సోషల్ మీడియాలో ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా టాక్ చూస్తుంటే రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఖాతాలో మరో హిట్టు పడినట్లే కనిపిస్తోంది! మొన్నటివరకు థామా, ఇప్పుడు ది గర్ల్‌ఫ్రెండ్‌తో మంచి జోష్ మీదుంది. వీటన్నింటికన్నాముందు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఎంగేజ్‌మెంట్ న్యూస్‌తో వార్తల్లోకెక్కింది. తాజాగా ఓ చిట్‌చాట్‌లో తన భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడింది రష్మిక.
యుద్ధానికైనా రెడీగా ఉండాలి
'నిజాయితీగా చెప్పాలంటే నా భాగస్వామికి నన్ను లోతుగా అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచించి అవగాహన చేసుకోగలగాలి. పరిస్థితులను దాటుకుంటూ అన్నింటినీ అర్థం చేసుకుంటే చాలు. మనిషి మంచివాడై ఉండాలి. నాకోసం యుద్ధం చేయడానికి కూడా వెనుకాడనివాడై ఉండాలి. అలాంటి మనిషి కోసం నేను తూటాకైనా ఎదురెళ్తాను' అని రష్మిక చెప్పుకొచ్చింది.
విజయ్ దేవరకొండను పెళ్లాడతా..
డేటింగ్, పెళ్లి గురించి మాట్లాడుతూ.. యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో డేట్‌కు వెళ్తా.. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటా.. అని చెప్పుకొచ్చింది. రష్మిక- విజయ్ అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ పరోక్షంగా దానిగురించి మాట్లాడుతూనే ఉన్నారు. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేట్ చిత్రాల్లో జంటగా నటించారు.


