రంగస్థలం, వెండితెర ఆయనకు రెండు కళ్లు | From Actor To Dialogue Writer, YS Krishneswara Rao’s Remarkable Film Journey, Leaves Behind A Rich Legacy | Sakshi
Sakshi News home page

రంగస్థలం, వెండితెర ఆయనకు రెండు కళ్లు

Aug 12 2026 2:20 PM | Updated on Aug 12 2026 3:05 PM

Krishneswara Rao Film Journey

సాక్షి, గుంటూరు(తెనాలి/ నగరంపాలెం): రంగస్థలం లేదా వెండితెర మాధ్యమం ఏదైనా నటన, రచన రెండు కళ్లుగా సుదీర్ఘకాలంగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన కృష్ణే​శ్వరరావు. పూర్తిపేరు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు, బాపట్ల జిల్లా అమృతలూరు మండలం బోడపాడు. 1955 ఆగస్టు 4న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటరమణమ్మ, యల్లాప్రగడ హనుమంతరావు. 1969లో పదోతరగతి వార్షికోత్సవంలో ‘వాపస్‌’ నాటికతో రంగస్థల అరంగేట్రం చేసిన కృషే్ణశ్వరరావుకు అదే జీవితమైంది. 

వెండితెర ప్రస్థానం 1987లో ‘ఊరేగింపు’ సినిమాతో నటుడిగా వెండితెర ప్రవేశం చేసిన కృష్ణేశ్వరరావు మరో ఏడాదిలోనే ప్రచండ భారతం సినిమాకు మాటల రచయితగా పరిచయమయ్యారు. కాలచక్రం, భద్రాచలం, కామ్రేడ్, పిలిస్తే పలుకుతా, మౌనం, సూర్యపుత్రులు, కూతురుకోసం, వీరతెలంగాణ, భీముడు వంటి పది సినిమాలకు సంభాషణలు సమకూర్చారు. అంకురం, శ్రీరాములయ్య, ఢమరుకం సినిమాలకు స్క్రీన్‌ప్లే వర్క్‌ చేశారు. 

నటుడుగా తాను మాటలు రాసిన సినిమాలతో పాటు గోపిగోపికా గోదావరి, సరదాగా కాసేపు, భీమిలి కబడ్డీ జట్టు, ఎర్ర సముద్రం, కూతురుకోసం, వీరతెలంగాణ, వసుంధర నిలయం, వెన్నెల్లో హాయ్‌ హాయ్, డాక్టర్‌ ప్రసాద్‌ కేరాఫ్‌ సితార, వశం, చందమామ కథలు, గుంటూరు టాకీస్, ఇటీవలే విడుదలైన ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ సినిమాల్లో నటించారు. కృషే్ణశ్వరరావు రంగస్థల నటుడుగా ఎన్నో వ్యక్తిగత బహుమతులు పొందారు. వీటితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం (రచయితగా), ఉత్తమ రచయితగా రజత నంది, యువకళావాహిని బంగారు పతకం, సంపద నాటికకు భారతీయం–ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ రూ.లక్ష నగదు బహుమతి గెలుసుకున్నారు. చెన్నైలోని ఆంధ్రా సోషల్, కల్చరల్‌ అసోసియేషన్‌ బంగారు పతకం అందుకున్నారు. సినిమాలకొస్తే, ‘కూతురుకోసం’ ఉత్తమ విలన్‌గా భరతముని అవార్డు, చందమామ కథలు సినిమాలో ఉత్తమ క్యారెక్టర్‌ నటుడుగా నంది అవార్డు స్వీకరించారు. తెనాలిలో ప్రఖ్యాత సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. 

రంగస్థలంపై సంచలనం 1986లో ‘రోజూ చస్తున్న మనిషి’ పేరుతో తొలి నాటిక రాశారు. అప్పట్నుంచి నటన, రచనతో రంగస్థలంతో అనుబంధం పెనవేసుకుంది. గొంగళిపురుగు, పక్కింట్లో పుట్టండి, సంపద, అధికారి, భూమికోసం, నష్టపరిహారం, కాళ్లు కడిగిన చేతులు, ప్రార్థన(రేడియో నాటిక), సారా సుద్దులు (వీధినాటిక) వంటి నాటికలను రాశారు. నాటికల పేర్లు మాత్రమే కాదు... ఇతివృత్తాలన్నీ విభిన్నంగా, సమాజాన్ని ప్రశ్నించేవిగా ఉండే రచనలు కావటం విశేషం. కొన్ని ఇతివృత్తాలకు నాటకరంగం ఉలిక్కిపడిన సందర్భాలున్నాయి. రచయితగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు, ఎన్నో చర్చలకు దారితీశాయి. నటనలోనూ తనదొక ప్రత్యేక స్కూలు. రంగస్థల రచయితగా, నటుడుగా, అటు సినీరంగంలోనూ సంభాషణల రచయితగా, నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. వీరి నాటికలు కొన్నింటిని గంగోత్రి, పెదకాకాని, ప్రజాకళామండలి, అభినయ, ఒంగోలు సమాజాలు ప్రదర్శించాయి. 

గొంగళిపురుగు, అధికారి, కాళ్లుకడిగిన చేతులు నాటికలను తన దర్శకత్వంలో ప్రదర్శిస్తూ నటించారు. ఐదోగది, అమృతం ఇంకా వుంది, గుర్తుతెలియని శవం నాటికల్లో నటిస్తూ దర్శకత్వం వహించారు. ఇవేకాకుండా శిష్ట్లా చంద్రశేఖర్‌ రచన గుండెచప్పుడు, గొల్లపూడి మారుతీరావు రాగరాగిణి నాటికలకు దర్శకత్వం వహించారు. ‘కాళ్లు కడిగిన చేతులు’ నాటికలో సినీనటులు, తెనాలికి చెందిన ఏవీఎస్, శివపార్వతి నటించారు. రాగరాగిణిలో జయప్రకాష్‌రెడ్డి, ‘గో టు హెల్‌’లో చాట్ల శ్రీరాములు దర్శకత్వంలో బుర్రా సుబ్రహ్మణ్య శా్రస్తితో కలిసి నటించారు. రచయిత, నటుడు, దర్శకుడిగా కృష్ణేశ్వరరావు ప్రదర్శించిన అన్ని ప్రదర్శనలు ప్రేక్షకాదరణ పొందాయి. సంపద నాటిక 170కు పైగా ప్రదర్శనలకు నోచుకుంది. శ్రీపాద సుబ్రహ్మణ్యం కథను రంగస్థలానువర్తనం చేసి ఒకే పాత్రగా ‘మార్గదర్శి’ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఆకాశవాణిలో బీ–హై కళాకారుడిగా పలు నాటికలు, నాటకాల్లో పాల్గొన్నారు.
( గుంటూరులో మంగళవారం మృతిచెందిన ప్రముఖ రంగస్థల, సినీ నటుడు వైఎస్‌ కృషే్ణశ్వరరావుకు నివాళిగా....)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement