తొమ్మిది కోట్ల ఐఆర్‌సీటీసీ ఐడీలు బ్లాక్.. మీ అకౌంట్ సేఫేనా? | 90 Million IRCTC Accounts Flagged AI to Monitor Food Safety | Sakshi
Sakshi News home page

తొమ్మిది కోట్ల ఐఆర్‌సీటీసీ ఐడీలు బ్లాక్.. మీ అకౌంట్ సేఫేనా?

Jun 4 2026 9:12 AM | Updated on Jun 4 2026 9:36 AM

90 Million IRCTC Accounts Flagged AI to Monitor Food Safety

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రయాణికులకు షాకిస్తూ భారీ అపరేషన్‌కు తెరలేపింది. టికెట్ బుకింగ్స్‌లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రయాణికులకు అందించే ఆహారంలో నాణ్యతను పెంచేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కోట్ల కొద్దీ అనుమానాస్పద అకౌంట్లపై వేటు వేయడమే కాకుండా, రైల్వే కిచెన్లలో ఆహార భద్రతను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను రంగంలోకి దించింది.

టికెట్ దందాలపై ఉక్కుపాదం.. 9 కోట్ల అకౌంట్లు క్లోజ్!
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఐఆర్‌సీటీసీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. వ్యవస్థలో పారదర్శకత కోసం ఏకంగా 3 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను పూర్తిగా నిలిపివేసింది. మరో 6 కోట్ల అకౌంట్లను కఠిన నిఘాలో ఉంచి వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. మొత్తం మీద 9 కోట్ల ఖాతాలపై ఐఆర్‌సీటీసీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అంతేకాదు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో 4.18 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్ (పీఎన్‌ఆర్‌)లపై 501 ఫిర్యాదులు నమోదు చేశారు. ఈ ఏడాదిలోనే 13,343 నకిలీ ఈమెయిల్ డొమైన్లను బ్లాక్ చేయడం విశేషం.

ఏఐ కెమెరాల నిఘా.. 
టికెట్ మోసాల సంగతి పక్కన పెడితే, ప్రయాణికుల ఆరోగ్య రక్షణ కోసం ఐఆర్‌సీటీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా రైల్వే వంటశాలలలో 2,394 ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలను అమర్చింది. ఇవి ఆహార తయారీని క్షణక్షణం పర్యవేక్షిస్తాయి. సిబ్బంది తలకు క్యాప్ పెట్టుకోకపోయినా, చేతులకు గ్లౌజులు వేసుకోకపోయినా, వంటగదిలో ఈగలు, దోమలు, బొద్దింకలు, లేదా ఎలుకలు తిరిగినా ఈ కెమెరాలు వెంటనే పసిగడతాయి. కేవలం 7 నుంచి 8 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే చీమ అంత వస్తువును సైతం గుర్తించగలగడం ఈ సిస్టమ్ ప్రత్యేకత.

రెండు గంటల్లో యాక్షన్.. 60 కోట్ల మీల్స్ భద్రత!
వంటగదుల నుంచి వచ్చే సీసీటీవీ ఫుటేజీని మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ ఏఐ సిస్టమ్ విశ్లేషిస్తుంది. నిబంధనల ఉల్లంఘన జరిగితే వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ ఆ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, ఉన్నతాధికారులకు అలర్ట్ వెళ్తుంది. కేవలం రెండు గంటల్లోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఈ సిస్టమ్ రోజుకు సగటున 350 అలర్ట్‌లను ఇస్తోంది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్‌సీటీసీ ఏకంగా 60 కోట్ల మంది ప్రయాణికులకు భోజన సదుపాయాన్ని అందించింది. భవిష్యత్తులో ఈ ఏఐ నిఘా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనున్నారు.

ఇది కూడా చదవండి: జాబ్స్ పేరుతో చైనా గూఢచర్యం: ‘ఫైవ్ ఐస్’ హెచ్చరిక!

Advertisement
 
Advertisement
Advertisement