వడ్డే నవీన్.. గతంలో వరుస ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో. 1990, 2000 దశకాల్లో ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ తర్వాత మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలు ఎంపిక చేసుకోకపోవడంతో వరుస ఫ్లాపులు మూట గట్టుకున్నాడు. ఆయన సినిమాలకు ఆదరణ ఉండడం లేదని గ్రహించి.. విరామం తీసుకున్నాడు. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చి ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చేశారు. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(జూన్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
త్రిమూర్తులు(వడ్డే నవీన్) నిజాయితీగల కానిస్టేబుల్. సిన్సియర్‌గా డ్యూటీ చేయడం వల్ల పదేళ్ల కాలంలో 55 సార్లు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అలా మరోసారి బదిలీపై అరకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఓ పాత కేసు తన దృష్టికి వస్తుంది. అది 2005లో తన తండ్రి(దేవిప్రసాద్) ఫైల్ చేసిన రేప్ కేసు. ప్రియమ్మ అనే గిరిజన యువతిపై సంతోష్ బాబు అత్యాచారానికి పాల్పడినట్లు తొలుత ఎఫ్‌ఐఆర్ నమోదు అవుతుంది. ఆ తర్వాత అరగంటకే ప్రియమ్మనే సంతోష్ బాబుని హనీట్రాప్ చేసినట్లు ఇంకో కంప్లైంట్ వస్తుంది. దీని గురించి ఆరా తీయగా.. ప్రియమ్మకు అన్యాయం జరిగిందనే విషయం త్రిమూర్తులుకి తెలుస్తుంది. అంతేకాదు ఈ కేసు కారణంగానే తన తండ్రి మరణించాడనే విషయం కూడా తెలుస్తుంది. దీంతో ఎలాగైన ఈ కేసులోని నిజా నిజాలను బయటకు తీసి, బాధితురాలికి న్యాయం చేయాలని భావిస్తాడు. ఈ క్రమంలో ఏకంగా ముఖ్యమంత్రినే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సాధారణ కానిస్టేబుల్‌గా త్రిమూర్తులు ఈ కేసును ఎలా ఛేదించాడు? సీఎం కమలాదేవి(శిల్ప తులస్కర్), ఆమె కొడుకు సంతోష్ బాబు నుంచి ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ప్రియమ్మకు న్యాయం అందించి తండ్రి కోరికను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
నిజాయితీగా పని చేసే ఓ కానిస్టేబుల్ స్టోరీ ఇది. పెద్దగా అధికారాలు లేని కానిస్టేబుల్ తలచుకుంటే బాధితులకు ఎలా న్యాయం చేయగలడో ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది కానీ దాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలం చెందాడు. సీరియస్ ఇష్యూని తీసుకున్నప్పుడు అంతే సీరియస్‌గా తెరపై చూపిస్తే బాగుంటుంది. అంతేకానీ దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి.. వాస్తవికానికి దూరంగా చూపిస్తే ప్రేక్షకుడు కథకి ఎలా కనెక్ట్ అవుతాడు? తెరపై చూస్తే.. నిజజీవితానికి కొంచెం అయినా పోలికలు ఉండాలి. కొంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే ఓకే. కానీ కథనం మొత్తం అలానే నడిపిస్తే ఎలా?
ఈ సినిమాలో ఒక సన్నివేశంలో సీఎంపై దాడి జరుగుతుంది. దాన్ని కానిస్టేబుల్ అయిన హీరో అడ్డుకుంటాడు. ఆ సీన్ చూసినప్పుడు ‘ఇంత సింపుల్‌గా సీఎంపై దాడి చేయొచ్చా? ఒక కానిస్టేబుల్ అలా చేసిన పై అధికారులు సైలెంట్‌గా ఉంటారా? అనే సందేహం అందరిలో కలుగుతుంది. ఇక మరో సీన్‌లో రాష్ట్రంలోని పోలీసులంతా నిఘా పెట్టినా సరే ఒక కానిస్టేబుల్‌ని పట్టుకోలేకపోతారు. వాస్తవికంగా ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇలా చాలా చోట్ల టూమచ్ లిబర్టీ తీసుకున్నాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు. అసలు కథను ప్రారంభించడానికి ఫస్టాఫ్ మొత్తం సాగదీశాడు. ఇక సెకండాఫ్‌లో అయినా సీరియస్‌గా కథను ముందుకు నడిపిస్తే బాగుండేది. కానీ అనవసరమైన ఛేజింగులు, ఫైటింగులతో పాటు ఐటెమ్ పాటలు పెట్టి.. ఇక్కడ కూడా సాగదీశాడు. కోర్టు రూమ్ డ్రామా బాగుటుంది. అయితే అప్పటికే ప్రేక్షకుడు సహజం కోల్పోతాడు. మేకింగ్ , టేకింగ్ చూస్తే మాత్రం పదేళ్ల గ్యాప్ తర్వాత పదేళ్ల క్రితం కంటే పాత కథతో నవీన్ రీఎంట్రీ ఇచ్చాడేంటి? అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే..
పదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నవీన్.. తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. తెరపై అప్పట్లో కనిపించినట్లుగానే అందంగా కనిపించాడు. యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. ఆయనతో డ్యాన్స్ చేయించి పొరపాటు చేశారనిపిస్తుంది. హీరో భార్యగా రాశీ సింగ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. బాగానే చేసింది. సీఎం పాత్రకి శిల్ప పూర్తి న్యాయం చేసింది. మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా జస్ట్ ఓకే. నేపథ్యం సంగీతం పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


