పీటీఐ ఇంటర్వ్యూలో జైరామ్ రమేశ్
లోక్‌సభలో మెజార్టీకి యత్నాలు అందుకే
న్యూఢిల్లీ: దేశంలో రిజర్వేషన్లను రద్దుకే భారతీయ జనతా పార్టీ లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజార్టీ లక్ష్యంగా పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. దేశ యువత నిరాశా నిస్పృహలే కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో వ్యక్తమవుతున్నాయన్న ఆయన వారు లేవనెత్తిన అంశాలను ముందుకు తీసుకెళతామని తెలిపారు. బీజేపీలోకి ఫిరాయించిన పార్టీ యువ నేతలను మళ్లీ కాంగ్రెస్‌లోకి చేర్చుకోరాదని, మాలాంటి వారికి అది అవమానకరమన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
పీటీఐ వీడియోస్‌కు బుధవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రమేశ్ మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్ల బిల్లు నెపంతో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు జరిగిన ప్రయత్నం కూడా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసేందుకేనని ఆరోపించారు చిత్తశుద్ధి ఉంటే 2029 ఎన్నికల్లో ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాల ఆధారంగానే, ’నారీ శక్తి వందన్’ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2024లో ‘‘అబ్ కి బార్... 400 పార్’’అని బీజేపీ నినదించినప్పుడే తాము అది రిజర్వేషన్లను అంతం చేసేందుకు ఉద్దేశించిందని చెప్పామని, అప్పటి నుంచి ఇప్పటివరకూ టీఎంసీ, శివసేన (యూబీటీ)లను చీల్చేందుకు అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు ఆ మాటలను నిజం చేస్తున్నాయని వివరించారు. రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బీజేపీలోకి ఫిరాయిస్తున్న విషయంపై మాట్లాడుతూ ‘దీనికి కారణం ఒక్కటే. ఏప్రిల్ 17న ‘చాణక్యుడు’(అమిత్ షా) ఎదుర్కొన్న అవమానం. నియోజకవర్గ పునరి్వభజన బిల్లులు మూడూ ఆమోదింపజేస్తానని ఆయన మోడీకి మాటిచ్చారు. కానీ 298 కంటే ఎక్కువ ఓట్లు సాధించలేకపోయారు’’అని వ్యాఖ్యానించారు. బెదిరింపులు, ఆయన వ్యూహం ఫలించకపోవడంతో ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో పార్టీలను చీల్చే రాజకీయాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. అయితే.. విపక్షాలు పునరి్వభజన యత్నాన్ని మాత్రమే వ్యతిరేకించాయని, మహిళా రిజర్వేషన్లను కాదని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగంపై నమ్మకం లేదని, 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ తీవ్రంగా వ్యతిరేకించిందని అన్నారు.
మోజార్టీ అసాధ్యం..
టీఎంసీ, శివసేన (యూబీటీ)లను చీల్చడం ద్వారా బీజేపీ బలం 298 నుంచి 324కు చేరుకున్నా ప్రస్తుత లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ మార్కు అందుకోవడం ఆ పార్టీకి అసాధ్యమని జైరామ్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ ఎన్నికల్లో కూడా వారికి ఈ మెజార్టీ రాదని, రాజ్యాంగ సవరణే వారి లక్ష్యమన్నది దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలకు బాగా తెలుసునని రమేశ్ వివరించారు. నియోజకవర్గాల పునరి్వభజన ద్వారా ఎంపీల సంఖ్యను 815కు పెంచాలని అనుకుంటున్నారని, ఇది ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. కుల గణన తర్వాతే పునిర్వభజన జరగాలని, వచ్చే లోక్‌సభ ఎన్నికలను 543 స్థానాలతోనే నిర్వహించి, అందులో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రాజకీయాలను ప్రస్తావించిన జైరామ్ రమేశ్.. అవన్నీ దేశ యువతలో పేరుకుపోయిన నిరాశ, నిస్పృహల అభివ్యక్తీకరణ మాత్రమేనని అన్నారు. యువత ఈ రకమైన సందేశం ఇవ్వడంలో తప్పులేదు కానీ చివరకు రాజకీయ పార్టీలే ఆయా అంశాలను అజెండాగా మార్చుకోవాలని చెప్పారు. సీజేపీ ఉద్యమాన్ని ఎవరో స్పాన్సర్ చేస్తున్నారనడం సరికాదన్న ఆయన అది రాజకీయ పార్టీ కూడా కాదని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో మంచి గుర్తింపు మాత్రం లభించిందని చెప్పారు. ఉద్యమాల ప్రాముఖ్యతను గుర్తిస్తూనే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలతో ముఖ్య భూమికని గుర్తుచేశారు.


