పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య.. ఏం జరిగింది? | Bengaluru Constable Wife Lakshmi Priya Dies By Suicide | Sakshi
Sakshi News home page

పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య.. ఏం జరిగింది?

May 24 2026 1:42 PM | Updated on May 24 2026 3:25 PM

Bengaluru Constable Wife Lakshmi Priya Dies By Suicide

బెంగళూరు: కర్ణాటకలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే, ఆమె మృతికి ముందు తన చెల్లికి ఫోన్‌ పాస్‌వర్డ్‌ పంపించడం గమనార్హం. ఆ తర్వాత కాసేపటికే ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, భర్త, అత్తమామలు కలిసి ఆమెను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి పేరెంట్స్‌ ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  బెంగళూరుకు చెందిన లక్ష్మీ ప్రియ (26)కు మైసూర్ నివాసి అయిన రాజేష్ ఆరాధ్యతో మే 11, 2023న వివాహం జరిగింది. రాజేష్ బెంగళూరులోని హెచ్ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బెంగళూరులోని కేఆర్‌పుర ఏరియాలోని పోలీస్ క్వార్టర్స్‌లో  వీరు నివాసం ఉంటున్నారు. కాగా, పెళ్లయిన కొద్ది రోజుల నుండే భర్త రాజేష్, మామ పాలక్షారాధ్య, అత్త భాగ్యమ్మ కలిసి అదనపు కట్నం కోసం లక్ష్మీ ప్రియను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎనిమిది నెలల క్రితం లక్ష్మీ ప్రియ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన ఆమె, దాదాపు ఆరు నెలల పాటు అక్కడే ఉండి, ఇటీవలే తిరిగి బెంగళూరులోని పోలీస్ క్వార్టర్స్‌కు వచ్చింది.

ఇంతలో.. మే 22, 2026 మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో లక్ష్మీ ప్రియ తన చెల్లెలు జయశ్రీకి వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపింది. అందులో తన మొబైల్ ఫోన్ 'పాస్‌వర్డ్'ను షేర్ చేసింది. సాధారణంగా కాకుండా అకస్మాత్తుగా ఫోన్ పాస్‌వర్డ్ పంపడంతో చెల్లెలికి అనుమానం వచ్చి, వెంటనే అక్కకు ఫోన్ చేసింది. కానీ లక్ష్మీ ప్రియ ఎంతకీ ఫోన్ ఎత్తలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే లక్ష్మీ ప్రియ భర్త రాజేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే లక్ష్మీ ప్రియ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని రాజేష్ వారికి సమాచారం అందించాడు.

అయితే, చనిపోయే ముందు ఫోన్ పాస్‌వర్డ్ చెల్లికి పంపడం, అప్పటికే ఇంట్లో వేధింపులు జరుగుతుండటంతో.. ఇది ఆత్మహత్య కాదని, లక్ష్మీ ప్రియ మృతి వెనుక భర్త, అత్తమామల హస్తం ఉందంటూ పుట్టింటి వారు గట్టిగా నమ్ముతున్నారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేఆర్ పుర పోలీసులు కానిస్టేబుల్ రాజేష్, అతని తల్లిదండ్రులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ క్వార్టర్స్‌లోనే కానిస్టేబుల్ భార్య ఇలా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement