vadde naveen
-
వడ్డే నవీన్ కమ్ బ్యాక్ మూవీ.. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ
వడ్డే నవీన్.. గతంలో వరుస ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో. 1990, 2000 దశకాల్లో ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ తర్వాత మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలు ఎంపిక చేసుకోకపోవడంతో వరుస ఫ్లాపులు మూట గట్టుకున్నాడు. ఆయన సినిమాలకు ఆదరణ ఉండడం లేదని గ్రహించి.. విరామం తీసుకున్నాడు. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చి ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చేశారు. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(జూన్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. త్రిమూర్తులు(వడ్డే నవీన్) నిజాయితీగల కానిస్టేబుల్. సిన్సియర్‌గా డ్యూటీ చేయడం వల్ల పదేళ్ల కాలంలో 55 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. అలా మరోసారి బదిలీపై అరకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఓ పాత కేసు తన దృష్టికి వస్తుంది. అది 2005లో తన తండ్రి(దేవిప్రసాద్) ఫైల్ చేసిన రేప్ కేసు. ప్రియమ్మ అనే గిరిజన యువతిపై సంతోష్ బాబు అత్యాచారానికి పాల్పడినట్లు తొలుత ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. ఆ తర్వాత అరగంటకే ప్రియమ్మనే సంతోష్ బాబుని హనీట్రాప్ చేసినట్లు ఇంకో కంప్లైంట్ వస్తుంది. దీని గురించి ఆరా తీయగా.. ప్రియమ్మకు అన్యాయం జరిగిందనే విషయం త్రిమూర్తులుకి తెలుస్తుంది. అంతేకాదు ఈ కేసు కారణంగానే తన తండ్రి మరణించాడనే విషయం కూడా తెలుస్తుంది. దీంతో ఎలాగైన ఈ కేసులోని నిజా నిజాలను బయటకు తీసి, బాధితురాలికి న్యాయం చేయాలని భావిస్తాడు. ఈ క్రమంలో ఏకంగా ముఖ్యమంత్రినే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సాధారణ కానిస్టేబుల్‌గా త్రిమూర్తులు ఈ కేసును ఎలా ఛేదించాడు? సీఎం కమలాదేవి(శిల్ప తులస్కర్), ఆమె కొడుకు సంతోష్ బాబు నుంచి ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ప్రియమ్మకు న్యాయం అందించి తండ్రి కోరికను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. నిజాయితీగా పని చేసే ఓ కానిస్టేబుల్ స్టోరీ ఇది. పెద్దగా అధికారాలు లేని కానిస్టేబుల్ తలచుకుంటే బాధితులకు ఎలా న్యాయం చేయగలడో ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది కానీ దాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలం చెందాడు. సీరియస్ ఇష్యూని తీసుకున్నప్పుడు అంతే సీరియస్‌గా తెరపై చూపిస్తే బాగుంటుంది. అంతేకానీ దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి.. వాస్తవికానికి దూరంగా చూపిస్తే ప్రేక్షకుడు కథకి ఎలా కనెక్ట్ అవుతాడు? తెరపై చూస్తే.. నిజజీవితానికి కొంచెం అయినా పోలికలు ఉండాలి. కొంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే ఓకే. కానీ కథనం మొత్తం అలానే నడిపిస్తే ఎలా? ఈ సినిమాలో ఒక సన్నివేశంలో సీఎంపై దాడి జరుగుతుంది. దాన్ని కానిస్టేబుల్ అయిన హీరో అడ్డుకుంటాడు. ఆ సీన్ చూసినప్పుడు ‘ఇంత సింపుల్‌గా సీఎంపై దాడి చేయొచ్చా? ఒక కానిస్టేబుల్ అలా చేసిన పై అధికారులు సైలెంట్‌గా ఉంటారా? అనే సందేహం అందరిలో కలుగుతుంది. ఇక మరో సీన్లో రాష్ట్రంలోని పోలీసులంతా నిఘా పెట్టినా సరే ఒక కానిస్టేబుల్ని పట్టుకోలేకపోతారు. వాస్తవికంగా ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇలా చాలా చోట్ల టూమచ్ లిబర్టీ తీసుకున్నాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు. అసలు కథను ప్రారంభించడానికి ఫస్టాఫ్ మొత్తం సాగదీశాడు. ఇక సెకండాఫ్‌లో అయినా సీరియస్‌గా కథను ముందుకు నడిపిస్తే బాగుండేది. కానీ అనవసరమైన ఛేజింగులు, ఫైటింగులతో పాటు ఐటెమ్ పాటలు పెట్టి.. ఇక్కడ కూడా సాగదీశాడు. కోర్టు రూమ్ డ్రామా బాగుటుంది. అయితే అప్పటికే ప్రేక్షకుడు సహజం కోల్పోతాడు. మేకింగ్ , టేకింగ్ చూస్తే మాత్రం పదేళ్ల గ్యాప్ తర్వాత పదేళ్ల క్రితం కంటే పాత కథతో నవీన్ రీఎంట్రీ ఇచ్చాడేంటి? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే..పదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నవీన్.. తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. తెరపై అప్పట్లో కనిపించినట్లుగానే అందంగా కనిపించాడు. యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. ఆయనతో డ్యాన్స్ చేయించి పొరపాటు చేశారనిపిస్తుంది. హీరో భార్యగా రాశీ సింగ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. బాగానే చేసింది. సీఎం పాత్రకి శిల్ప పూర్తి న్యాయం చేసింది. మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా జస్ట్ ఓకే. నేపథ్యం సంగీతం పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్ షాకింగ్ లైఫ్ స్టైల్..!
