ఇరాన్, ఇజ్రాయెల్‌ నుంచి 4,400 మంది వెనక్కి: కేంద్రం | 4415 Indians evacuated from Israel and Iran so far | Sakshi
Sakshi News home page

ఇరాన్, ఇజ్రాయెల్‌ నుంచి 4,400 మంది వెనక్కి: కేంద్రం

Jun 28 2025 5:01 AM | Updated on Jun 28 2025 5:01 AM

4415 Indians evacuated from Israel and Iran so far

న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌ల నుంచి 4,400 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఆపరేషన్‌ సిందూలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి వీరి కోసం 19 ప్రత్యేక విమాన సర్వీసులను నడిపినట్లు వెల్లడించింది. ఇరాన్‌ నుంచి ఆర్మీనియా రాజధాని ఎరెవాన్‌ చేరుకున్న 173 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం తాజాగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుందని పేర్కొంది. 

అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేశాక తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ శుక్రవారం మీడియాకు వివరించారు. మొత్తమ్మీద ఇరాన్‌లో 10 వేల మంది, ఇజ్రాయెల్‌లో 40 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. 

భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో సహకరించిన ఈజిప్టు, జోర్డాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 20న గగనతలాన్ని భారతీయుల కోసం తెరిచిన ఇరాన్‌తోపాటు తుర్క్‌మెనిస్తాన్, ఆర్మీనియా ప్రభుత్వాలకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్‌ మద్య ఉద్రిక్తతలు మొదలుకాగా, 22న అమెరికా ఇరాన్‌ అణు వసతులపై దాడులకు దిగడంతో తీవ్ర రూపం దాల్చడం తెల్సిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement