సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఢిల్లీలో నిరసనలు, ఆంక్షలపై స్పందిస్తూ.. ‘ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశం.. నా పరిధిలోకి రాదు’ అని సీజేఐ వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ తప్పుబట్టింది. తక్షణమే రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం తీవ్ర దుమారం రేపింది. న్యాయ వ్యవస్థపై, చీఫ్ జస్టిస్‌పై తమకు నమ్మకం ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యనించిన సమయంలోనే దాదాపుగా ఇది జరిగింది.
‘శాంతిభద్రతలు మీ పరిధిలోకి రాకపోతే రాజీనామా చేయండి. ఆ బాధ్యతలను నిర్వహించగల మరో వ్యక్తిని మేం కనుగొంటాం’ అంటూ కేరళ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో సీజేఐని ఉద్దేశించి పోస్ట్ చేశారు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరించిందంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.
వివాదం ముదరడంతో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ స్పందించారు. సీజేఐపై అభ్యంతరకర పోస్ట్ పెట్టిన వ్యక్తిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండా, అనుమతి.. సంప్రదింపులు లేకుండానే ఆ పోస్ట్ ప్రచురితమైందని స్పష్టం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందో పరిశీలిస్తామని వెల్లడించారు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవని, అందుకు విరుద్ధంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులు పార్టీ నాయకత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించవని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ తదుపరి లక్ష్యం న్యాయవ్యవస్థే’
విపక్ష నేతలకు సీజేఐ అపాయింట్‌మెంట్ నిరాకరణ.. దానికి ఆయన ఇచ్చిన వివరణపై రాహుల్ గాంధీకి విలేకరుల నుంచి ప్రశ్న ఎదురైంది. అయితే ఆయన నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రాహుల్ అన్నారు. ఈ ప్రెస్‌మీట్ జరుగుతున్న టైంలోనే అటు కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఈ పోస్ట్ పబ్లిష్ అయ్యింది. ఈ వ్యవహారంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం తర్వాత కాంగ్రెస్ లక్ష్యం న్యాయవ్యవస్థేనని తాను గతంలోనే చెప్పానని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్య సంస్థలను కాంగ్రెస్ బలహీనపరచాలని చూస్తోందని ఆరోపించారు. దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయని, దేశభక్తులంతా కూడా ఒక్కటవుతారని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన పలువురు నేతలు సైతం కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.
I had said it earlier, next target of the Congress Party is Judiciary. Congress wants to destroy all the constitutional and democratic institutions of India. All Anti-India gangs are joining hands. All patriotic Indians will also come together 🇮🇳 https://t.co/oOLST1yuUL
— Kiren Rijiju (@KirenRijiju) October 12, 2026
లాయర్ల సంఘం ఏమందంటే?
సీజేఐ సూర్యకాంత్ రాజీనామా చేయాలంటూ చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (ఎస్‌సీఏఓఆర్‌ఏ) ఖండించింది. ఇలాంటి ప్రకటనలు న్యాయపదవి గౌరవాన్ని దెబ్బతీయడంతోపాటు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని తగ్గించే ప్రమాదం ఉందని పేర్కొంది. న్యాయవ్యవస్థ పనితీరుపై అభ్యంతరాలుంటే తగిన చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన మార్గాల్లోనే తెలియజేయాలని సూచించింది. న్యాయ ప్రక్రియ స్వతంత్రంగా కొనసాగేందుకు అందరూ సహకరించాలని కోరింది.
అసలు వివాదం అక్కడే మొదలైంది!
ఢిల్లీలో నిరసనలకు విధించిన ఆంక్షలు, పోలీసుల చర్యలపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రంగా మారాయి. ప్రతిపక్ష నేతలు తనను కలిసేందుకు చేసిన విజ్ఞప్తిని కూడా ఆయన తిరస్కరించారు. వారు లేవనెత్తాలనుకున్న అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున, వారితో సమావేశమైతే అధికార విభజన సూత్రానికి విరుద్ధంగా ఉంటుందని స్పష్టం చేసినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
మరోవైపు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భారీగా ఓట్ల తొలగింపులు, అవకతవకలు జరిగాయంటూ 11 మంది ప్రతిపక్ష ఎంపీల పేర్లతో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సంఘం నిర్ణయం చట్టబద్ధతను పరిశీలించాలని అందులో కోరారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసనలు, సీజేఐ వ్యాఖ్యలు, కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్.. వరుస పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచాయి.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ పిటిషన్‌లో 14 లోపాలు?!


