తమిళ నిర్మాతలు ఎట్టకేలకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లపాటు సినిమాపై లాభమొచ్చినా నష్టమొచ్చినా దాన్ని నిర్మాత మాత్రమే భరించేవాడు. కానీ ఇకపై అలా కుదరదని, స్టార్ హీరోలందరూ పూర్తి రెమ్యునరేషన్ తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. బదులుగా నిర్మాతతో పాటు లాభనష్టాల్ని భరించాల్సి ఉంటుందని ఓ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో తమిళ నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమిళ నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం.. ఓ రకంగా స్టార్ హీరోలైన రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్, సూర్య లాంటి వాళ్లకు నిజంగానే షాకింగ్. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూర్తి పారితోషికం తీసుకునేవారు. లాభాలు వస్తే నిర్మాత ఇష్టం కొద్దీ కారు లాంటి బహమతులు ఇచ్చేవారు. అదే నష్టమొస్తే మాత్రం హీరోలు, నిర్మాతల్ని అస్సలు పట్టించుకోని సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ఓ రకంగా నిర్మాతలకు మంచిదే. కానీ హీరోలు దీనికి ఒప్పుకొంటారా అనేది చూడాలి. ఇలాంటిది తెలుగులో ఇండస్ట్రీలోనూ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్)
ఇదే సమావేశంలో ఓటీటీ డీల్స్ గురించి నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకుంది. స్టార్ హీరోల సినిమాలు కచ్చితంగా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. మిడ్ రేంజ్ హీరోలైతే 6 వారాలు, చిన్న బడ్జెట్ చిత్రాలతే 4 వారాల రూల్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది తమిళంలో రిలీజయ్యే 250 చిత్రాలకు థియేటర్ల కేటాయింపు కోసం ప్రత్యేక పద్ధతి తీసుకురానున్నట్లు తెలిపారు.
తమిళ నటీనటులు అందరూ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల కంటే థియేటర్లలోకి వచ్చే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా నిర్మాతల మండలి కోరింది. ఇండస్ట్రీ బాగు కోసమే ఇలా చేయాలని పేర్కొంది. అయితే నిర్మాతల మండలి తీసుకున్న ప్రపోజల్స్ బాగానే ఉన్నాయి గానీ ఇవన్నీ ఇండస్ట్రీలో ఎంతవరకు అమల్లోకి వస్తాయనేది చూడాలి?
(ఇదీ చదవండి: Bigg Boss 9 : నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి)