ఒకప్పుడు టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ గురించి తెలియనివారు ఉండరు. ఆయన హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాత దాదాపు పదేళ్ల పాటు వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీతో పదేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది.మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధం కావడంతో వడ్డే నవీన్ తన సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన డైలీ రోటీన్ లైఫ్, ఆహార విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా షాకింగ్ రివీల్ చేశారు. ప్రతి రోజు ఉదయాన్నే ఒక గంట వాకింగ్, జిమ్ చేస్తానని వడ్డే నవీన్ తెలిపారు. ఉదయాన్నే టిఫిన్ కాకుండా డైరెక్ట్‌గా మీల్స్ తింటానని వెల్లడించారు. ఉదయమే చికెన్, రైస్ తింటా.. లేదంటే వెజ్ కర్రీ ఏదైనా సరే రైస్‌తో కలిపి తీసుకుంటానని అన్నారు. అయితే తాను మధ్యాహ్నం లంచ్ చేయనని వడ్డే నవీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నైట్ డిన్నర్లో కూడా ఉదయం లాగే నాన్‌వెజ్‌తో వెజ్ కూడా ఉంటుందని తెలిపారు. అయితే డైలీ లంచ్ చేయకపోవడం అన్నది వింటే మాత్రం కాస్తా షాకింగ్‌గానే అనిపిస్తోంది. రోజులో ఒక పూట తినకుండా ఉండడం అంతా ఈజీ కాదంటున్నారు. కాగా.. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు కల్యాణ్ నాయక్ సంగీతమందించారు. -
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
-
మాస్ పోలీస్
వెండితెరపై తమ అభిమాన హీరో మాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే థియేటర్స్‌లో ఆ హీరో ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. అన్యాయం చేస్తున్న విలన్స్‌ను పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో హీరో రఫ్ఫాడిస్తుంటే థియేటర్స్ విజిల్స్, చప్పట్ల సౌండ్స్‌తో మారుమోగి పోతాయి. మరి... థియేటర్స్‌లో ఈ మాస్ వైబ్రేషన్‌ను క్రియేట్ చేసి, ప్రేక్షకులను అలరించేందుకు ఖాకీ చొక్కా వేసుకుని, లాఠీ పట్టిన వెండితెర మాస్ పోలీస్‌లపై ఓ లుక్ వేయండి.మళ్లీ వస్తున్నాడు ముత్తువేల్ పాండియన్ పోలీస్ స్టోరీస్ అంటే రజనీకాంత్‌కు ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతున్నట్లుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో మూడుసార్లు (దర్బార్, జైలర్, వేట్టయాన్) రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా వెండితెరపై కనిపించారు. ఆయన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ పోలీస్ ఆఫీసర్‌గానే నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘జైలర్’. ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటించారు.ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కింది. ఈ ‘జైలర్ 2’ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటించారు. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక ‘జైలర్’ చిత్రంలో నటించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మోహన్‌లాల్ ‘జైలర్ 2’ చిత్రంలోనూ నటించారు.కొత్తగా ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ ఈ సినిమాలో భాగమయ్యారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ రోషన్ నార్త్‌కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. తొలుత ఈ పాత్రకు షారుక్ ఖాన్‌ను అనుకున్నారు. కానీ ఫైనల్‌గా హృతిక్ రోషన్ ఓకే అయ్యారు. దాదాపు నలభై సంవత్సరాల క్రితం రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా హృతిక్ రోషన్ నటించారు. మళ్లీ ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత రజనీకాంత్–హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.సంక్రాంతికి వస్తారా! సిల్వర్ స్క్రీన్‌పై సింగమ్ అంటే సూర్య అని ఇట్టే చెప్పేస్తారు యాక్షన్ సినిమా లవర్స్. పోలీస్ ఆఫీసర్‌గా ‘సింగమ్’ సిరీస్ సినిమాల్లో సూర్య తన యాక్టింగ్‌తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. నిజానికి ‘సింగమ్’ సిరీస్ చిత్రాలకంటే ముందే, ‘కాక్క కాక్క’ అనే ఓ తమిళ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమానే వెంకటేశ్ హీరోగా తెలుగులో ‘ఘర్షణ’గా రీమేక్ అయ్యింది. ఇలా... సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ప్రతిసారీ ఆ సినిమా హిట్ అయి పోతుంది. కాగా సూర్య ప్రస్తుతం మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో సూర్యది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిందని కూడా సమాచారం. నజ్రియా నజీమ్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ యువ నటుడు, ‘ప్రేమలు, లోక: చాప్టర్ 1’ చిత్రాల ఫేమ్ నస్లెన్ కె. గఫూర్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. సూర్య కెరీర్‌లోని ఈ 47వ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది.అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక కొంత కాలంగా వరుస సినిమాల వైఫల్యాలతో ఇబ్బందిపడిన సూర్య ఇటీవల ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు యూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ‘కరుప్పు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత సూర్య నుంచి రాబోతున్న సినిమాపై ఆయన ఫ్యాన్స్‌లో, తమిళ ఇండస్ట్రీలో అంచనాలున్నాయి.తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా... సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్ కటౌట్ పోలీస్ ఆఫీసర్‌గా సూపర్బ్‌గా సూట్ అవుతుంది. ఆరడుగుల ప్రభాస్ పోలీస్ గెటప్‌లో స్క్రీన్‌పై కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. థియేటర్స్‌లో విజిల్స్ మోత మోగి పోతాయి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘స్పిరిట్’లో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇటీవల ప్రభాస్ పోలీస్ గెటప్ ఉండగా, ఓ థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా కాంచన, ప్రకాష్‌రాజ్, వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘మిర్చి’ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తల్లీకొడుకులుగా నటించారు ప్రభాస్, నదియా. ‘స్పిరిట్’ సినిమా కోసం మళ్లీ నదియా, ప్రభాస్ కలిసి నటిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ సమా చారం. అలాగే ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్స్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రధానంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే ప్రభాస్ కనిపిస్తారు. కానీ ఈ చిత్రంలో ప్రోఫెసర్గానూ, గ్యాంగ్స్టర్గానూ ప్రభాస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.10 సంవత్సరాలు... 55 ట్రాన్స్ఫర్స్ ‘పెళ్లి, చాలా బాగుంది, మా బాలాజీ, మనసిచ్చి చూడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు వడ్డే నవీన్. కాగా, యాక్టర్‌గా కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ త్రిమూర్తులు అనే పాత్రలో వడ్డే నవీన్ నటించారు. రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు.కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. పది సంవత్సరాల్లో 55 సార్లు ట్రాన్స్ఫర్ అయిన కానిస్టేబుల్ త్రిమూర్తులు కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నాటి కేసును సాల్వ్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఈ కేసుకు, త్రిమూర్తులకు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమా కథనం అని తెలిసింది. ఇక ఈ సినిమాతో నిర్మాతగా మారారు వడ్డే నవీన్.పవర్ఫుల్ పోలీస్ ‘కూలీ నెంబరు 1, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల... వైకుంఠపురములో..’ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేశారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో టబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ సంయుక్త, దునియా విజయ్‌కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటీవల ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో డీసీపీ (డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్)గా టబు కనిపించారు. ఈ చిత్రంలో బెగ్గింగ్ మాఫియాను అరికట్టే మిషన్‌ను టేకప్ చేస్తారట ఆమె. పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఫుల్ మాస్వెండితెరపై ఇప్పటివరకు ఎక్కువగా బ్యూటిఫుల్ హీరోయిన్‌గానే కనిపించారు సాయి పల్లవి. ధనుష్ ‘మారి 2’, నాని ‘ఎమ్సీఏ’ సినిమాల్లో మాత్రం సాయి పల్లవి క్యారెక్టర్లో చిన్నపాటి మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించేందుకు ఆమె సిద్ధమయ్యారని తెలిసింది. ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.కాగా, ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ వపర్‌ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్‌లో కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. వెండితెరపై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించేందుకు ఆమె శిక్షణ కూడా తీసుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. అలాగే ఈ చిత్రంలో మమ్ముట్టి కూడా పోలీస్ అధికారి పాత్రలోనే కనిపిస్తారట. అంతేకాదు... మమ్ముట్టి పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. హిట్ 4 తెలుగు సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ సిరీస్ సినిమాల్లో హీరో పోలీస్ ఆఫీసర్‌గానే కనిపిస్తారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన ‘హిట్’లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’లో అడివి శేషు, ‘హిట్ 3’లో నాని పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. ఇక ‘హిట్ 3’ ఎండింగ్లో ‘హిట్ 4’ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తారని స్పష్టం చేసింది యూనిట్. అయితే ప్రస్తుతం ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నారు. ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. మరోవైపు ‘హిట్’ సిరీస్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఓ లవ్‌స్టోరీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఇలా దర్శకుడు కల్యాణ్‌తో కార్తీ, హీరో రోషన్‌తో శైలేష్ వారి వారి సినిమాలను పూర్తి చేసిన తర్వాత, ‘హిట్ 4’ సినిమా సెట్స్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.బొగ్గు గనుల నేపథ్యంలో...! తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్, ఆడుకలం నరేన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రంలో బొగ్గు కుంభకోణాలకు సంబంధించిన దోషులను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సంయుక్త నటించారని తెలిసింది.అంతేకాదు... ఈ సినిమా కోసం సంయుక్త కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాలో హైలైట్‌గా ఉంటాయని తెలిసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను ‘ది బ్లాక్‌గోల్డ్’ సినిమాలో ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ చిత్రయూనిట్ పేర్కొంది. యోగేష్ కేఎమ్‌సీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.వీరే కాదు... మరికొంతమంది హీరో, హీరోయిన్లు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారని తెలిసింది. మరికొందరు పోలీస్ స్టోరీ నేపథ్యంలో వచ్చే కథలను వింటున్నారు.– ముసిమి శివాంజనేయులు -
వడ్డే నవీన్ ఎంత పవర్ఫుల్ అంటే.. వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
వడ్డే నవీన్.. 90వ దశకంలో ఆయన స్టార్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫేవరేట్ హీరో ఇతనే. 2000వ సంవత్సరం వరకు వరుస సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత యంగ్ హీరోలు రావడంతో ఈ ఫ్యామిలీ హీరో వెనక్కి తగ్గాడు. చివరగా ఆర్జీవీ ఎటాక్ (2016) సినిమాలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు త్రిమూర్తులు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కి స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నవీన్ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకుంటూ..ఆయన ఎంత పవర్ఫుల్లో వివరించాడు.నవీన్ హీరోగా చేసిన ఒక సినిమాకు వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడట. ఆయన ప్రోత్సాహంతోనే డైరెక్టర్ని ఆయ్యానని..ఆది సినిమాకు నాంది నవీనే అంటున్నాడు. ‘నవీన్‌తో కలిసి ఒకే ఒక్క సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశా కానీ, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన చేసిన సినిమాల్లో 90శాతం కంటే ఎక్కువగా ఇష్టం లేకుండానే చేసేశాడు. ఓ సారి నేను ఓ సీన్ రాశా..అది చూసి ఇది ఎవరు రాశారని అడిగారు. నేను డైరెక్షన్ టీమ్ అని చెప్తా.. కానీ నేనే రాశానని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి భోజనానికి పిలిచాడు. అప్పుడే ఇక అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయడం ఆపేసి..డైరెక్షన్ చేయమని చెప్పాడు. నీకు నేను తోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే డైరెక్టర్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆయన సినిమాకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్‌ను స్విట్జర్లాండ్‌లో కలిశా. అలా ఆది సినిమాకు నవీన్ సినిమా నాందిగా నిలిచింది’ అని వినాయక్ చెప్పాడు.ఇక నవీన్ ఎంతపవర్ఫుల్లో వివరిస్తూ.. ‘ఆయన సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విమానంలో స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు వస్తుంటే ఒక కాస్ట్యూమర్ సిగరేట్ కాల్చారు. అది భద్రతా సిబ్బందికి తెలిసి..చెన్నైలో అడుగుపెట్టగానే ఏకే 47 గన్లతో వచ్చి ఆ కాస్ట్యూమర్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం నవీన్ దగ్గరకు వెళ్లగానే.. ఒక ఫోన్ కాల్ చేసి నిమిషాల్లో విడిపించాడు. అప్పుడు ఈయన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడా, ఇంత పవర్ ఫుల్లా అని ఆశ్చర్యపోయాను’ అని వినాయక్ అన్నాడు. -
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
టా టా త్రిమూర్తులు!
