ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ.. లోకల్ ట్రైన్‌లో ఊహించని దారుణం జరిగింది. రైలు కోచ్ తలుపు తెరిచి ఉంచే విషయమై ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం.. చివరికి ఒకరి ప్రాణాలను బలిగొంది. తోటి ప్రయాణికుడిపై ఆగ్రహంతో ఊగిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి, పదునైన ఆయుధంతో కడుపులో పొడవడంతో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.
తలుపు వివాదం.. ప్రాణాంతక దాడి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయాంక్ లోహర్ (22) అనే యువకుడు చర్చిగేట్ నుంచి నల్లాసోపారా వెళ్లే ఫాస్ట్ లోకల్ రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నాడు. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోచ్ తలుపును తెరిచి ఉంచాలా లేదా మూసివేయాలా అనే విషయమై మయాంక్‌కు, మరో ప్రయాణికుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సదరు గుర్తుతెలియని దుండగుడు అకస్మాత్తుగా పదునైన ఆయుధాన్ని తీసి, మయాంక్ కడుపులో బలంగా పొడిచాడు. రాత్రి 11:04 గంటలకు రైలు బోరివలీ స్టేషన్‌కు చేరుకోగానే, రైలు పూర్తిగా ఆగకముందే నిందితుడు జనం రద్దీలోకి దూకి పారిపోయాడు.
రైల్వే అధికారుల తక్షణ స్పందన
రైలు బోరివలీ స్టేషన్‌లో ఆగడమే ఆలస్యం.. పశ్చిమ రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. తీవ్రంగా గాయపడిన మయాంక్‌ను పోర్టర్ల సహాయంతో అత్యవసరంగా బోరివలీ స్టేషన్‌లోని మెడికల్ రూమ్‌కు తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు రాత్రి 11:42 గంటలకు కందివలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ మాట్లాడుతూ.. క్షతగాత్రుడికి వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించామన్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు
ఈ దారుణ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ముంబై సెంట్రల్), సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బోరివలీ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి జీఆర్‌పీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అందులో భాగంగా అంధేరి, మలాడ్, బోరివలీ రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆనవాళ్లను సేకరించి, అతడు ఏ మార్గంలో పారిపోయాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.


