‘గేదెల రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
రఘు కుంచె కీలక పాత్రలో నటిస్తూ సంగీతం సమకూర్చిన తాజా చిత్రం ‘గేదెల రాజు’. చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి ఇతర పాత్రలు పోషించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన ఈ మూవీ నేడు(ఏప్రిల్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాంకథేంటంటే.. కాకినాడకు చెందిన రౌడీ షీటర్ గేదెల రాజు(రఘు కుంచె) కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. స్థానిక ఎమ్మెల్యే గేదెల రాజుకే టికెట్ కేటాయిస్తాడు. అదే పార్టీకి చెందిన దుర్గ(శ్రీకాంత్ అయ్యంగార్) కూడా టికెట్ ఆశిస్తాడు. వీరిద్దరికి పడకపోవడంతో..ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని కలిసి పని చేయాలని చెబుతారు. అందుకు ఇద్దరు నిరాకరించి..అక్కడ నుంచి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు. ఎమ్మెల్యే మనిషి కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకుంటారు. గేదెర రాజు సోదరుడు శ్యాంబాబుతో పాటు దుర్గను కూడా పిలిచి విచారిస్తారు. అయితే ఈ కేసుతో వాళ్లకు సంబంధం లేదని తెలుస్తుంది. మరి గేదెల రాజుని చంపిందెవరు? ఎందుకు చంపారు? రిచ్ (వికాస్)-మీరా(మౌనిక), విజయ్ (రామచంద్రం)-సత్య(టీనా శ్రావ్య)లతో గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను పోలీసులు కనిపెట్టారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ స్టోరీ ఇది. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అని ఈ సినిమాకు క్యాప్షన్ పెట్టారు. అలా ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హత్య చేసిందెవరు అనేది సినిమా చూసే ప్రేక్షకులు చివరి వరకు కనిపెట్టకుండా ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు చైతన్య మోటూరి. అయితే దీని కోసం రెండు లవ్‌స్టోరీలతో పాటు మొత్తం ఐదు ఉపకథలను రాసుకున్నాడు. వాటికి ఈ హత్యకు సంబంధం ఉన్నప్పటికీ.. తెరపై చూస్తుంటే మాత్రం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది.గేదెల రాజు మర్డర్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత దుర్గ పాత్ర ఎంట్రీ.. కార్పోరేటర్ బరిలో ఇద్దరూ ఉండడంతో ఈ హత్య అతనే చేయించాడేమో అనుకునేలోపు అతనికి సంబంధం చూపించారు. ఆ తర్వాత రిచ్ పాత్ర ఎంట్రీ..అతని నేపథ్యం.. మీరాతో ప్రేమాయణం చూపిస్తూనే మరోవైపు విజయ్-సత్యల ప్రేమకథను నడిపించారు. గేదెల రాజు హత్యకు ఈ జంటలకు ఏదో సంబంధం ఉంటుందని అనుకునేలోపు.. డెక్క, శివయ్య పాత్రలను పరిచయం చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సాగదీతగా అనిపిస్తుంది. గేదెల రాజు శత్రువులు ఎవరు? రెండు ప్రేమ కథలతో అతనికి ఉన్న సంబంధం ఏంటనేది చూపించడానికి కథను సాగ..దీశారు. పెద్ద రౌడీ షీటర్ అని మాటల్లో చెప్పడమే కానీ...తెరపై అతని చూసి భయపడేలా ఒక్క సన్నివేశం కూడా ఉండదు. పైగా హత్య రోజు జరిగిన సీన్ కూడా గొప్పగా అనిపించదు. ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించరు. మహాభారతంలోని కనిక నీతి కథకు ఈ కథను ముడిపెట్టిన తీరు బాగుంది.ఎవరెలా చేశారంటే.. గేదెల రాజు పాత్రకు రఘు కుంచె న్యాయం చేశాడు. ఒక రౌడీ షీటర్ మాట తీరు ఎలా ఉంటుందో, ఎలా కోపంగా చూస్తాడో తెరపై రఘు కుంచె అలానే నటించాడు. గోదావరి యాసను కూడా బాగా మ్యానేజ్ చేశాడు. శివయ్యగా రవి ఆనంద్ బాగా నటించాడు. రిచ్‌గా వికాస్, విజయ్‌గా రామచంద్రంతో పాటు టీనా శ్రావ్య, మౌనికలు కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా ఓకే. రఘు కుంచె నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి నిడివి తగ్గించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.