'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Agadha Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Aug 14 2026 6:34 AM | Updated on Aug 14 2026 8:16 AM

Agadha Movie Review And Rating In Telugu

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం. 

కథ ఏంటంటే..
మహిమ (ఉల్కా గుప్తా) ఒకానొక సందర్భంలో తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఓ గుహను చూస్తుంది. ఆ గుహ వద్ద ఓ వింత ఘటన జరుగుతుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు బబ్లూ మరణిస్తాడు. ఆమె ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి) మాత్రం కనిపించడు. ఇంకో వైపు మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఊర్లోని ప్రజల సమస్యలను తీరుస్తూ ఉంటుంది. ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. ఇక కొన్ని రోజులకు మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. తన సోదరి మహిమ మరణంతో మహాదేవి సొంత ఊరికి వస్తుంది. తన ఇంటికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉందని మహాదేవి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో సింహా నుంచి మహాదేవి తెలుసుకున్న అంశాలు ఏంటి? ఈ షికావో గుహ వద్ద ఏం జరిగింది? అసలు ఈ అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్ని ఈ అగధ ఎందుకు చంపుతోంది? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? ఈ కథలో హరిణి (జోవికా విజయ్ కుమార్) పాత్ర, బాబా (షిజు) కారెక్టర్ ఏంటి? అన్నదే కథ.

ఎలా ఉందంటే?
అగధ సినిమాకి టైటిల్ మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. కథ మాత్రం చాలా పాతగా ఉంటుంది. ఇంత వరకు మనం దేవుడు, దెయ్యం అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాల్ని చూసి ఉంటాం. 
అలాంటి కేటగిరీలోకే ఈ చిత్రం కూడా చేరుతుంది. కానీ ఇందులో దేవుడు, దెయ్యం రెండూ మనకు ప్రత్యక్షంగా కనిపించవు. దైవ శక్తి, దుష్టశక్తికి జరిగే పోరు ఎంతో ఇంట్రెస్ట్‌గా, ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా సాగాలి. కానీ ఇందులో అలాంటి అంశాలేవీ కనిపించవు. ఎక్కడా కూడా కొత్త సీన్ గానీ, అద్భుతంగా అనిపించే ఎపిసోడ్స్ కానీ రావు. 

ఫస్ట్ హాఫ్ సో సో గానే అనిపిస్తుంది. ఆరంభం ఓ పది నిమిషాలు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత కామాక్షి పాత్ర ఎంట్రీతో కాస్త డల్‌గానే సాగుతుంది. మహిమ పాత్ర ఆత్మహత్య చేసుకోవడం, హరిణి వింత ప్రవర్తన, సింహా ఎంట్రీ ఇవన్నీ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే కనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఏమంతా గొప్పగా అనిపించదు. ఇక ఆ గుహలో ఏం జరిగింది? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, అగధ ఎవరు అనే ఆసక్తిని రేకెత్తించడంతో ఇంటర్వెల్ కార్డ్‌ను వేస్తారు. సెకండాఫ్ మీద అందరికీ ఓ ఉత్సుకత కలిగేలా కట్ చేస్తారు. 

సెకండాఫ్‌లో ఏదైనా మెరుపులు, కొత్తదనం ఉంటాయని ఆశిస్తే నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. దైవ శక్తిని కూడా గొప్పగా చూపించినట్టు కనిపించదు, దుష్ట శక్తి కూడా అంతగా విజృంభించదు. అసలు ఈ రెండింటి మధ్య అంత యుద్దం, భీకరమైన సన్నివేశాలు కనిపించదు. దైవానికి, దుష్టశక్తికి పోరాటం అంటే మామూలుగానే గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారంతా. కానీ ఇందులో అలాంటి మూమెంట్స్ ఉండవు. పైగా క్లైమాక్స్ సాదాసీదాగా అనిపిస్తుంది. ఇదేంటి ఇంత సింపుల్‌గా తేల్చారు, తేలిపోయినట్టుందే అన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరగా అగధ అద్భుతం అనిపించకపోయినా.. ఓ మోస్తరుగా మెప్పించే అవకాశం ఉంది.

ఎవరెలా చేశారంటే..
కామాక్షి భాస్కర్ల తన పాత్రకు న్యాయం చేసింది. మహాదేవి కట్టూబొట్టూ ఇలా అన్నింట్లోనూ వేరియేషన్స్ చూపించింది. శ్రవణ్ రెడ్డికి నటించే స్కోప్ దక్కింది. విలనిజం బాగానే చూపించాడు. జోవికా, ఉల్కా గుప్తా, భాను చందర్, షిజు, వనితా ఇలా అందరూ మంచి నటనను కనబర్చారు. వైవా రాఘవ్, కనకవ్వ లాంటి ఇతర పాత్రలు కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

సాంకేతిక విషయాలకొస్తే..‘అగధ’ కెమెరామెన్ నాని మంచి అవుట్ పుట్ ఇచ్చారు. విజువల్స్ నేచురల్‌గా ఉంటాయి. సీజీ వర్క్, వీఎఫ్ఎక్స్ మాత్రం గొప్పగా అనిపించవు. రాకేష్ మ్యూజిక్ బాగుంటుంది. జునైద్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. రాజీవ్ సెట్ వర్క్ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉంటాయి. మొదటి సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement