ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించి, సంగీతాన్ని అందించిన ‘గేదెలరాజు’ ఓటీటీలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికంగా రీ-వాచ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా కొనసాగుతుండగా, ఆహాలో కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. మోటూరి క్రియేషన్స్ బ్యానర్‌పై రఘు కుంచే సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. ఆయన నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
గేదెల రాజు కథేంటంటే..
కాకినాడకు చెందిన రౌడీ షీటర్ గేదెల రాజు(రఘు కుంచె) కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. స్థానిక ఎమ్మెల్యే గేదెల రాజుకే టికెట్ కేటాయిస్తాడు. అదే పార్టీకి చెందిన దుర్గ(శ్రీకాంత్ అయ్యంగార్) కూడా టికెట్ ఆశిస్తాడు. వీరిద్దరికి పడకపోవడంతో..ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని కలిసి పని చేయాలని చెబుతారు. అందుకు ఇద్దరు నిరాకరించి..అక్కడ నుంచి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు.
ఎమ్మెల్యే మనిషి కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకుంటారు. గేదెర రాజు సోదరుడు శ్యాంబాబుతో పాటు దుర్గను కూడా పిలిచి విచారిస్తారు. అయితే ఈ కేసుతో వాళ్లకు సంబంధం లేదని తెలుస్తుంది. మరి గేదెల రాజుని చంపిందెవరు? ఎందుకు చంపారు? రిచ్ (వికాస్)-మీరా(మౌనిక), విజయ్ (రామచంద్రం)-సత్య(టీనా శ్రావ్య)లతో గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను పోలీసులు కనిపెట్టారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


