విద్యుత్‌ వైఫల్యమే కారణం!  | Boeing 787 emergency power system was likely active before crash | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వైఫల్యమే కారణం! 

Jun 21 2025 5:14 AM | Updated on Jun 21 2025 5:14 AM

Boeing 787 emergency power system was likely active before crash

ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు బృందం 

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: అకస్మాత్తుగా విద్యుత్‌ వైఫల్యం చెందడం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏఐ–171 టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. అత్యవసర టర్నరౌండ్‌ను అమలు చేయడానికి లేదా మొత్తం విద్యుత్‌ నష్టం జరిగినప్పుడు బ్యాక ప్‌ వ్యవస్థ అయిన రామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ (ఆర్‌ఏటీ)ను ఉపయోగించుకోవడానికి అవసరమైన కనీస ఎత్తుకు విమానం చేరుకోలేదు. 

అయితే టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బ్లాక్‌ బాక్స్‌ డేటాను డీకోడ్‌ చేసిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందంటున్నారు. బ్లాక్‌ బాక్స్‌లు – ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (ఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌) ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) ఆ«దీనంలో ఉన్నాయి. అయితే బ్లాక్‌ బాక్స్‌లను విదేశాలకు పంపుతున్నట్లు వస్తున్న వార్తల స్పందించిన పౌర విమానయాన శాఖ.. తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

231 డీఎన్‌ఏల గుర్తింపు.. 210 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత 
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 231 డీఎన్‌ఏ నమూనాలు సరిపోలాయని, 210 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అహ్మదాబాద్‌ సివిల్‌ హాస్పిటల్‌ శుక్రవారం తెలిపింది. మృత దేహాలు అప్పగించిన 210 మందిలో 166 మంది భారతీయులు కాగా, ఏడుగురు పోర్చుగీస్, 36 మంది బ్రిటిషర్స్, ఒక కెనడియన్‌ ఉన్నారని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ రాకేష్‌ జోషి తెలిపారు. 

183 మంది మృతదేహాలను అంబులెన్స్‌ల ద్వారా, 15 మంది మృతదేహాలను విమానంలో పంపించినట్లు తెలిపారు. విమాన ప్రమాదంలో 222 మంది బాధితులను గుర్తించగా, వారిలో ఎనిమిది మంది డీఎన్‌ఏ మ్యాచ్‌ కాలేదని తెలిపారు. జూన్‌ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలిపోవడం, విమానంలోని 241 మంది మరణించడం తెలిసిందే.   
 

Advertisement
 
Advertisement
Advertisement