
న్యూఢిల్లీ: దేశంలో నేటి(శుక్రవారం) నుంచి మరో అమృత్ భారత్ రైలు పరుగులు తీయనుంది. బీహార్‌లోని సీతామర్హిని ఢిల్లీకి అనుసంధానించే ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్‌లో రైలు కనెక్టివిటీని మెరుగుపరచనుంది. అలాగే మధ్యతరగతి వర్గానికి ఆధునిక రైల్వే సేవల అనుభవాన్ని అందించనుంది.
సీతామర్హి-ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీతామర్హిలోని పునౌరా ధామ్ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారని తూర్పు మధ్య రైల్వే జోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 20 గంటల 45 నిమిషాల్లో దాదాపు 1,100 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 130 కి.మీ వేగంతో పరుగుల తీయగలదు. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంది.
ఇది శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి, ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతామర్హి చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 10.15 గంటలకు సీతామర్హి నుండి బయలుదేరి, సోమవారం రాత్రి 10.40 గంటలకు ఢిల్లీకి తిరిగి వస్తుంది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు 13 స్టాప్‌లున్నాయి. అవి ఘజియాబాద్, తుండ్ల, కాన్పూర్, లక్నో, గోండా, బస్తీ, గోరఖ్‌పూర్, కప్తాన్‌గంజ్, సిస్వా బజార్, బాగహా, సిక్తా, నర్కటియాగంజ్, రక్సౌల్ బైర్గానియా.