నడిగర్ తిలకం అని కొనియాడబడిన నటుడు శివాజీ గణేషన్. ఆయన నట వారసుడిగా ప్రభు తొలుత సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం ప్రభు వారసుడిగా విక్రమ్ ప్రభు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా శివాజీ గణేషన్ కుటుంబం నుంచి మరో వర్ధమాన నటుడు తెరంగేట్రం చేశారు. శివాజీ గణేషన్ మనవడు అయిన దర్శన్ గణేశన్ తొలిసారిగా లెనిన్ పాండియన్ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నటుడు దర్శన్ గణేశన్ పేర్కొంటూ ‘‘లెనిన్ పాండియన్ చిత్రంలో నేను పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తున్నాను. ఇది నాకు చాలా ముఖ్యమైన చిత్రం. ఈ చిత్రం ద్వారా నేనేమిటో నిరూపించుకోవాలి. అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నాను. మహా నటుడు శివాజీ గణేషన్ మనవడు అనే బ్రాండ్ ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నేనెప్పుడూ మరచిపోను. అయితే ఆ గుర్తింపు తోనే ఉండదలచుకోలేదు.
మా తాత పేరును మోయడం కంటే ఆయన గౌరవాన్ని కాపాడే విధంగా నా కంటూ సొంత పేరును సంపాదించుకోవాలి. ఐదే నా లక్ష్యం. తాత మొదట్లో రంగస్థలంపై రాణించారు.ఆయన వీధి భాగవతుల కళలో శిక్షణ పొందారు.అదే విధంగా నేను ఆ కళలో శిక్షణ పొందాను. ఇకపోతే లెనిన్ పాండియన్ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. నేను నగరంలో పుట్టి పెరిగాను. దీంతో గ్రామీణ ప్రాంత యువకుడిగా నటించడం ఒక చాలెంజే.
అందువల్ల ఇది మానామదురై లో సాగే కథ కావడంతో నేను ఆ గ్రామానికి వెళ్లి ఒక నెల రోజుల పాటు ఉండి ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని, వారి ప్రవర్తనను తెలుసుకున్నాను. అక్కడ వ్యవసాయదారులతో గడిపాను. వారి గురించి చాలా చదివాను.అదే విధంగా ఒక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ రెండు రోజులు ఉన్నాను. నేను చేసే పనిలో నూరు శాతం శ్రమిస్తే ఈ కుర్రాడు పలానా కుటుంబానికి చెందిన వాడు అనే కాకుండా తన పని సక్రమంగా చేస్తున్నాడు అని ఆదరిస్తారు ‘‘ అని నటుడు దర్శన్ గణేశన్ వివరించారు.


