breaking news
Krishneswara Rao
-
రంగస్థలం, వెండితెర ఆయనకు రెండు కళ్లు
సాక్షి, గుంటూరు(తెనాలి/ నగరంపాలెం): రంగస్థలం లేదా వెండితెర మాధ్యమం ఏదైనా నటన, రచన రెండు కళ్లుగా సుదీర్ఘకాలంగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన కృష్ణేశ్వరరావు. పూర్తిపేరు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు, బాపట్ల జిల్లా అమృతలూరు మండలం బోడపాడు. 1955 ఆగస్టు 4న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటరమణమ్మ, యల్లాప్రగడ హనుమంతరావు. 1969లో పదోతరగతి వార్షికోత్సవంలో ‘వాపస్’ నాటికతో రంగస్థల అరంగేట్రం చేసిన కృషే్ణశ్వరరావుకు అదే జీవితమైంది. వెండితెర ప్రస్థానం 1987లో ‘ఊరేగింపు’ సినిమాతో నటుడిగా వెండితెర ప్రవేశం చేసిన కృష్ణేశ్వరరావు మరో ఏడాదిలోనే ప్రచండ భారతం సినిమాకు మాటల రచయితగా పరిచయమయ్యారు. కాలచక్రం, భద్రాచలం, కామ్రేడ్, పిలిస్తే పలుకుతా, మౌనం, సూర్యపుత్రులు, కూతురుకోసం, వీరతెలంగాణ, భీముడు వంటి పది సినిమాలకు సంభాషణలు సమకూర్చారు. అంకురం, శ్రీరాములయ్య, ఢమరుకం సినిమాలకు స్క్రీన్‌ప్లే వర్క్ చేశారు. నటుడుగా తాను మాటలు రాసిన సినిమాలతో పాటు గోపిగోపికా గోదావరి, సరదాగా కాసేపు, భీమిలి కబడ్డీ జట్టు, ఎర్ర సముద్రం, కూతురుకోసం, వీరతెలంగాణ, వసుంధర నిలయం, వెన్నెల్లో హాయ్ హాయ్, డాక్టర్ ప్రసాద్ కేరాఫ్ సితార, వశం, చందమామ కథలు, గుంటూరు టాకీస్, ఇటీవలే విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాల్లో నటించారు. కృషే్ణశ్వరరావు రంగస్థల నటుడుగా ఎన్నో వ్యక్తిగత బహుమతులు పొందారు. వీటితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం (రచయితగా), ఉత్తమ రచయితగా రజత నంది, యువకళావాహిని బంగారు పతకం, సంపద నాటికకు భారతీయం–ఎన్టీఆర్ కళాపరిషత్ రూ.లక్ష నగదు బహుమతి గెలుసుకున్నారు. చెన్నైలోని ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ బంగారు పతకం అందుకున్నారు. సినిమాలకొస్తే, ‘కూతురుకోసం’ ఉత్తమ విలన్‌గా భరతముని అవార్డు, చందమామ కథలు సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా నంది అవార్డు స్వీకరించారు. తెనాలిలో ప్రఖ్యాత సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. రంగస్థలంపై సంచలనం 1986లో ‘రోజూ చస్తున్న మనిషి’ పేరుతో తొలి నాటిక రాశారు. అప్పట్నుంచి నటన, రచనతో రంగస్థలంతో అనుబంధం పెనవేసుకుంది. గొంగళిపురుగు, పక్కింట్లో పుట్టండి, సంపద, అధికారి, భూమికోసం, నష్టపరిహారం, కాళ్లు కడిగిన చేతులు, ప్రార్థన(రేడియో నాటిక), సారా సుద్దులు (వీధినాటిక) వంటి నాటికలను రాశారు. నాటికల పేర్లు మాత్రమే కాదు... ఇతివృత్తాలన్నీ విభిన్నంగా, సమాజాన్ని ప్రశ్నించేవిగా ఉండే రచనలు కావటం విశేషం. కొన్ని ఇతివృత్తాలకు నాటకరంగం ఉలిక్కిపడిన సందర్భాలున్నాయి. రచయితగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు, ఎన్నో చర్చలకు దారితీశాయి. నటనలోనూ తనదొక ప్రత్యేక స్కూలు. రంగస్థల రచయితగా, నటుడుగా, అటు సినీరంగంలోనూ సంభాషణల రచయితగా, నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. వీరి నాటికలు కొన్నింటిని గంగోత్రి, పెదకాకాని, ప్రజాకళామండలి, అభినయ, ఒంగోలు సమాజాలు ప్రదర్శించాయి. గొంగళిపురుగు, అధికారి, కాళ్లుకడిగిన చేతులు నాటికలను తన దర్శకత్వంలో ప్రదర్శిస్తూ నటించారు. ఐదోగది, అమృతం ఇంకా వుంది, గుర్తుతెలియని శవం నాటికల్లో నటిస్తూ దర్శకత్వం వహించారు. ఇవేకాకుండా శిష్ట్లా చంద్రశేఖర్ రచన గుండెచప్పుడు, గొల్లపూడి మారుతీరావు రాగరాగిణి నాటికలకు దర్శకత్వం వహించారు. ‘కాళ్లు కడిగిన చేతులు’ నాటికలో సినీనటులు, తెనాలికి చెందిన ఏవీఎస్, శివపార్వతి నటించారు. రాగరాగిణిలో జయప్రకాష్‌రెడ్డి, ‘గో టు హెల్’లో చాట్ల శ్రీరాములు దర్శకత్వంలో బుర్రా సుబ్రహ్మణ్య శా్రస్తితో కలిసి నటించారు. రచయిత, నటుడు, దర్శకుడిగా కృష్ణేశ్వరరావు ప్రదర్శించిన అన్ని ప్రదర్శనలు ప్రేక్షకాదరణ పొందాయి. సంపద నాటిక 170కు పైగా ప్రదర్శనలకు నోచుకుంది. శ్రీపాద సుబ్రహ్మణ్యం కథను రంగస్థలానువర్తనం చేసి ఒకే పాత్రగా ‘మార్గదర్శి’ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఆకాశవాణిలో బీ–హై కళాకారుడిగా పలు నాటికలు, నాటకాల్లో పాల్గొన్నారు.( గుంటూరులో మంగళవారం మృతిచెందిన ప్రముఖ రంగస్థల, సినీ నటుడు వైఎస్ కృషే్ణశ్వరరావుకు నివాళిగా....) -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు కృష్ణేశ్వర రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస కోశ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు(ఆగస్ట్ 11) గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణేశ్వర రావు పూర్తి పేరు ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణశ్వరరావు. పాఠశాల రోజుల నుంచే నాటకరంగంపై మక్కువ పెంచుకున్న కృష్ణశ్వరరావు, తన సుదీర్ఘ ప్రస్థానంలో 1,500కు పైగా నాటకాల్లో నటించారు. నాటకరంగంలో ఎన్నో ప్రయోగాలు చేసి, నంది అవార్డులు సైతం అందుకున్నారు. ‘ప్రచండ భారతం’తో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు ఆయనే కథను అందించాడు. శ్రీరాములయ్య, జయం మనదేరా చిత్రాలకు రచయితగా పనిచేశారు.రచయితగానే కాకుండా నటుడిగా కూడా కృష్ణేశ్వరరావు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. దర్శకుడు వంశీతో పరిచయం కావడం ఆయన సినీ ప్రయాణంలో మరో ముఖ్యమైన మలుపు. వంశీ దర్శకత్వంలో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను’, ‘గోపి గోపిక గోదావరి’ వంటి చిత్రాల్లో నటించారు. ‘వీర తెలంగాణ’, ‘సరదాగా కాసేపు’, ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘వశం’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘నాంది’, ‘విరూపాక్ష’ తదితర చిత్రాల్లోనూ కనిపించారు. ముఖ్యంగా 2014లో విడుదలైన ‘చందమామ కథలు’ సినిమాలో బిచ్చగాడి పాత్ర ఆయనకు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ పాత్రకు గాను ఆయన నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. చిన్న పాత్ర అయినా తన సహజమైన నటనతో ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేయడం ఆయన ప్రత్యేకత. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
అడుక్కోడానికి వేళాపాళా లేదా అన్నాడు
ఆహార్యాన్ని పూర్తిగా మార్చేసుకుని పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా సవాల్‌లా తీసుకుంటారు. ‘చందమామ కథలు’లో భిక్షగాడి పాత్ర చేసే అవకాశం వచ్చినప్పుడు కృష్ణేశ్వరరావు అలానే ఫీలయ్యారు. దాదాపు 1500 నాటక ప్రదర్శనలు, పలు నాటకాలకు కథ, మాటలు, భద్రాచలం, శ్రీరాములయ్య, జయం మనదేరా లాంటి చిత్రాలకు రచన, గోపి గోపిక గోదావరి, సరదాగా కాసేపు తదితర చిత్రాల్లో నటన... సింపుల్‌గా ఇది కృష్ణేశ్వరరావు ట్రాక్ రికార్డ్. ‘చందమామ కథలు’లో చేసిన భిక్షగాడి పాత్ర ఆయన కెరీర్‌కు మంచి మలుపు అయ్యిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆదివారం పత్రికలవారితో తన ఆనందాన్ని కృష్ణేశ్వరరావు ఈ విధంగా పంచుకున్నారు... నటనంటే ఇష్టం. అందుకే నాటక రంగంలోకి అడుగుపెట్టాను. పరిషత్తుల్లో పాల్గొన్నాను. అమ్మ నేపథ్యంలో సాగే ‘సంపద’ అనే నాటకాన్ని 150 సార్లు ప్రదర్శిస్తే అన్నిసార్లూ అపూర్వ స్పందన లభించింది. నటుడు జీవా నాకు మంచి మిత్రుడు. వంశీగారి దర్శకత్వంలో ఆయన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో నటిస్తున్నప్పుడు, ఆ షూటింగ్‌కి వెళ్లేవాణ్ణి. తన ద్వారానే నాకు వంశీగారితో పరిచయమైంది. ‘నీలో మంచి నటుడు కనిపిస్తున్నాడు’ అని వంశీగారు ‘గోపి గోపిక గోదావరి’లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. విడుదలకు సిద్ధమైన ‘తను మొన్నే వెళ్లిపోయింది’లో కూడా నాది మంచి పాత్ర. సూపర్‌స్టార్ కృష్ణ మెచ్చుకున్నారు ఇక, ‘చందమామ కథలు’లో చేసిన భిక్షగాడి పాత్ర నా కెరీర్‌కి మంచి మలుపయ్యిందనే చెప్పాలి. ఆ సినిమా చూసి, ఇద్దరు పెద్ద నిర్మాతలు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నేను అడుక్కునే సన్నివేశాలను హైదరాబాద్‌లోని జూబ్లి హిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర తీశారు. షూటింగ్ అని చెప్పకుండా నిజంగా అడుక్కుంటున్నవాళ్లతో కలిసిపోయి, నేనూ అందరి దగ్గరి చెయ్యి చాపేవాణ్ణి. ‘మా ఏరియాకొచ్చావేంటి’? అంటూ అక్కడ భిక్షాటన చేస్తున్నవాళ్లు గుర్రుగా చూసేవాళ్లు. అలాగే ట్రైన్ ఎక్కే సన్నివేశం గురించి చెప్పాలి. నేను ట్రైన్ ఎక్కుతుంటే, ‘అడుక్కోడానికి వేళాపాళా లేదా’ అంటూ అక్కడున్న పోలీస్ తిట్టాడు. కంపార్ట్మెంట్లో కింద కూర్చుని అడుక్కుంటుంటే ఒకడైతే కర్రతో కొట్టినంత పని చేశాడు. షూటింగ్ అనడంతో ఆగాడు. అవన్నీ నాకు మంచి అనుభూతులు. కృష్ణగారు, విజయనిర్మలగారు సినిమా చూసి ‘బాగా చేశావు’ అని అభినందించారు. వంశీగారి సినిమాల్లో కామెడీ టచ్ ఉన్న కేరక్టర్లు, ఎన్. శంకర్‌గారి సినిమాల్లో కొంచెం సీరియస్‌గా ఉండే పాత్రలు చేసిన నాకు ఈ భిక్షగాడి పాత్ర నాలో పూర్తి స్థాయి కేరక్టర్ నటుడున్నాడని నిరూపించింది. నా నాటక, సినీరంగ ప్రయాణంలో వెన్నుదన్నుగా నిలిచి, ప్రోత్సహిస్తున్న నా మిత్రుడు తాడిశెట్టి వెంకట్రావుగారికి కృతజ్ఞతలు.


