రీసెంట్ టైంలో తెలుగులో వచ్చిన సలార్, లక్కీ భాస్కర్, పెద్ది సినిమాల్లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు-దర్శకుడు టిన్ను ఆనంద్.. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొన్నిరోజుల క్రితం ఈయనకు తీవ్ర గాయాలు కాగా ఐదు పక్కటెముకులు విరిగిపోయినట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి, ఊపిరితిత్తులకు గుచ్చుకోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో తాజాగా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అమ్మ వచ్చింది.. హౌస్ ఎమోషనల్ అయింది)
ప్రస్తుతం టిన్ను ఆనంద్ ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారు. వైద్యులు ఆయనకు కఠినమైన బెడ్ రెస్ట్ సూచించారు. ఇంటి వద్దే ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నారు. కూర్చున్నా, పడుకున్నా, శరీరాన్ని ఒక వైపు నుంచి మరోవైపుకు తిప్పుకున్నా ఇంకా నొప్పి వేధిస్తోందట. మంచం పైనుంచి లేవడానికి, కూర్చోవడానికి, పక్కకు తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడేటప్పుడు కూడా అసౌకర్యంగా ఉంటోందని తెలుస్తోంది. అయితే టిన్నుకు ఈ గాయాలు ఎలా అయ్యాయనేది ఇంకా క్లారిటీ రాలేదు.
మరోవైపు పెండింగ్‌లో ఉన్న డబ్బింగ్ పనులు పూర్తి చేయాలని కొందరు నిర్మాతలు ఆయనను సంప్రదించారట. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఇలా ఉండటంతో చేస్తున్న సినిమాల పరిస్థితి ఏంటనేది తెలియట్లేదు. టిన్ను ఆనంద్ అసలు పేరు వీరేంద్ర రాజ్ ఆనంద్. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రేతో ఐదేళ్లు పనిచేసిన తర్వాత దర్శకుడిగా మారారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి చేసిన 'కాలియా', 'షహెన్‌షా', 'మై ఆజాద్ హూన్', 'మేజర్ సాబ్' మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రీసెంట్ టైంలోనే కాదు గతంలో తెలుగులో ఆదిత్య 369, ఘటోత్కచుడు, అంజి తదితర మూవీస్ చేశారు. గత కొన్నేళ్లలో అయితే సాహో, సీతారామం, సలార్, లక్కీ భాస్కర్, పెద్ది చిత్రాల్లో కనిపించారు.
(ఇదీ చదవండి: మౌళి 'డీఎన్‌కే' (దొంగ నా కొడుకు) రివ్యూ)


