వివాదాల తర్వాత జానీ డెప్‌ రీఎంట్రీ.. మళ్లీ హాలీవుడ్‌ను ఏలుతారా? | Johnny Depp Hollywood Comeback Ebenezer | Sakshi
Sakshi News home page

వివాదాల తర్వాత జానీ డెప్‌ రీఎంట్రీ.. మళ్లీ హాలీవుడ్‌ను ఏలుతారా?

Nov 13 2026 11:31 AM | Updated on Nov 13 2026 11:36 AM

Johnny Depp Hollywood Comeback Ebenezer

ఒకప్పుడు హాలీవుడ్‌లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్‌ నటుడు జానీ డెప్‌.. ఇప్పుడు మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మాజీ భార్య అంబర్‌ హెర్డ్‌తో వివాదాలు, కోర్టు కేసుల కారణంగా కొన్నేళ్లుగా ఆయన కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో సినిమాలకు కూడా దూరమయ్యారు. ఇప్పుడు 'ఎబెనెజర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమా ఆయనకు పాత గుర్తింపును తీసుకొస్తుందా? హాలీవుడ్‌లో మళ్లీ తన హవా చూపిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

2020లో బ్రిటన్‌ పత్రిక 'ది సన్‌'పై జానీ డెప్‌ వేసిన పరువునష్టం కేసులో లండన్‌ హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో 'ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌' సినిమా నుంచి వార్నర్‌ బ్రదర్స్‌ ఆయనను తప్పించింది. ఆ తర్వాత 2022లో మాజీ భార్య అంబర్‌ హెర్డ్‌పై అమెరికాలో వేసిన పరువునష్టం కేసులో డెప్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ అప్పటికే ఆయన సినీ కెరీర్‌పై ఈ వివాదాల ప్రభావం పడింది.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇప్పుడు 'ఎబెనెజర్‌'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చార్లెస్‌ డికెన్స్‌ రాసిన 'ఏ క్రిస్మస్‌ కరోల్‌' కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో డెప్‌ స్క్రూజ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన మేకప్‌తో పూర్తిగా కొత్త రూపంలో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఈ సినిమాలో సర్‌ ఇయాన్‌ మెక్‌కెల్లెన్‌, రూపర్ట్‌ గ్రింట్‌, డైసీ రిడ్లీ వంటి ప్రముఖ నటులు కూడా భాగమయ్యారు. డెప్‌ నటన, ఆయనకున్న అభిమానుల ఆదరణ సినిమాకు కలిసొస్తాయని భావిస్తున్నారు. అయితే సినిమా ప్రచారంలో ఆయన రీఎంట్రీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడిని మళ్లీ తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా వసూళ్లపైనా అంచనాలు పెరుగుతున్నాయి. టెస్ట్‌ స్క్రీనింగ్‌లో డెప్‌ నటనకు 100కి 86 మార్కులు వచ్చినట్లు సమాచారం. అమెరికాలో తొలి వారాంతంలో 22 మిలియన్‌ డాలర్లు, మొత్తం మీద 100 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేయవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, డెప్‌కు మంచి గుర్తింపు తెచ్చిన 'పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌' సినిమాలకు మరో భాగం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అందులో డెప్‌ తిరిగి నటించే అవకాశాలపైనా చర్చ సాగుతోంది. నిర్మాత జెర్రీ బ్రూక్‌హైమర్‌ ఈ విషయంపై ఆసక్తి చూపినట్లు సమాచారం. పెనెలోప్‌ క్రజ్‌తో కలిసి నటించిన 'డే డ్రింకర్‌' సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతో డెప్‌ కెరీర్‌లో మళ్లీ కొత్త అవకాశాలు వస్తాయనే ఆశలు నెలకొన్నాయి. మరి 'ఎబెనెజర్‌'తో ఆయన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారు? హాలీవుడ్‌లో పూర్వ వైభవాన్ని తిరిగి సాధిస్తారా? అన్నది వేచి చూడాల్సిందేనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: Bigg Boss 10 Day 67: త్రిగుణ్‌ని తెగ పొగిడేసిన దేబ్జానీ పేరెంట్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement