పూణే: హలో మేడం.. మేం ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఆధార్‌కు లింక్ చేసిన ఫోన్ నంబర్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం" అంటూ అరెస్టు వారెంట్ పంపించారు. లెటర్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం ఉండటంతో బాధితురాలు నమ్మింది.
ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి రూ.99 లక్షలు అడిగాడు. భయంతో బాధితురాలు ఆ మొత్తాన్ని చెప్పిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. అనంతరం అదే నంబర్‌కు కాల్ చేయగా..ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించింది. తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సైబర్ నేరస్తులు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఓటీపీలు షేర్ చేయొద్దంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో అవగాహన పెరగడంతో, సైబర్ మోసగాళ్లు నకిలీ అరెస్ట్ వారెంట్‌లు, అధికార ముద్రలు, ప్రముఖుల సంతకాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
తాజా ఘటన అక్టోబర్ చివరి వారంలో పూణేలోని కొథ్రుడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు ఎల్‌ఐసీ సంస్థలో ఉన్నతోద్యోగినిగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు.
ఇంట్లో ఉంటున్న సమయంలో ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి సీనియర్ అధికారినంటూ నిందితుడు పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్‌కు లింక్ చేసిన ఫోన్ నెంబర్‌తో అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు బెదిరించాడు.తర్వాత ఆమెను జార్జ్ మాథ్యూ అనే మరో వ్యక్తికి కనెక్ట్ చేసి, మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు ఉందని చెప్పాడు.
నిర్మలా సీతారామన్ నకిలీ సంతకంతో, అధికారిక ముద్ర, సీల్‌తో కూడిన అరెస్ట్ వారెంట్ పంపించారు. ఆమె వయస్సు కారణంగా మినహాయింపు ఇస్తున్నామని, విచారణ కోసం కెమెరా ముందు రావాలని సూచించారు. ధృవీకరణ కోసం కొంత నగదు బదిలీ చేయాలని చెప్పడంతో, ఆమె రూ.99 లక్షలు పంపించారు. చివరికి తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాల్ని పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


