
దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎమ్‌బి29(SSMB29) సినిమా ఇప్పుడు మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సినీ వర్గాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని విక్రయించారంటూ వస్తున్న వార్తలు కూడా సంచలనంగా మారాయి. దీనికి కారణం చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ సినిమా ఓటీటీ హక్కుల ధర పలకడమే.
ఇప్పటి దాకా ఓటీటీలో అత్యధిక ధర పలికిన చిత్రంగా రాజమౌళి, రామ్‌చరణ్,ఎన్టీయార్‌ల సినిమా ఆర్‌ఆర్‌ఆర్ నిలుస్తోంది. ఆ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్‌ల పుష్ప 2, లోకేష్ కనగరాజ్ హీరో విజయ్‌ల తమిళ చిత్రం లియో, అట్లీ, షారూఖ్‌ఖాన్‌ల హిందీ చిత్రం జవాన్, ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ల సలార్, ఓంరౌత్, ప్రభాస్‌ల ఆదిపురుష్, సిద్ధార్ధ్ ఆనంద్, షారూఖ్ ల పఠాన్ చిత్రాలు నిలుస్తున్నాయి ఇవన్నీ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య చెల్లించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు స్వంతం చేసుకున్నట్టు సమాచారం. వీటిలో ఆదిపురుష్, పఠాన్, పుష్ప2 తప్ప మిగిలినవన్నీ నెట్‌ఫ్లిక్స్ ఖాతాలోనే పడ్డాయి. తద్వారా భారతీయ సినిమాలకు అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడంలో ఎవరికీ అందనంత స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ దూసుకుపోతోంది.
అదే క్రమంలో మరోసారి తన సత్తా చాటిన నెట్‌ఫ్లిక్స్ ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29 హక్కుల్ని కూడా దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మరే చిత్రానికి పెట్టనంత ధరను చెల్లించి ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తద్వారా ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద నాన్–థియేట్రికల్ డీల్స్‌గా నిలుస్తోందని సమాచారం.
రాజమౌళి మునుపటి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ సైతం నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆ సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ ప్రారంభంలోనే అద్భుతమైన వీక్షక విజయం అందుకుంది, అంతేకాక ఆ సినిమా పాట ఆస్కార్ అందుకోవడంతో నెట్‌ఫ్లిక్స్‌కు మరోసారి కాసుల పంట పండింది. ఆ అవార్డ్ ద్వారా వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ఓటీటీలో ఆ సినిమాకు వీక్షకులు వెల్లువెత్తారు. దాందో ఆర్‌ఆర్‌ఆర్‌కి భారీ ధర చెల్లించినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ భారీ లాభాలను ఆర్జించడానికి ఇదో కారణం.
ఈ నేపధ్యంలో రాజమౌళి చిత్రాలపై గురి కుదిరిన నెట్‌ఫ్లిక్స్ చాలా ముందస్తుగానే ఓటీటీ హక్కులపై కన్నేసింది. అపజయాలు అంతే తెలియని దర్శకుడు రూపొందిస్తున్న ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29 చిత్రంలో ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ స్టార్ ఉండడం అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అంశమే. అందుకే ఈ చిత్రం అత్యంత భారీ ధర పలికింది అనుకోవచ్చు. వచ్చే 2027లో విడుదల కానున్న ఈ భారీ చిత్రం ఇంకెన్నో సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.