జూమ్‌ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం | Bengaluru Techie Exposes Wife Secret Marriage via Zoom Call, Wins in Court | Sakshi
Sakshi News home page

జూమ్‌ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం

May 15 2025 5:45 PM | Updated on May 15 2025 6:26 PM

Bengaluru Techie Exposes Wife Secret Marriage via Zoom Call, Wins in Court

సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న  భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ  భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.

కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.

వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.

కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్‌ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్‌ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్‌ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం  చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. 

భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. 

విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది. 

Advertisement
 
Advertisement
Advertisement