
టాలీవుడ్‌లో ఊపందుకుంటున్న సీక్వెల్ సినిమాలు
ఓ సినిమా విజయం సాధించి, ఆ సినిమాకు సీక్వెల్ వస్తోందంటే ఆడియన్స్‌లో తప్పక అంచనాలు ఉంటాయి. తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల సీక్వెల్‌కు స్కోప్ ఉన్న సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఇటు బాక్సాఫీస్ లెక్కల ప్రకారం కూడా సీక్వెల్స్ సినిమాలను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే... ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తొలి పది భారతీయ చిత్రాల్లో ‘బాహుబలి 2, పుష్ప 2, కేజీఎఫ్ 2’ వంటి సినిమాలు ఉన్నాయి.
దీన్ని బట్టి సీక్వెల్ సినిమాలు ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయని ఊహించవచ్చు. అందుకే ఓ సినిమా హిట్టైతే, ఆ సినిమా సీక్వెల్స్‌ను సెట్స్‌కు తీసుకువెళ్లడానికి ఆయా దర్శక–నిర్మాతలు సన్నాహాలు చేస్తుంటారు. ఇక ఇప్పటివరకూ ఫలానా సినిమాకు సీక్వెల్ అంటూ అనౌన్స్‌మెంట్‌లు చాలానే వచ్చాయి. కానీ అతి కొద్ది సినిమాల సీక్వెల్స్ మాత్రమే సెట్స్‌కు వెళతాయి. ఇలా ఈ ఏడాది ఆల్రెడీ సెట్స్‌కు వెళ్లిన, వెళ్లనున్న లేదా వచ్చే ఏడాది సెట్స్‌కు వెళ్లనున్న కొన్ని సీక్వెల్స్‌పై ఓ లుక్ వేయండి.
మూడోసారి దృశ్యం
వెంకటేశ్ హీరోగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలొచ్చాయి. ఈ రెండూ చిత్రాలూ ప్రేక్షకులను మెప్పించి, సూపర్ హిట్స్‌గా నిలిచాయి. కాగా ‘దృశ్యం 3’ సినిమా పనులు కూడా మొదలయ్యాయని, ఈ చిత్రంలో మీనాతో కలిసి తాను మళ్లీ నటించబోతున్నట్లుగా ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్‌లో వెంకటేశ్ పేర్కొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని, ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ‘దృశ్యం 3’ని తెలుగుతో పాటు హిందీ (అజయ్ దేవగణ్ హీరో), మలయాళం (మోహన్‌లాల్ హీరో) వెర్షన్స్‌నూ రెడీ చేసి, ఒకేసారి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు జీతూ జోసెఫ్. ఈ దిశగా సన్నాహాలు మొదలయ్యాయి.
ముందుగా మోహన్‌లాల్ హీరోగా మలయాళ వెర్షన్ ‘దృశ్యం 3’ రెడీ అవుతుందట. ఆ తర్వాత తెలుగు ‘దృశ్యం 3’ని డైరెక్ట్ చేస్తారట జీతూ జోసెఫ్. ‘‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలకు పూర్తి విభిన్నంగా ‘దృశ్యం 3’ ఉంటుంది. జార్జి కుట్టి (‘దృశ్యం’ సినిమాల్లో హీరో పాత్ర పేరు) జీవితం, ఆయన భావోద్వేగాలు, అంతరంగం వంటి అంశాలకు ‘దృశ్యం 3’లో పెద్ద పీట వేశాం. ట్విస్ట్‌లు, టర్న్‌లు ముందు భాగాలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటాయి’’ అని ఇటీవల ఓ సందర్భంలో జీతూ జోసెఫ్ పేర్కొన్నారు.
ఇక దర్శకుడు త్రివిక్రమ్‌తో చేయాల్సిన ‘ఆనంద నిలయం’ (వర్కింగ్ టైటిల్), ‘దృశ్యం 3’ సినిమాల చిత్రీకరణల్లో వెంకటేశ్ సమాంతరంగా పాల్గొంటారని ఊహించవచ్చు. ‘దృశ్యం’ ఫ్రాంచైజీ సంగతి అటు ఉంచితే... వెంకటేశ్ చేతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’కు సీక్వెల్‌గా ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా రానుంది. ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల పనులు ప్రారంభం కావడానికి చాలా సమయం పడుతుంది.
టైమ్ ట్రావెల్...
