2025లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు
మూడింట రెండు ఎమ్మెల్సీలు గెలిచి సంబరం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోర ఓటమి భారం
పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఊరట
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి 2025 తీపి, చేదుల మిశ్రమ కలయికగా నిలిచింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ లకు ధీటుగా.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కమలదళం ఉవ్విళ్లూరు తున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్యసాధన దిశలో ఏ మేరకు సఫలీకృతమైందని పరిశీలిస్తే మాత్రం..ఆ పార్టీకి ఈ ఏడాది కొంత మోదంతో పాటు కొంత ఖేదాన్ని కూడా మిగిల్చినట్టు కన్పిస్తోంది.
మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని కైవసం చేసుకున్న బీజేపీ ప్రధాన పక్షాలను కంగుతినిపించింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీకి చేదు అనుభవాన్ని రుచి చూపించింది. ఈ ఏడాది లోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు రావడం గమనార్హం.
ఏడాదంతా ఎత్తు,పల్లాల పయనం
ఈ ఏడాదంతా కూడాకాషాయదళం ప్రయాణం ..ఎత్తును అధిరోహించడం ఆ వెంటనే పల్లంలోకి పడిపోవడం అన్నట్టుగా సాగింది. ఈ ఏడాది మొదట్లోనే ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో పట్టభద్రులు, టీచర్స్ శాసనమండలి స్థానాల్లో విజయం సాధించి..ఉద్యోగులు, విద్యావంతుల్లోనూ పార్టీకి పట్టు ఉందని చాటుకోగలిగింది.
కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్– మెదక్ పట్టభద్రుల సీటు నుంచి బీజేపీ బీఫారమ్‌పై పోటీ చేసిన అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. అదేవిధంగా ఇదే ప్రాంత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన మల్కా కొమరయ్య గెలుపొందారు. ఈ విజయాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచాయి.
సమన్వయ లేమి..అంతర్గత విభేదాలు
అయితే వరుసగా మూడుసార్లు గెలిచి హైదరాబాద్‌లో హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్ అని పిలిపించుకున్న టి.రాజాసింగ్.. చివరకు రాజీనామా వరకు వెళ్లేలా పార్టీలో పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నాయకత్వంపై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై నేరుగా విమ ర్శలు, ఆరోపణలతో రాజాసింగ్ బీజేపీలో కొనసాగలేని పరిస్థితికి చేరుకున్నారు.
పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయ లేమి, అంతర్గత విభేదాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారే అన్నట్టుగా సొంత ప్రతిష్టను, సత్తాను చాటుకునే ప్రయత్నంలో పార్టీ సమష్టి బాధ్యత, కలిసికట్టుగా ముందుకెళ్లడం అనేది విస్మరించారనే విమర్శలు వచ్చాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోరఓటమి పార్టీకి, నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందికర పరిణామంగా మారింది.
అయితే ఈ ఏడాది చివర్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో 1,000 మంది దాకా (స్వతంత్రుల్ని కూడా కలుపుకొని) సర్పంచ్‌లు గెలిచారని పార్టీ ప్రకటించింది. 2019లో గెలిచిన సర్పంచ్ స్థానాలతో పోల్చితే ఇవి సంఖ్యాపరంగా ఎక్కువైనా రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలం పెరిగిందని చెబుతున్న స్థాయిలో ఇవి లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం. ఈ ఏడాది కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగాయి. ముఖ్యనేతలు సైతం బహిరంగ విమర్శలు చేసుకున్నారు.
అధ్యక్షుడిగా రాంచందర్‌రావు
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం పెద్దసంఖ్యలో ముఖ్యనేతలంతా పోటీపడగా.. చివరకు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఎంపికయ్యారు. ఈ అధ్యక్ష ఎన్నిక పూర్తయిన క్రమంలోనే పార్టీకి, సభ్యత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం జాతీయ పార్టీ ఆమోదించడం జరిగిపోయాయి. అయితే మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు రాజాసింగ్ చేస్తుండటం గమనార్హం.


