మాస్ పోలీస్ పాత్రలు చేస్తున్న తెలుగు హీరోలు
మేమూ సిద్ధం అంటున్న హీరోయిన్స్
వెండితెరపై తమ అభిమాన హీరో మాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే థియేటర్స్‌లో ఆ హీరో ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. అన్యాయం చేస్తున్న విలన్స్‌ను పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో హీరో రఫ్ఫాడిస్తుంటే థియేటర్స్ విజిల్స్, చప్పట్ల సౌండ్స్‌తో మారుమోగి పోతాయి. మరి... థియేటర్స్‌లో ఈ మాస్ వైబ్రేషన్‌ను క్రియేట్ చేసి, ప్రేక్షకులను అలరించేందుకు ఖాకీ చొక్కా వేసుకుని, లాఠీ పట్టిన వెండితెర మాస్ పోలీస్‌లపై ఓ లుక్ వేయండి.
మళ్లీ వస్తున్నాడు ముత్తువేల్ పాండియన్
పోలీస్ స్టోరీస్ అంటే రజనీకాంత్‌కు ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతున్నట్లుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో మూడుసార్లు (దర్బార్, జైలర్, వేట్టయాన్) రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా వెండితెరపై కనిపించారు. ఆయన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ పోలీస్ ఆఫీసర్‌గానే నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘జైలర్’. ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటించారు.
ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కింది. ఈ ‘జైలర్ 2’ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటించారు. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక ‘జైలర్’ చిత్రంలో నటించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మోహన్‌లాల్ ‘జైలర్ 2’ చిత్రంలోనూ నటించారు.
కొత్తగా ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ ఈ సినిమాలో భాగమయ్యారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ రోషన్ నార్త్‌కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. తొలుత ఈ పాత్రకు షారుక్ ఖాన్‌ను అనుకున్నారు. కానీ ఫైనల్‌గా హృతిక్ రోషన్ ఓకే అయ్యారు. దాదాపు నలభై సంవత్సరాల క్రితం రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా హృతిక్ రోషన్ నటించారు. మళ్లీ ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత రజనీకాంత్–హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.
సంక్రాంతికి వస్తారా!
సిల్వర్ స్క్రీన్‌పై సింగమ్ అంటే సూర్య అని ఇట్టే చెప్పేస్తారు యాక్షన్ సినిమా లవర్స్. పోలీస్ ఆఫీసర్‌గా ‘సింగమ్’ సిరీస్ సినిమాల్లో సూర్య తన యాక్టింగ్‌తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. నిజానికి ‘సింగమ్’ సిరీస్ చిత్రాలకంటే ముందే, ‘కాక్క కాక్క’ అనే ఓ తమిళ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమానే వెంకటేశ్ హీరోగా తెలుగులో ‘ఘర్షణ’గా రీమేక్ అయ్యింది. ఇలా... సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ప్రతిసారీ ఆ సినిమా హిట్ అయి పోతుంది. కాగా సూర్య ప్రస్తుతం మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలో సూర్యది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిందని కూడా సమాచారం. నజ్రియా నజీమ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ యువ నటుడు, ‘ప్రేమలు, లోక: చాప్టర్ 1’ చిత్రాల ఫేమ్ నస్లెన్ కె. గఫూర్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. సూర్య కెరీర్‌లోని ఈ 47వ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది.
అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక కొంత కాలంగా వరుస సినిమాల వైఫల్యాలతో ఇబ్బందిపడిన సూర్య ఇటీవల ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు యూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ‘కరుప్పు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత సూర్య నుంచి రాబోతున్న సినిమాపై ఆయన ఫ్యాన్స్‌లో, తమిళ ఇండస్ట్రీలో అంచనాలున్నాయి.
తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా...
సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్ కటౌట్ పోలీస్ ఆఫీసర్‌గా సూపర్బ్‌గా సూట్ అవుతుంది. ఆరడుగుల ప్రభాస్ పోలీస్ గెటప్‌లో స్క్రీన్‌పై కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. థియేటర్స్‌లో విజిల్స్ మోత మోగి పోతాయి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘స్పిరిట్’లో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇటీవల ప్రభాస్ పోలీస్ గెటప్ ఉండగా, ఓ థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా కాంచన, ప్రకాష్‌రాజ్, వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘మిర్చి’ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తల్లీకొడుకులుగా నటించారు ప్రభాస్, నదియా. ‘స్పిరిట్’ సినిమా కోసం మళ్లీ నదియా, ప్రభాస్ కలిసి నటిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ సమా చారం. అలాగే ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్స్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రధానంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే ప్రభాస్ కనిపిస్తారు. కానీ ఈ చిత్రంలో ప్రోఫెసర్‌గానూ, గ్యాంగ్‌స్టర్‌గానూ ప్రభాస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.
