతం ఉన్న క్రీడా కోటాను మూడు శాతానికి పెంచారు. జీవో నంబర్‌ 4, జీవో నంబర్‌ 47 తీసుకొచ్చారు. డీఎస్సీ, టెట్‌ పరీక్షలు రాయకుండానే కేవలం క్రీడా ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనలు మార్చారు. కొన్ని పోస్టులకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి ధ్రువపత్రం సమర్పించవచ్చనే మినహాయింపులు కూడా ఇచ్చారు. అనుకున్న వారికి పోస్టులు ఇచ్చిన తర్వాత మళ్లీ నిబంధనలు మార్చి పాత జీవోలను రద్దు చేశారు. నిజంగా మంచి జీవోలు అయితే వాటిని ఎందుకు రద్దు చేశారు? తన వివరణలో లోకేశ్‌ ఈ అంశాలను ప్రస్తావించనేలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement