ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న నీట్ రీఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేదం విధించింది. జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ నిషేదించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్‌లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ పరీక్ష కోసం ఇదివరకే నీట్ కీలక వెసులుబాట్లు కల్పించింది. నీట్ రీటెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది.
పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రశ్నాపత్రాల తరలింపుకు విమానాలను వాడింది. ఒక పరీక్ష పత్రాలకోసం విమాన సేవలను వినియోగించుకోవడం దేశంలోనే ఇది తొలిసారి.
ఎగ్జామ్ రద్దు
నీట్ ఎగ్జామ్ మే 3న జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.ఈ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో, మే 12న ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
పేపర్ లీక్ బయటపడిందిలా
రాజస్తాన్‌లోని జామ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్‌లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్‌లో నీట్‌కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్‌ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్‌గఢ్ నుంచే పేపర్ సికార్‌లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్‌కు చేరింది.
అతడు ఈ పేపర్‌ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థికి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్‌లో హాస్టల్‌ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్‌ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.