‘పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ కొంత గ్యాప్ తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’. ఈ చిత్రం ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవీ ప్రసాద్, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ముఖ్య పాత్రలు పోషించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే నవీన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 19న విడుదల కానుంది. కల్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘టా టా...’ అనే తొలి సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటని నకాష్ అజీజ్ పాడారు. విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ‘‘ఓ సాధారణ కానిస్టేబుల్ నిజాయతీగా ఉంటూ ఇతరులకు సాయం చేస్తూనే మొండివాడుగా ఉంటుంటాడనే విషయాలను ఆవిష్కరించేలా ఈ పాట ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో వడ్డే నవీన్ నటనలో కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
అప్పట్లో స్టార్ హీరో.. పదేళ్ల గ్యాప్.. హిట్ పడుతుందా?
వడ్డే నవీన్.. ఇప్పటి సినీ ప్రియులకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్‌కి బాగా పరిచయమున్న హీరో. అప్పట్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వడ్డే నవీన్ ముందు వరుసలో ఉంటారు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.1996లో వచ్చిన క్రాంతి చిత్రంతో నవీన్ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మరో ప్రయత్నం చేశారు. 1997లో కోరుకున్న ప్రియుడు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు, స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడమీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఏమైందో తెలియదు కానీ 2010 తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు అంటే 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. వడ్డే నవీన్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ కొడతాడా?దాదాపు పదేళ్ల విరామం తర్వాత నటిస్తోన్న మూవీ కావడంతో వడ్డే నవీన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ హిట్ అయితే తనకు కూడా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు అవుతుంది. ఇటీవల కొందరు స్టార్స్ రీ ఎంట్రీ సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది హీరో రాజశేఖర్ సైతం బైకర్ మూవీతో మరోసారి వెండితెరపై మెరిశారు. ఈ చిత్రం ఆయనకు బాగానే కలిసొచ్చింది. ఇప్పుడు వడ్డే నవీన్ కూడా కమ్ బ్యాక్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ మూవీతో హిట్ పడితే వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమేనంటున్నాడు మన 90స్ హీరో. నవీన్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. -
అందుకే బ్రేక్ వచ్చింది : వడ్డే నవీన్
వడ్డే నవీన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో వడ్డే నవీన్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు (నిర్మాత వడ్డే రమేష్) చనిపోయిన తర్వాత నేను నటించిన, నిర్మించిన తొలి చిత్రం ఇది. పదేళ్లుగా నేను సినిమాలు చేయకపోయినా నన్ను గుర్తు పెట్టుకున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. నేను ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఫ్యామిలీతో ఉంటున్నాను. నాకు బ్రేక్ ఎలా వచ్చిందంటే... నాకు నచ్చిన సినిమాలు రాలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలు నచ్చక నేను చేయలేదు. ఇలా రెండు విధాలుగా నాకు బ్రేక్ వచ్చింది. ఎన్నో కథలు విన్న తర్వాత ఈ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ కథ చెప్పారు కమల్. కథ, స్క్రిప్ట్‌పై మేం ఇద్దరం ఏడాది పాటు వర్క్ చేశాం. కంటెంట్ కొత్తగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘పూరిగారి వద్ద పని చేసినప్పుడు ఇలాంటి ఓ మూమెంట్ కోసం చూశాను. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ నవీన్‌కు మంచి కమ్‌బ్యాక్ మూవీలా ఉంటుంది’’ అన్నారు కమల్ తేజ నార్ల. ‘‘ఇందులో నేను లక్ష్మీ అనే ΄ాత్రలో నటించాను’’ అని చె΄్పారు రాశీ సింగ్. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్. -
'పదేళ్లలో 55 ట్రాన్స్ఫర్స్'.. త్రిమూర్తులు టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అప్పట్లో పెళ్లి, మనసిచ్చి చూడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ కొన్నేళ్ల తర్వాత కనుమరుగైపోయాడు. మళ్లీ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల విరామం హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సినిమాకు కమల్‌తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీసింగ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఓ కానిస్టేబుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాట వినని రెబల్ కానిస్టేబుల్‌గా పాత్రలో వడ్డే నవీన్ కనిపించనున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రీఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్.. ఖాకీ చొక్కాలో లాఠీతో..
