కోడిపుంజులను ఈత కొట్టించే క్రమంలో ప్రమాదం
కాలుజారి నీటికుంటలో పడిపోయిన కొడుకు, రక్షించబోయిన తండ్రీ మృతి
కూనవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింపేటలో ఆదివారం జరిగిన ఒక చిన్న పొరపాటు, ఒకేసారి తండ్రీకొడుకులను బలితీసుకుని ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని నర్సింగపేట గ్రామానికి చెందిన సింహాద్రి పాపారావు (40), కుమారుడు జశ్వంత్(14)తో కలిసి సరదాగా పెంచుకుంటున్న కోడిపుంజులను ఈత కొట్టించేందుకు పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నీటికుంటలో కోళ్లను ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు జశ్వంత్ కాలుజారి కుంటలో పడిపోయాడు.
కళ్లముందే కొడుకు మునిగిపోతుంటే చూడలేకపోయిన తండ్రి, ఈత రాకపోయినా ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ ఆ నీటిలోనే ఊపిరి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి విగతజీవులుగా మారారు.
ఇంటర్ చదువుతున్న కూతురు, భర్తను కోల్పోయిన భార్య.. మాకు దిక్కెవరు?.. అంటూ బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీటి పర్యంతం చేసింది. పోలీసులు మృతదేహాలను కోతులగుట్ట సీహెచ్‌సీకి తరలించారు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలావుండగా జశ్వంత్ మర్రిగూడెం హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.


