Mega 157: ఉగాదికి స్టార్ట్‌.. సంక్రాంతికి రిలీజ్‌! | Mega 157: Chiranjeevi, Anil Ravipudi Movie Pooja Ceremony | Sakshi
Sakshi News home page

చిరు-అనిల్‌ మూవీ: ఉగాదికి స్టార్ట్‌.. సంక్రాంతికి రిలీజ్‌!

Mar 30 2025 12:15 PM | Updated on Mar 30 2025 1:31 PM

Mega 157: Chiranjeevi, Anil Ravipudi Movie Pooja Ceremony

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్‌లో ఇది 157వ సినిమా. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది సందర్భంగా నేడు (మార్చి 30) రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా జరిగాయి. హీరో వెంకటేశ్‌, నిర్మాతలు అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్‌ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్‌ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్‌ క్లాప్‌ కొట్టారు.

సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని, చిరంజీవి కొత్త గెటప్‌లో కనిపించనున్నారని సమాచారం.

 ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఒక పాత్ర కోసం ఇప్పటికే అదితిరావు హైదరిని సెలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్‌ని ఇంకా ఫైనల్‌ చేయలేదు. చిరంజీవి సినిమాల విషయాలకొస్తే..ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు ‘దసరా’ఫేం శ్రీకాంత్‌ ఓదెలతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అనిల్‌ రావిపూడి చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement