కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు మరోమారు లేఖ రాశారు. 2002 నాటి ఓటరు జాబితా ఏఐ ఆధారిత డిజిటైజేషన్ కారణంగా దొర్లిన తప్పులు నిజమైన ఓటర్లను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఓటరు జాబితాలోని పేర్లతో ఎస్‌ఐఆర్ సందర్భంగా పేర్లు సరిపోలడం లేదని, అనేక తప్పులు కనిపిస్తున్నాయని ఆ లేఖలో తెలిపారు.
ఓటర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా కొనసాగుతున్న సర్ కారణంగా ఇప్పటి వరకు 77 మరణాలు, 4 ఆత్మహత్యాయత్నాలు, 17 మంది ఆస్పత్రి పాలైనట్లు రికార్డయిందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న నిబంధనలను ఈసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మమత ఆ లేఖలో తెలిపారు. ఈ అంశాలను ఈసీ పరిగణనలోకి తీసుకుని, సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని కోరారు. సర్ జరుగుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఈసీకి సీఎం మమత పలుమార్లు లేఖలు రాయడం తెల్సిందే.