ఒకప్పటి హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) వెండితెరపై కనిపించి చాలాకాలమే అవుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతడు బిగ్స్క్రీన్పై రీఎంట్రీ ఇస్తున్నాడు. వడ్డే క్రియేషన్స్ అంటూ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్లోనే హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.త్రిమూర్తులుఈ చిత్రానికి త్రిమూర్తులు అని టైటిల్ ఫిక్స్ చేశాడు. ఆగస్టు 9 రాఖీ పండగ సందర్భంగా త్రిమూర్తులు నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో వడ్డే నవీన్ ఖాకీ చొక్కా ధరించి, లాఠీ పట్టుకుని సీరియస్‌గా కాకుండా సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నాడు.అప్పట్లో సెన్సేషన్ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ కుమారుడిగా నవీన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. కోరుకున్న ప్రియుడు సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా పెళ్లితో నవీన్‌కు పెద్ద హిట్ పడింది. మనసిచ్చి చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి పలు చిత్రాల్లో నటించాడు. వడ్డే నవీన్.. చివరగా 2016లో ఎటాక్ చిత్రంలో కనిపించాడు. From silver screen memories to a bold new avatar ✨#VaddeNaveen garu is back — ruling hearts & the screen again, in khaki style!👮🏻♂️Proudly presenting the #FirstLook of @vaddecreations Production No 1- #TransferTrimurthulu ❤️🔥@vaddenaveen @RashiReal_ @MeeKamalTeja @vamsikaka pic.twitter.com/J0ESA6X2Tm— vadde creations (@vaddecreations) August 9, 2025 చదవండి: నాన్న చీపురు, చెప్పులతో కొట్టేవాడు.. కారంపొడి చల్లేవాడు:నటి -
9 ఏళ్లుగా సినిమాలకు దూరంగా వడ్డే నవీన్.. ఇప్పుడేం చేస్తున్నారంటే?
సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదిస్తే సరిపోదు, దాన్ని అలాగే కాపాడుకోగలిగాలి. లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా వెండితెరపై కనిపించకుండా పోతారు. టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) విషయంలో ఇదే జరిగింది. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఇతడు చాలా కాలంగా తెలుగు తెరకు కనిపించకుండా పోయాడు.కెరీర్ అలా మొదలైందిప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ కుమారుడిగా నవీన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కోరుకున్న ప్రియుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా పెళ్లితో నవీన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. మనసిచ్చి చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. చివరగా 2016లో ఎటాక్ చిత్రంలో కనిపించాడు. ఆ తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. రీఎంట్రీ ఇలా ప్లాన్ చేశాడా?9 ఏళ్ల తర్వాత ఇతడు విలన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. యాక్టింగ్ సంగతి పక్కనపెడితే నవీన్ నిర్మాతగా మారనున్నాడు. వడ్డే క్రియేషన్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నటుడిగా కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే ఇలా నిర్మాత అవతారం ఎత్తి ట్విస్ట్ ఇచ్చాడంటున్నారు అభిమానులు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో నవీన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. Vadde Naveen starts his new production house.@vaddecreations 💥 pic.twitter.com/nufRFthfBw— Cinema Madness 24*7 (@CinemaMadness24) July 10, 2025 చదవండి: ఒక్క సినిమాకు 150 కట్స్.. విడుదలకు ముందే కోర్టు స్టే -
బిగ్‌బాస్ 6లోకి వడ్డే నవీన్.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్!
తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఇప్పటి వరకు ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో... సీజన్ సీజన్‌కి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇదే ఉత్సాహంతో ఓటీటీలోకి తీసుకొచ్చిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ఆ షో నడవలేదు. దీంతో త్వరలోనే ఆరో సీజన్‌ని ప్రారంభించి, ఆ లోటుని తీర్చుకోవాలని భావిస్తున్నారు బిగ్ నిర్వాహకులు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆరో సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. షో ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. సీజన్ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా హీరో వడ్డే నవీన్ వచ్చి చేరాడు. ఒకప్పుడు స్టార్ హీరో అయిన వడ్డే నవీన్.. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సినిమాల్లోనే కాకుండా ఏ ఈవెంట్లో కూడా నవీన్ కనిపించడం లేదు. అసలు ప్రస్తుతం వడ్డే నవీన్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు. (చదవండి: క్రేజీ రూమర్.. ఆ దర్శకుడితో మహేశ్ బాబు 30వ సినిమా!) అయితే ఇప్పటికీ ఆయన సినిమాలు మాత్రం టీవీ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా నవీన్‌కి మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంది. అందుకే బిగ్‌బాస్ నిర్వాహకులు వడ్డే నవీన్‌ని సీజన్ సిక్స్‌లోకి ఆహ్వానించారట. ఈ షోలో పాల్గొనడానికి మొదట్లో ఆయన ఒప్పుకోలేదట. దీంతో భారీ రెమ్యునరేషన్‌ని ఆఫర్ చేసి ఆయనను ఒప్పించారట. ఒకవేళ ఇదే నిజమైతే సీజన్ సిక్స్‌కి వడ్డే నవీనే స్పెషల్ అట్రాక్షన్ అవుతాడు. నవీన్‌తో పాటు సీజన్ సిక్స్ లిస్ట్‌లో జబర్దస్త్ కమెడియన్స్ ఆది, దీప్తి పిల్లి, వర్షిణి, యాంకర్ ధనుష్, ఓటీటీ కంటెస్టెంట్ లు శివ, అనిల్, మిత్రాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. -
కోటి లింగాలలో సినీ నటుడు నవీన్ పూజలు
ముక్త్యాల(జగ్గయ్యపేట) : గ్రామ సమీపంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలోని అమృతలింగేశ్వరస్వామిని సినీ నటుడు వడ్డే నవీన్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ధూళిపాళ్ల సుబ్రహ్మణ్యంస్వామి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు ఆలయ సమీపంలోని అలకనంద రియల్ ఎస్టేట్‌లోని ప్రైవేట్ ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, హైకోర్టు న్యాయవాదులు ఉన్నారు. -
మే 11న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఆదాశర్మ (బాలీవుడ్ నటి), వడ్డే నవీన్ (నటుడు) ఈ తేదీన పుట్టిన రోజు జరుపుకునేవారికి ఈ సంవత్సరం కొంచెం ఒడుదొడుకులతో కూడుకుని ఉంటుంది. ఈ సంవత్సర సంఖ్య 6 కావడం వల్ల కొత్త ప్రాజెక్టుల జోలికి పోకుండా, పాత వాటినే కొనసాగించి, వాటిని పూర్తి చేయడం మంచిది. అవివాహితులకు వివాహమయ్యే అవకాశాలు, సంతానం లేని వారికి సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. విలాసవంతమైన వస్తువులు, గృహోపకరణాలను అమర్చుకుంటారు. ఉద్యోగరీత్యా విదేశాలలో ఉంటూ, స్వదేశానికి వచ్చి, తలిదండ్రులతో గడపాలని కోరుకునేవారి కల ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది. ఏ విషయంలోనైనా ఆవేశ కావేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించడం మంచిది. సైన్స్ గ్రూప్ విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి. లక్కీ నంబర్స్: 1, 2, 6; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, సిల్వర్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, సిల్వర్, బ్లూ. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నిర్మాత వడ్డే రమేష్‌కు సినీ ప్రముఖుల నివాళి
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ (66) గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కేన్సర్ చికిత్స నిమిత్తం కొన్నాళ్లుగా ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారు. వ్యాధి తీవ్రత అధికమవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రమేష్‌ని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన గురువారం సాయంత్రం 4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని శుక్రవారం సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. -
‘బొబ్బిలి పులి’ నిర్మాత వడ్డే రమేష్ ఇక లేరు!
