బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మంత్రిత్వ శాఖ పంపకాల గురించి ప్రధాన పార్టీలు.. మిత్రపక్షాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ కుర్చీ కోసం జేడీయూ, బీజేపీలు బెట్టు వీడడం లేదని అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.
అసెంబ్లీ స్పీకర్ పోస్టు కోసం బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో నితీశ్ కుమార్ నేరుగా చర్చలు జరపనున్నారు. ఇందులో మంత్రుల పోర్ట్‌పోలియోల కంటే ప్రధాన అజెండాగా స్పీకర్ అంశం ఉన్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ కుర్చీని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని సమాచారం.
ఇంతకు ముందు కూడా బిహార్ స్పీకర్ పోస్టు కోసం ఇరు పార్టీలు పట్టుబట్టాయి. అయితే అత్యధిక స్థానాలు సాధించడం.. జేడీయూకి సీఎం పోస్టు అప్పగించడం నేపథ్యంతో బీజేపీకే ఆ అవకాశం దక్కింది. గత ప్రభుత్వంలో బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్ స్పీకర్‌గా, జేడీయూ నేత నరేంద్ర నారాయణ్ యాదవ్ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. దీంతో ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని జేడీయూ కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలో అత్యధిక సీట్లు సాధించిన దరిమిలా బీజేపీ అందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. బిహార్ బీజేపీ కీలక నేతలంతా పట్నాలోని కార్యాలయంలో అర్ధరాత్రి దాటాక కూడా మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ పోస్టుతో పాటు కీలక శాఖలను వదులుకోకూడదని అధిష్టానానికి నివేదించాలని నిర్ణయించాయి.
మరోవైపు.. జేడీయూ నేతలు సంజయ్ కుమార్ ఝా, లలన్ సింగ్‌లు ఇవాళ ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. నితీశ్‌తో కలిసి కమలం పెద్దలతో జరగబోయే మీటింగ్‌లో పాల్గొననున్నారు. తద్వారా బీజేపీ అధిష్టానంపై స్పీకర్ పోస్టు కోసం ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు.
మరోవైపు మంత్రి వర్గ కూర్పు బాధ్యతను బీజేపీ హైకమాండ్ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంతో ఆయన ఇవాళ పట్నాకు వెళ్లనున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలైన లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహలతో చర్చలు జరపబోతున్నారు. అయితే.. ఇప్పటికే ఈ మూడు మిత్రపక్షాలు కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక రేపు(నవంబర్ 19న) బీజేపీ, జేడీయూలు వేర్వేరుగా లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ తర్వాత ఎన్డీయే సమావేశంలో తమ శాసనసభా పక్ష నేతను అధికారికంగా ప్రకటిస్తాయి. ఎల్లుండి పట్నాలోని గాంధీ మైదాన్‌లో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారంతో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది.


