కుంభమేళాలో మరో తొక్కిసలాట!  | Another stampede at the Maha Kumbh Mela | Sakshi
Sakshi News home page

కుంభమేళాలో మరో తొక్కిసలాట! 

Jan 31 2025 5:37 AM | Updated on Jan 31 2025 9:11 AM

Another stampede at the Maha Kumbh Mela

సంగం ఘాట్‌ వద్ద విషాదం తర్వాత కాస్త దూరంలో ఝాసీ ఘాట్‌లో ఉదయం తొక్కిసలాట 

భక్తులు భయపడతారని వెంటనే బహిర్గతం చేయని అధికారులు 

మహాకుంభ్‌ నగర్‌: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో పుణ్యస్నానాల కోసం వేచి ఉన్న భక్తులపై వెనకవైపు భక్తులు పడటంతో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్తలో కొంత నిగూఢార్థం ఉందని ఆలస్యంగా వెల్లడైంది. మరణాలన్నీ ఈ సంగం ఘాట్‌ వద్దే సంభవించలేదని కొన్ని సమీపంలోని ఝాసీ ఘాట్‌ వద్ద సంభవించాయన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగం ఘాట్‌లో భారీ తొక్కిసలాట జరిగిన కొద్దిసేపటి తర్వాత ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట జరిగిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

 సంగం ఘాట్‌ విషాదం నుంచి భక్తులు తేరుకునేలోపే మరోచోట కూడా తొక్కిసలాట జరిగిందన్న వార్త తెలిస్తే భయంతో భక్తులు వెనుతిరగడమో, గందరగోళంతో పరుగెత్తడమో చేస్తే మళ్లీ సంగం ఘాట్‌లో మరో అపశృతి చోటుచేసుకుంటుందన్న అనుమానంతో అధికారులు ఈ విషయాన్ని వెంటనే బయటకు చెప్పలేదని తెలుస్తోంది. భక్తులను శాంతపరచడమే తమ ముఖ్య ఉద్దేశమని అక్కడి అధికారులు చెప్పారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంగం ఘాట్‌కు ఉత్తరాన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంగ ఒడ్డుకు ఆవలివైపు ఈ ఘాసీ ఘాట్‌ ఉంది. సంగం ఘాట్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఝాసీ ఘాట్‌లో దాదాపు ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాట జరిగింది. 

మధ్యాహ్నం దాకా మృతదేహాలు అక్కడే! 
‘‘ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిన భక్తుల మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాటలో చనిపోతే మధ్యాహ్నం 1.30 గంటలకు మృతదేహాలను ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. తొక్కిసలాట జరిగిన నాలుగు గంటల తర్వాత ఒక మహిళా కానిస్టేబుల్‌ వచ్చింది. అప్పటికే అక్కడి భీతావహ పరిసరాలను తమ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాల్లో బంధిస్తున్న జనాలను పోలీసులు వారించారు’’అని ఝాసీ ఘాట్‌లో హల్దీరామ్‌ దుకాణం నడుపుతున్న నేహా ఓఝా స్థానిక మీడియాతో చెప్పారు.

 ‘‘ఊహించనంతగా భక్తులు వచ్చారు. అడ్డుగా ఉన్న కర్ర బ్యారీకేడ్లను విరగ్గొట్టి ముందుకు రావడంతో ఘోరం జరిగింది. ఇదే అదనుగా అక్కడ నిద్రిస్తున్న వాళ్లకు చెందిన ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కొందరు కొట్టేశారు’’అని ప్రత్యక్ష సాక్షి హర్షిత్‌ అన్నారు. ‘‘మా దుకాణం చుట్టూతా ఒక్కసారిగా జనం పోగయ్యారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. మా దుకాణంలోకీ జనం చొచ్చుకొచ్చారు. ఇదే అదనుగా ఎవరో మా హల్దీరామ్‌ దుకాణం క్యాష్‌ కౌంటర్‌ నుంచి రూ.1,80,000 కొట్టేశారు.

 ఇక్కడ గుట్టలుగా పడి ఉన్న భక్తుల బ్యాగులు, చెప్పుల కుప్పల నుంచే కొందరు వృద్ధుల మృతదేహాలను బయటకు తీశారు. నా ముందే ఈ టెంట్‌లో ఇద్దరు చనిపోయారు’’అని నేహా ఓఝా చెప్పారు. ‘‘వెంటనే ఝాసీ ఘాట్‌కు అంబులెన్సు వచ్చే సౌకర్యం కూడా లేదు. ఏ సాయం అందాలన్నా నది ప్రవాహం మీదుగా పడవల్లో వచ్చి సాయపడాల్సిందే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మెయిన్‌ బహదూర్‌ సింగ్‌ చెప్పారు. ‘‘బస్సులో వచి్చన ఒక 20 మంది యువకులు బ్యారీకేడ్లను విరగొట్టి, అందర్నీ తోసేసి ముందుకెళ్లారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి అయిన ఒక సాధువు చెప్పారు. ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట కారణంగా ఏర్పడిన చెత్తను తొలగించేసరికి సాయంత్రం ఆరు అయిందని ఒక కార్మికుడు చెప్పారు.  

అగ్నిప్రమాదంలో 15 టెంట్లు దగ్ధం 
మహాకుంభ్‌ నగర్‌: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి అగ్నప్రమాదం సంభవించింది. సెక్టార్‌ 22 సమీప ఛామన్‌గంజ్‌ చౌకీ వద్ద చెలరేగిన అగ్నికీలల్లో 15 టెంట్లు కాలిపోయాయని ప్రధాన అగ్నిమాపక దళ అధికారి(కుంభ్‌) ప్రమోద్‌ శర్మ చెప్పారు. విషయం తెలియగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటల్ని ఆర్పేశారు. సరైన రోడ్డు మార్గంలేకపోవడంతో త్వరగా ఘటనాస్థలికి చేరుకోవడం కష్టంగా మారింది. అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదని అధికారి స్పష్టంచేశారు. కలిపోయిన టెంట్లు కుంభమేళాలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినవి కాదని, అక్రమంగా వెలిశాయని వెల్లడించారు. అగ్నికీలలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలెట్టారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement