సినిమా సెలబ్రిటీలకు కొన్ని విషయాల్లో విపరీతమైన ఇష్టముంటుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి ఇలానే లగ్జరీ కార్లు అంటే పిచ్చి. ఎంతలా అంటే అన్ని బ్రాండ్స్ కార్స్ ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి. అయినాసరే ఇప్పుడు మరో కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఓవైపు లగ్జరీ కార్ల కొనుగోలు విషయమై కస్టమ్స్ వివాదంలో కొన్నాళ్ల క్రితమే చిక్కుకున్నాడు. ఇలాంటి టైంలో దుల్కర్ కొత్త కారు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.
అక్రమంగా విదేశాల నుంచి వాహనాలని దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలతో కస్టమ్స్ అధికారులు.. కొన్నిరోజుల క్రితం కేరళలో సోదాలు చేపట్టారు. సినిమా హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరుల ఇళ్లలో రైడ్ చేసి 40కి పైగా కార్లని సీజ్ చేశారు. తన కార్లని కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడంపై దుల్కర్.. కేరళ హైకోర్టుని ఆశ్రయించగా ఊరట దక్కింది. కొన్ని షరుతులు, కార్ల విలువలో 20 శాతాన్ని బ్యాంక్ గ్యారంటీగా ఇవ్వడంతో కార్లని తిరిగి దుల్కర్‌కి ఇచ్చేశారు.
(ఇదీ చదవండి: 'జటాధర' సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా)
సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే తాజాగా దుల్కర్ సల్మాన్.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కంపెనీకి చెందిన 100 ఆక్టా ఎడిషన్ కారుని కొనుగోలు చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లగ్జరీ కారు ధర రూ.3 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. 4.4 లీటర్ల ట్విన్ టర్బో ఇంజిన్ కలిగిన ఈ కారు.. నాలుగు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఈ కారు కాకుండా దుల్కర్ దగ్గర మెర్సిడెస్ బెంజ్, పోర్షే, ఫెరారీ, వోల్వో లాంటి టాప్ క్లాస్ ఖరీదైన కార్లలోని మోడల్స్ అన్నీ ఉన్నాయి. 80,90లా వింటేజ్ కార్లని కూడా కొనుగోలు చేసి దుల్కర్.. తన కలెక్షన్‌లో పెట్టుకోవడం విశేషం. దుల్కర్ సినిమాల విషయానికొస్తే గతేడాది 'లక్కీ భాస్కర్'తో హిట్ కొట్టిన దుల్కర్.. ఈ మధ్యే నిర్మాతగా 'లోక' మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇతడు హీరోగా నటించి నిర్మించిన 'కాంత'.. ఈ శుక్రవారం(నవంబరు 14) థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: 'గర్ల్‌ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?)


