న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం 6:52కు జరిగిన భారీ పేలుడు రాజధానిని వణికించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడు ఒక i20 కారులో జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
అయితే సంఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ i20 కారులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారని, ఆ కారు వెనుక వైపు నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు శబ్దం దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. అయితే కారును గుర్తించడానికి, దానిలో ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఇది ఆత్మాహుతి దాడి కావచ్చని పలువురు భద్రతా నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేలుడు జరిగిన స్థలానికి ఎన్ఐఏ (NIA), డిఆర్డిఓ (DRDO) బాంబ్ నిపుణుల బృందాలు చేరుకున్నాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేసి, ఫోరెన్సిక్ పరిశోధన ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.