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ (66) గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కేన్సర్ చికిత్స నిమిత్తం కొన్నాళ్లుగా ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారు. వ్యాధి తీవ్రత అధికమవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రమేష్‌ని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన గురువారం సాయంత్రం 4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నళిని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు నవీన్ వడ్డే హీరోగా ప్రేక్షకులకు సుపరిచితుడే. సినిమాల పట్ల ఓ ప్రత్యేకమైన అభిమానం, అభిరుచి కలిగిన వడ్డే రమేష్ తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ ఖ్యాతి గడించారు. ఎన్టీఆర్‌తో బొబ్బిలి పులి, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, చిరంజీవితో లంకేశ్వరుడులాంటి సంచలన చిత్రాలు తీసి తెలుగు సినిమా వాణిజ్య స్థాయి పెరగడానికి దోహదపడ్డారు. హిందీ సినిమాతో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. కృష్ణ నటించిన ‘పండంటి కాపురం’ చిత్రాన్ని ‘సున్హేరా సంసార్’గా హిందీలో నిర్మించారు రమేష్. ఆయన మంచి సంగీత ప్రియుడు. అందునా నౌషాద్ సంగీతమంటే చెవి కోసుకునేవారు. అందుకే తన తొలి సినిమాకు సంగీత దర్శకునిగా నౌషాద్నే ఎంచుకున్నారు. సినిమాకు సంగీతాన్ని చేకూర్చడంలో నౌషాద్‌ది విభిన్నశైలి అని చెప్పేవారాయన. తెలుగులో రమేష్ నిర్మించిన తొలి సినిమా ‘పాడవోయి భారతీయుడా’. విజయభాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.బి.నారాయణతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. అదే సంస్థలో అక్కినేనితో ‘ఆత్మీయుడు’ తీశారు. వడ్డే రమేష్ అనగానే... ‘బొబ్బిలి పులి’ గుర్తొస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి అద్భుతమైన శుభారంభాన్ని పలికిన సినిమా అది. ఆ రోజుల్లో ‘బొబ్బిలి పులి’ సృష్టించిన సంచలనం మాటలతో చెప్పలేనిది. రమేష్ ఎన్ని విజయవంతమైన సినిమాలు అందించినా... ‘బొబ్బిలి పులి’ నిర్మాతగానే ప్రేక్షకులు ఆయన్ను పిలుచుకుంటుంటారు. నిర్మాతగా వడ్డే రమేష్ కెరీర్లో మేలి మలుపు ‘కటకటాల రుద్రయ్య’. విజయమాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమా స్కోప్‌లో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకు సంబంధించిన 24 శాఖలపై నిర్మాతకు కమాండ్ ఉండాలని, నిర్మాతకు నచ్చిందే తెరపైకి రావాలని గట్టిగా నమ్మేవారాయన. అదే అనుసరించేవారు కూడా. ‘కటకటాల రుద్రయ్య’ క్లైమాక్స్ విషయంలో దాసరితోనే ఆయన విభేదించారు. తర్వాత దాసరి మరో క్లైమాక్స్ చేశారు. దాసరి సన్నిహిత బృందంలో ఆయన కీలక సభ్యుడు. ఆయన కెరీర్లో బ్లాక్‌బస్టర్స్ అనదగ్గ సినిమాలన్నీ దాసరి దర్శకత్వం వహించినవే కావడం విశేషం. దాసరి వందవ చిత్రం ‘లంకేశ్వరుడు’కి వడ్డే రమేషే నిర్మాత. క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మకొడుకు’ చిత్రానికి కూడా నిర్మాత వడ్డేనే. ఇంకా కలహాల కాపురం, తిరుగుబాటు, దుర్గాదేవి, సుర్‌సంగం(హిందీ), ఏడుకొండలస్వామి, లవ్‌స్టోరి-99, కల్పన, క్రాంతి తదితర చిత్రాలను నిర్మించారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు నిజంగా తీరని లోటే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వడ్డే రమేష్ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో జరగనున్నాయి. -
వడ్డే నవీన్ తండ్రి రమేష్ మృతి
-
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ ఇకలేరు
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేష్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న రమేష్.. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించారు. ప్రముఖ నటుడు వడ్డే నవీన్ తండ్రి అయిన రమేష్ గతంలో పలు హిట్ చిత్రాలు రూపొందించారు. ఎన్టీఆర్ హీరోగా బొబ్బిలిపులి, చిరంజీవి హీరోగా లంకేశ్వరుడు, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, ఇంకా.. ఆత్మీయులు, విశ్వనాథ నాయకుడు లాంటి హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. -
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేష్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న రమేష్.. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించారు. ప్రముఖ నటుడు వడ్డే నవీన్ తండ్రి అయిన రమేష్ గతంలో పలు హిట్ చిత్రాలు రూపొందించారు. ఎన్టీఆర్ హీరోగా బొబ్బిలిపులి, చిరంజీవి హీరోగా లంకేశ్వరుడు, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, ఇంకా.. ఆత్మీయులు, విశ్వనాథ నాయకుడు లాంటి హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.


