టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత! | Tollywood Senior Actor Krishneswara Rao Passed Away | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Aug 11 2026 5:22 PM | Updated on Aug 11 2026 5:28 PM

Tollywood Senior Actor Krishneswara Rao Passed Away

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, సీనియర్‌ నటుడు కృష్ణేశ్వర రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస కోశ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు(ఆగస్ట్‌ 11) గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  కృష్ణేశ్వర రావు పూర్తి పేరు ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణశ్వరరావు. పాఠశాల రోజుల నుంచే నాటకరంగంపై మక్కువ పెంచుకున్న కృష్ణశ్వరరావు, తన సుదీర్ఘ ప్రస్థానంలో 1,500కు పైగా నాటకాల్లో నటించారు. నాటకరంగంలో ఎన్నో ప్రయోగాలు చేసి, నంది అవార్డులు సైతం అందుకున్నారు. ‘ప్రచండ భారతం’తో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు ఆయనే కథను అందించాడు. శ్రీరాములయ్య, జయం మనదేరా చిత్రాలకు రచయితగా పనిచేశారు.

రచయితగానే కాకుండా నటుడిగా కూడా కృష్ణేశ్వరరావు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. దర్శకుడు వంశీతో పరిచయం కావడం ఆయన సినీ ప్రయాణంలో మరో ముఖ్యమైన మలుపు. వంశీ దర్శకత్వంలో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను’, ‘గోపి గోపిక గోదావరి’ వంటి చిత్రాల్లో నటించారు. ‘వీర తెలంగాణ’, ‘సరదాగా కాసేపు’, ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘వశం’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘నాంది’, ‘విరూపాక్ష’ తదితర చిత్రాల్లోనూ కనిపించారు. ముఖ్యంగా 2014లో విడుదలైన ‘చందమామ కథలు’ సినిమాలో బిచ్చగాడి పాత్ర ఆయనకు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ పాత్రకు గాను ఆయన నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. చిన్న పాత్ర అయినా తన సహజమైన నటనతో ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేయడం ఆయన ప్రత్యేకత. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement