టాలీవుడ్‌లో పుకార్లకు కొదవలేదు. రోజూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అందులో చాలా వరకు తప్పులే అవుతాయి. తాజాగా మూడు పెద్ద సినిమాలపై ప్రచారాలు మొదలయ్యాయి. వాటిపై దాదాపు ఒకేసారి క్లారిటీ కూడా వచ్చేసింది.
గతంలో మగధీర, ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్ సినిమాల తర్వాత రాజమౌళి- రామ్ చరణ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రాజమౌళి సన్నిహిత వర్గాల ప్రకారం.. ప్రస్తుతం రాజమౌళి తదుపరి చేసే చిత్రంపై ఆలోచించే పరిస్థితిలో లేడట. సాధారణంగా తను చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌పై రాజమౌళి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి మహేష్ బాబుతో వారణాసి సినిమా పూర్తయిన తర్వాతే ఆయన నెక్ట్స్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక చరణ్‌తో సినిమా అనేది పూర్తిగా పుకారే.

బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ఠతో మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభరపై కూడా ఓ కొత్త రూమర్ మొదలైంది. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాతే విశ్వంభర విడుదల అవుతుందనే ప్రచారం జరిగింది. దాంతో విశ్వంభర టీమ్ సభ్యులు దీన్ని ఖండించారు. డేట్ ఫిక్స్ చేయనప్పటికీ ఈ ఏడాదిలోనే విశ్వంభర విడుదల అవుతుందని వారు స్పష్టత ఇచ్చారు.

ఇక విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా కథ, స్క్రీన్‌ప్లేలో మార్పులు జరుగుతున్నాయని, ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం లేదని ప్రచారం జరిగింది. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. అయితే ఈ సినిమా యూనిట్‌లో కొందరు వ్యక్తులు ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని తెలిపారు.


