స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే దేశమంతా త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతుంది. మరోవైపు దేశభక్తి గీతాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని పాటలు తరతరాలుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ, దేశం పట్ల ప్రేమను పెంచుతూ వచ్చిన అలాంటి కొన్ని సినీ గీతాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
'తెలుగు వీర లేవరా' - అల్లూరి సీతారామరాజు
సూపర్‌స్టార్ కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలోని ఈ పాట దేశభక్తి గీతాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఘంటసాల ఆలపించిన ఈ గీతం నేటికీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తప్పకుండా వినిపిస్తుంది.
'పుణ్యభూమి నా దేశం' - మేజర్ చంద్రకాంత్
సీనియర్ ఎన్టీఆర్ చివరి చిత్రంగా గుర్తింపు పొందిన 'మేజర్ చంద్రకాంత్' సినిమాలోని ఈ పాట తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జాలాది రాజారావు సాహిత్యం అందించిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికీ జాతీయ పండుగల సందర్భంగా మారుమోగుతూనే ఉంటుంది.
'సైనికా' - నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలోని 'సైనికా' పాట భారత సైనికుల త్యాగాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని జవాన్ల జీవితాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ పాటను విశాల్ దడ్లానీ ఆలపించగా, విశాల్-శేఖర్ సంగీతం అందించారు. రామ్‌జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని రాశారు.
'దేశమంటే' - ఝుమ్మంది నాదం
మంచు మనోజ్ హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' చిత్రంలోని ఈ పాట దేశం పట్ల ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ పాటను ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, చిన్ని చరణ్, విజయ్ యేసుదాస్ ఆలపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చారు.
'వందేమాతరం'- మహాత్మా
శ్రీకాంత్ హీరోగా నటించిన 'మహాత్మా' చిత్రంలోని 'వందేమాతరం' పాట దేశభక్తిని ఆధునిక కోణంలో ఆవిష్కరించింది. ఈ పాటను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. విజయ్ ఆంటోనీ సంగీతం అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని రాశారు.
'ఓ బాపూ నువ్వే రావాలి' - శంకర్ దాదా జిందాబాద్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంలోని ఈ పాటలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గుర్తు చేశారు. ఈ పాటను సాగర్, దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని రాశారు.
'వందే మాతరం' - లీడర్
రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన 'లీడర్' చిత్రంలోని ఈ పాట యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశం అంటే కేవలం నేల మాత్రమే కాదని, ప్రజలే దేశమనే సందేశాన్ని ఈ పాట బలంగా వినిపించింది.


