అహ! నా పెళ్ళంట! | Rajendra Prasad Aha Naa Pellanta 1987 film | Sakshi
Sakshi News home page

అహ! నా పెళ్ళంట!

Dec 29 2024 4:18 AM | Updated on Dec 29 2024 4:18 AM

Rajendra Prasad Aha Naa Pellanta 1987 film

కథలో పిసినారితనం... కలెక్షన్లు ఫుల్లు

అహ! నా పెళ్ళంట! హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శ కత్వంలో సురేష్‌ ప్రోడక్షన్స్ 1987లో నిర్మించిందీ చిత్రాన్ని. పిసినారితనాన్ని ఆధారంగా చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ సినిమాల విషయంలో టాలీవుడ్‌లో ఓ చరిత్ర సృష్టించింది. మొదట్నుంచి చివరి వరకూ హాస్యాన్ని పండించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రాజేంద్రప్రసాద్‌ ఇందులో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. 

ఆయన సినీ కెరీర్‌లో ‘అహ! నా పెళ్ళంట!’ ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్‌కు వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదంటే అతిశయోక్తి కాదేమే. కోట శ్రీనివాసరావు పిసినారిగా కీలకమైన పాత్ర పోషించారు. హీరోయిన్ గా రజని, ఇంకా నూతన్‌ ప్రసాద్, రాళ్ళపల్లి వంటి సీనియర్‌ నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

పిసినారులకే పిసినారి
సినిమాలో గోల్డెన్  స్పూన్ తో పుట్టిన హీరో రాజేంద్రప్రసాద్‌. తాను ప్రేమించిన అమ్మాయి కోసం పరమ పిసినారిగా నటించాల్సి వస్తుంది. హీరోయిన్  రజని తండ్రి కోట శ్రీనివాస రావు పిసినారులకే పిసినారి. అటువంటి వ్యక్తిని మెప్పించి అతని కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు పిసినారిగా మారిన రాజేంద్రప్రసాద్‌ పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. అందులో భాగంగా హీరో తాను ఇంకా వెయ్యి రెట్లు పిసినారినని నిరూపించుకోడానికి నానా తంటాలు పడుతుంటాడు.

అలా కొంత కాలానికి హీరో ఆ పిసినారి మామకు బాగా దగ్గరవుతాడు. ఇదే సమయంలో.. తన కొడుకు పిసినారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హీరో తండ్రి నూతన్‌ ప్రసాద్‌ కూడా ఆ ఊరొచ్చి ఆ ఇంట్లోనే దిగి తన కొడుకు ప్లాన్లను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతో ఆరంభం నుంచి ముగింపు వరకూ పగలబడి నవ్విస్తాడు డైరక్టర్‌. చివరికి పిసినారి భార్య, కూతురు కలసి తిరగబడి కోటకు బుద్ధి చెప్పి ఈ పెళ్ళికి ఒప్పిస్తారు.

కళ్ళజోడుని రాయితో కొట్టి మరీ...
‘అహ! నా పెళ్ళంట!’ సినిమా కథను ప్రముఖ కథా రచయిత ఆది విష్ణు రాసిన ‘సత్యం గారి ఇల్లు’ నవల ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇక కాస్టింగ్‌ విషయానికొస్తే... కథలో కీలకమైన పాత్ర పిసినారి, హీరోయిన్  తండ్రి లక్ష్మీపతిది. ఈ పాత్రను తొలుత రావు గోపాలరావు పోషిస్తే బావుంటుందని భావించారు. కానీ పాత్ర స్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరి కాదని ఎవరో సూచిస్తే ఆయన్ను కాదనుకుని కోట శ్రీనివాసరావును అనుకున్నారు. అప్పటికి కేవలం రెండంటే రెండే సినిమాల్లో నటించిన కోటను ఈ పాత్రకు తీసుకున్నారు. అందుకు తగ్గట్టే కోట అద్భుతమైన నటనతో కట్టిపడేశారు.

రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావులు పోటీపడి నటించారు. లక్ష్మీపతి పాత్ర కోసం కోట తన జుట్టు చాలా వరకూ తీసేయించుకుని చిన్న తలకట్టుతో క్రాఫ్‌ చేయించుకోవాలి. అప్పటికే మరికొన్ని సినిమాల్లో నటిస్తుండడంతో ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర సినిమాల దర్శక–నిర్మాతలను ఒప్పించి మరీ ‘అహ! నా పెళ్ళంట!’లో ఆ పాత్ర చేశారు. ముతక పంచె, చిరిగిన బనీను, పగిలిన కళ్ళద్దాలతో కనిపించే ఈ రోల్‌ ఆహార్యాన్ని జంధ్యాలే స్వయంగా తీర్చిదిద్దారు. పంచె, బట్టలు మాసిపోయి ఉండాలని, పనిగట్టుకుని దుమ్ములో దొర్లించి మరీ ఇచ్చేవారట. కళ్ళజోడు మామూలుదే తెప్పించి తర్వాత జంధ్యాల రాయిపెట్టి పగలగొట్టి మరీ పగిలిన కళ్ళద్దాలతో నటింపజేశారు.

అరగుండు బ్రహ్మానందంగా...
బ్రహ్మానందంకు ఈ సినిమాతో అరగుండు బ్రహ్మానందంగా బాగా పేరు వచ్చింది. తన జీతాన్ని కోసేసినప్పుడల్లా ఆయన కోట శ్రీనివాస రావును తిట్టే తిట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాను హైదరాబాద్, దేవర, యామి జాల గ్రామాల్లో తీశారు. ఈ గ్రామాల్లో ఉన్న కొన్ని ఇళ్ళలో వేరే సెట్లు వెయ్యకుండానే తియ్యడం ఈ సినిమా మరో ప్రత్యేకత. దాదాపు రూ. 16 లక్షలతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 5 కోట్లు వసూలు సాధించడం విశేషం. సినిమా కథలో ‘పిసినారితనం’ కీలకం... కానీ కలెక్షన్ల విషయంలో ప్రేక్షకులు చాలా ధారాళం చూపించారు. ఈ స్థాయి పిసినారితనం ఉన్న సినిమాలు ‘అహ! నా పెళ్ళంట!’ తర్వాత ఇప్పటివరకూ రాలేదనే చెప్పాలి. భవిష్యత్తులో వస్తాయా? అంటే ప్రశ్నార్థకమే. – దాచేపల్లి సురేష్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement