
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో హీరో సాయి కుమార్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయ్. హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపిస్తే అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు దక్కే మజానే వేరు. ఖాకీ డ్రెస్‌లో లాఠీ, తు పాకీ చేతబట్టి ఆన్ డ్యూటీలో భాగంగా పవర్‌ఫుల్ డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ సందడి చేస్తుంటారు.
పైగా పోలీస్ బ్యాక్‌డ్రాప్ అన్నది ఎవర్ గ్రీన్ ఫార్ములా. కథ, పాత్రలో దమ్ముంటే చాలు పోలీస్ సినిమాలు హిట్టయిపోతాయ్. ఇప్పటికే పోలీస్ కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల్లో ‘ఆన్ డ్యూటీ’ అంటూ పోలీస్‌గా విజృంభిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.
ముత్తువేల్ పాండియన్
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ (2023) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్‌లోనే ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ముత్తువేల్ పాండియన్ సత్తా ఏ రేంజ్‌లో ఉంటుందన్నది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అయితే ‘జైలర్ 2’లో విద్యాబాలన్ నటించనున్నారని టాక్. అయితే ఆమె పాత్ర ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది.
కెరీర్‌లో తొలిసారి...
వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ‘ఈశ్వర్’ (2002) సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారాయన. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో, ఈ జనరేషన్ హీరోల్లో ఖాకీ డ్రెస్ వేయని ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఆయన్ని ఖాకీ డ్రెస్‌లో, పవర్‌ఫుల్ పాత్రలో చూడాలని ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ‘స్పిరిట్’ సినిమాతో ఫుల్‌స్టాప్ పడింది. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పిరిట్’.
ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఖాకీ డ్రెస్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ‘స్పిరిట్’లో పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఏ రేంజ్‌లో విజృంభిస్తారో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి.
పోలీస్ జాతర
పోలీస్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో రవితేజ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘వెంకీ’ (2004)లో మొదటిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించినప్పటికీ ఆ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించరు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’ (2006) సినిమాలో విక్రమ్ రాథోడ్‌గా పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘ఖతర్నాక్, మిరపకాయ్, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్’ వంటి సినిమాల్లో పోలీసాఫీసర్‌గా తనదైన మేనరిజమ్‌తో ప్రేక్షకులను అలరించారు రవితేజ.
చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలోనూ ఏసీపీ విక్రమ్ సాగర్‌గా కనిపించారు. తాజాగా రవితేజ పోలీస్ ఆఫీర్‌గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్‌టైనర్‌గా ‘మాస్ జాతర’ రూపొందుతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా మే 9న విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించలేదు మేకర్స్.
ఉస్తాద్ భగత్ సింగ్‌లో...
పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్ పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో మరోసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించారు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. కాగా తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో మరోసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పవన్ కల్యాణ్‌తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
డబుల్ ధమాకా
హీరో కార్తీ పోలీసాఫీసర్‌గా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘సర్దార్’ (2022) చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా కార్తీ–పీఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే ‘సర్దార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. ఆషికా రంగనాథ్, మాళవికా మోహనన్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సినిమాలో కార్తీ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు. తండ్రి ఖైదీ పాత్రలో కనిపించనుండగా ఆయన కొడుకు పాత్ర పవర్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుందట.
హిట్ 4లో.... తెలుగులో ‘హిట్’ సిరీస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సిరీస్‌లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (విశ్వక్ సేన్), ‘హిట్: ది సెకండ్ కేస్’ (అడివి శేష్), ‘హిట్: ది థర్డ్ కేస్’ (నాని) సినిమాలు విజయం సాధించాయి. ఈ సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రం ‘హిట్ 4’. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించనున్నారు. ఏసీపీ వీరప్పన్‌గా కార్తీ నటించనున్నట్లు ‘హిట్: ది థర్డ్ కేస్’ క్లైమాక్స్‌లో చూపించారు మేకర్స్.
స్పై పోలీస్ ఆఫీసర్
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారట విజయ్.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటిæవరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్‌డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్‌డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్‌డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.
రెండోసారి...
హీరో విశ్వక్ సేన్ రెండోసారి పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ అధికారిగా నటించారు విశ్వక్. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విశ్వక్ సేన్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
కాగా మరోసారి ఆయన ఖాకీ దుస్తులు ధరించారు. శ్రీధర్ గంగా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీఎస్ 13’ (వర్కింగ్ టైటిల్). ఎస్‌ఎల్‌వీసీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో చూస్తుంటే విశ్వక్ మరోసారి పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారని స్పష్టం అవుతోంది. విశ్వక్ ఫేస్ కనిపించకుండా పాకెట్‌లో తు పాకీతో అటువైపు తిరిగి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రతి యాక్షన్‌కి అదిరిపోయే రియాక్షన్ ఉంటుంది’ అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ‘బందూక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.
రక్షక్!
నటనకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన ఓ హీరోగా నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదలైంది. ఈ చిత్రంలో గజపతి వర్మ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు మనోజ్. అదే విధంగా తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర చేస్తున్నారు మనోజ్. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షక్’. ఈ చిత్రం ద్వారా నవీన్ కొల్లి దర్శకునిగా పరిచయమవుతున్నారు.
శ్రీనిధీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు మంచు మనోజ్. మే 20న ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లోని మనోజ్ శక్తిమంతమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. కొందరు తాము చేసిన నేరాన్ని బయటకు రాకుండా దాచి పెట్టడానికి ప్రయత్నిస్తే హీరో ఎలా వెలికి తీశాడు? అన్నది కథలో ఆసక్తిగా ఉంటుం దట. అంతేకాదు... ప్రస్తుతం సమాజంలో మహిళల మీద జరుగుతున్న వేధింపులను కూడా ఇందులో ప్రస్తావించారని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది.
తండ్రి బాటలో...
పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు సాయికుమార్. ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో ఆయన నటన, డైలాగులను ఎప్పటికీ మరచిపోలేరు ప్రేక్షకులు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పోలీసాఫీసర్‌గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు సాయికుమార్. తాజాగా ఆయన తనయుడు ఆది సాయికుమార్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘ఎస్‌ఐ యుగంధర్’. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు రాకేందు మౌళి విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్‌పై ప్రదీప్ జూలూరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వైవిధ్యమైన కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ పాత్రలో ఆది నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్