హీరో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్స్‌లో ‘ఆదిత్య 999’ ఒకటి. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో రూ పొందిన టైమ్ ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ (1991). ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ రూ పొందనుంది. కాగా ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు మొదలై పోయాయని, బాలకృష్ణ వందో చిత్రం
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని డైరెక్ట్ చేసిన క్రిష్ జాగర్లమూడి ఈ ‘ఆదిత్య 999’ సినిమాకు దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించనున్నారని భోగట్టా.
ఈ సినిమాలో మోక్షజ్ఞ నటించడం కన్ఫార్మ్ అయితే అతని తొలి చిత్రం ఇదే అవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే బాలకృష్ణ నటించిన మరో సీక్వెల్ మూవీ ‘అఖండ 2’. హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూ పొందిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ చిత్రం తెరకెక్కింది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లోనే ‘అఖండ 2’ రూ పొందింది.
ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మించారు. సంయుక్త, ఆది పినిశెట్టి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తొలుత సెప్టెంబరు 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘అఖండ 2’ చిత్రం డిసెంబరులో విడుదల కానున్నట్లు ఇటీవల ఓ సందర్భంలో బాలకృష్ణ తెలిపారు. ‘అఖండ 2’ డిసెంబరు 4 లేదా డిసెంబరు 5న రిలీజ్ అవుతుందని భోగట్టా.
పనులు ప్రారంభం
ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ పూర్తయిన తర్వాత సందీప్‌రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమాను ఆరంభిస్తారు ప్రభాస్. కాగా ప్రభాస్ హీరోగా నటించిన మరో బ్లాక్‌బస్టర్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు. సి. అశ్వనీదత్ నిర్మించారు. కాగా ఈ సినిమా సీక్వెల్ ‘కల్కి 2’ చిత్రీకరణను ఈ ఏడాది చివర్లో ఆరంభించే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
దీంతో ‘స్పిరిట్, కల్కి 2’ చిత్రీకరణల్లో ప్రభాస్ ఏకకాలంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కానీ ‘కల్కి 2’ చిత్రం నుంచి దీపికా పదుకోన్ తప్పుకున్నట్లుగా మేకర్స్ గురువారం వెల్లడించారు. ఆమె ప్లేస్‌లో కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. కొంత ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ కూడా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ‘స్పిరిట్’ సినిమా మొదలై, కొంత చిత్రీకరణ జరుపుకున్న తర్వాత ‘కల్కి 2’ మూవీ చిత్రీకరణ ప్రారంభం కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే ‘స్పిరిట్, కల్కి 2’ చిత్రాల తర్వాత ప్రభాస్ ‘సలార్ 2’ సినిమా ప్రారంభం అవుతుంది. కానీ ‘సలార్ 2’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది.
వచ్చే ఏడాది సెట్స్‌లోకి దేవర
తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘దేవర’. ఇందులో తండ్రి దేవ, కొడుకు వర పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూ పొందిన ‘దేవర’ 2024 సెప్టెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ‘దేవర’కు మేకర్స్ ఊహించినంత రెస్పాన్స్ రాలేదని, దీంతో ‘దేవర 2’ ఉండక పోవచ్చనే టాక్ వినిపించింది.
కానీ ‘మ్యాడ్ 2’ సినిమా సక్సెస్‌మీట్‌లో ‘దేవర 2’ కచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ కన్‌ఫార్మ్ చేశారు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘దేవర 2’ సినిమా షూటింగ్‌ను ఆరంభిస్తారట ఎన్టీఆర్. ప్రస్తుతం ‘దేవర 2’ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు కొరటాల శివ. వచ్చే ఏడాది ‘దేవర 2’ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
సంక్రాంతికే రిలీజ్?
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూ పొందిన సినిమా ‘హను–మాన్’. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. అయితే ‘హను–మాన్’ చివర్లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానున్నట్లుగా ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రంలో కన్నడ నటుడు ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి నటించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుందని తెలిసింది. ఇక హను–మాన్ సినిమా సీక్వెల్‌ను 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే కాస్త ఆలస్యంగానే ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటికీ ఏ ఏడాది వచ్చినా ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
మళ్లీ సామజ వరగమన
శ్రీ విష్ణు, రెబ్బా మౌనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సామజ వరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూ పొందిన ఈ సినిమా 2023లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో అప్పట్నుంచే ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఇటీవల ‘సామజ వరగమన’ చిత్రం సీక్వెల్ పనులు ఆరంభం అయ్యాయని, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఓసారి కథ స్క్రిప్ట్ లాక్ అయితే, త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘సామజ వరగమన’ చిత్రంలో హీరోగా నటించిన శ్రీవిష్ణు సీక్వెల్‌లోనూ నటించనున్నారని టాక్.
మరోసారి గూఢచారి
అడివి శేష్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో ‘గూఢచారి’ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జీ 2’ (గూఢచారి 2) తెరకెక్కుతోంది.‘గూఢచారి’ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా, ‘జీ 2’ని మాత్రం ఎస్. వినయ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడిగా వినయ్ కుమార్‌కు ఇది తొలి చిత్రం. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ 2’ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘జీ 2’ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది.
నెక్ట్స్ పేజీ
శర్వానంద్ కెరీర్‌లో వన్నాఫ్ ది సూపర్ హిట్స్ మూవీ ‘శతమానం భవతి’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం 2017లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. కాగా ‘శతమానం భవతి నెక్ట్స్ పేజి’ అంటూ ఈ సినిమా సీక్వెల్‌ను గత ఏడాది సంక్రాంతికి ప్రకటించి, ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామన్నట్లుగా ‘దిల్’ రాజు అండ్ టీమ్ పేర్కొంది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే ‘శతమానం భవతి’ సినిమా సీక్వెల్ కోసం కథ సిద్ధం అవుతోందని, ఫుల్ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి... ఈ చిత్రం సీక్వెల్‌లో హీరో శర్వానంద్ నటిస్తారా? లేక ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు హీరో ఆశిష్ నటిస్తారా? అనే విషయంపై మాత్రం ఓ స్పష్టత రావాలి.
రాయలసీమ టు ఎండ్ ఆఫ్ ది వరల్డ్
‘హను–మాన్, మిరాయ్’ వంటి సూపర్‌డూపర్ హిట్స్ తర్వాత హీరో తేజ సజ్జా చేయనున్న సినిమా ‘జాంబిరెడ్డి 2’. తేజ సజ్జాతో ‘మిరాయ్’ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థయే ఈ ‘జాంబిరెడ్డి 2’ సినిమానూ నిర్మించనుంది. తేజ సజ్జా హీరోగా నటించి, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘జాంబిరెడ్డి’ సినిమాకు సీక్వెల్‌గా ‘జాంబిరెడ్డి 2’ తెరకెక్కనుంది. అయితే చిన్న మార్పు ఉంది. ‘జాంబిరెడ్డి’ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా, ‘జాంబిరెడ్డి’ సీక్వెల్‌కు ప్రశాంత్ వర్మ కథ మాత్రమే అందిస్తున్నారు.
ఈ సీక్వెల్‌కు ఇంకా దర్శకుడు ఖరారు కాలేదని, త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని ‘మిరాయ్’ ప్రమోషన్స్‌లో భాగంగా తేజ వెల్లడించారు. ‘జాంబిరెడ్డి’ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అయితే ‘జాంబిరెడ్డి 2’ కథ మాత్రం రాయలసీమ నుంచి ఇంటర్‌నేషనల్ రేంజ్‌ను టచ్ చేస్తుందని తెలుస్తుంది. ‘ఫ్రమ్ రాయలసీమ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అని ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై ఉంది. దీన్ని బట్టి ‘జాంబిరెడ్డి 2’ సినిమా కథను ప్రశాంత్ వర్మ అంతర్జాతీయ స్థాయిలో సిద్ధం చేశారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌కు వెళ్తుందట. ఈ ‘జాంబిరెడ్డి 2’ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు సీక్వెల్స్ కాస్త అరుదుగా వస్తుంటాయి. అయితే ‘మంగళవారం’ సినిమాకు సీక్వెల్ తీసేందుకు ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారట ఈ చిత్రదర్శకుడు అజయ్ భూపతి. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన ‘మంగళవారం’ చిత్రం 2023లో విడుదలై, ప్రేక్షకుల మెప్పు పొందింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మంగళవారం’ సినిమాకు సీక్వెల్‌గా ‘మంగళవారం 2’ తెరకెక్కనుందని, తొలి భాగంలో నటించిన పాయల్ రాజ్‌పుత్ మలి భాగంలోనూ మెయిన్ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ ‘మంగళవారం’ సీక్వెల్‌లో తాను నటించడం లేదని గతంలో వెల్లడించారు పాయల్ రాజ్‌పుత్. దీంతో ఈ సినిమా సీక్వెల్ ‘మంగళవారం 2’లో ఎవరు నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ఆ సమయంలో శ్రీలీల, కృతీ శెట్టి వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ప్రచారంలో ఉన్నట్లుగా ‘మంగళవారం’ సీక్వెల్‌లో శ్రీలీల నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. – ముసిమి శివాంజనేయులు