10 సంవత్సరాలు... 55 ట్రాన్స్‌ఫర్స్
‘పెళ్లి, చాలా బాగుంది, మా బాలాజీ, మనసిచ్చి చూడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు వడ్డే నవీన్. కాగా, యాక్టర్‌గా కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ త్రిమూర్తులు అనే పాత్రలో వడ్డే నవీన్ నటించారు. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు.
కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. పది సంవత్సరాల్లో 55 సార్లు ట్రాన్స్‌ఫర్ అయిన కానిస్టేబుల్ త్రిమూర్తులు కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నాటి కేసును సాల్వ్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఈ కేసుకు, త్రిమూర్తులకు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా కథనం అని తెలిసింది. ఇక ఈ సినిమాతో నిర్మాతగా మారారు వడ్డే నవీన్.
పవర్‌ఫుల్ పోలీస్
‘కూలీ నెంబరు 1, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల... వైకుంఠపురములో..’ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేశారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో టబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ సంయుక్త, దునియా విజయ్‌కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇటీవల ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో డీసీపీ (డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్)గా టబు కనిపించారు. ఈ చిత్రంలో బెగ్గింగ్ మాఫియాను అరికట్టే మిషన్‌ను టేకప్ చేస్తారట ఆమె. పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
ఫుల్ మాస్
వెండితెరపై ఇప్పటివరకు ఎక్కువగా బ్యూటిఫుల్ హీరోయిన్‌గానే కనిపించారు సాయి పల్లవి. ధనుష్ ‘మారి 2’, నాని ‘ఎమ్‌సీఏ’ సినిమాల్లో మాత్రం సాయి పల్లవి క్యారెక్టర్‌లో చిన్నపాటి మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించేందుకు ఆమె సిద్ధమయ్యారని తెలిసింది. ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా రానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
కాగా, ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ వపర్‌ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్‌లో కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. వెండితెరపై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించేందుకు ఆమె శిక్షణ కూడా తీసుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. అలాగే ఈ చిత్రంలో మమ్ముట్టి కూడా పోలీస్ అధికారి పాత్రలోనే కనిపిస్తారట. అంతేకాదు... మమ్ముట్టి పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.
హిట్ 4
తెలుగు సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ సిరీస్ సినిమాల్లో హీరో పోలీస్ ఆఫీసర్‌గానే కనిపిస్తారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన ‘హిట్’లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’లో అడివి శేషు, ‘హిట్ 3’లో నాని పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. ఇక ‘హిట్ 3’ ఎండింగ్‌లో ‘హిట్ 4’ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తారని స్పష్టం చేసింది యూనిట్. అయితే ప్రస్తుతం ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నారు. ఇదొక కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా. మరోవైపు ‘హిట్’ సిరీస్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఓ లవ్‌స్టోరీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఇలా దర్శకుడు కల్యాణ్‌తో కార్తీ, హీరో రోషన్‌తో శైలేష్ వారి వారి సినిమాలను పూర్తి చేసిన తర్వాత, ‘హిట్ 4’ సినిమా సెట్స్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బొగ్గు గనుల నేపథ్యంలో...!
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్, ఆడుకలం నరేన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రంలో బొగ్గు కుంభకోణాలకు సంబంధించిన దోషులను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సంయుక్త నటించారని తెలిసింది.
అంతేకాదు... ఈ సినిమా కోసం సంయుక్త కొన్ని పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాలో హైలైట్‌గా ఉంటాయని తెలిసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను ‘ది బ్లాక్‌గోల్డ్’ సినిమాలో ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ చిత్రయూనిట్ పేర్కొంది. యోగేష్ కేఎమ్‌సీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.
వీరే కాదు... మరికొంతమంది హీరో, హీరోయిన్లు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారని తెలిసింది. మరికొందరు పోలీస్ స్టోరీ నేపథ్యంలో వచ్చే కథలను వింటున్నారు.
– ముసిమి శివాంజనేయులు


